Telugu Global
Others

ఆర్టీసీ సిబ్బంది-యాజ‌మాన్యం ఎడ‌మొగం... పెడ‌మొగం!

హైద‌రాబాద్: ఆర్టీసీ యాజ‌మాన్యం, సిబ్బంది ఎడ‌మొగం-పెడ‌మొగంగా భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో సమ్మె కొత్త మలుపు తిరిగింది.  ఎవ‌రెలా పోతే మాకేంటి అనే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌వైపు పెళ్ళిళ్ళు… మ‌రోవైపు ప‌రీక్ష‌లు… ఇవేమీ ప‌ట్టించుకోకుండా కార్మిక సంఘాలు స‌మ్మె బాట వీడ‌కుంటే అంతే మంకు ప‌ట్టుద‌ల‌తో ఆర్టీసీ యాజ‌మాన్య‌మూ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీగా అధికారిక విభజన అమలులోకి వస్తుండగా… సమ్మె నేపథ్యంలో చోటు చేసుకున్న నాటకీయ, ఉద్రిక్త పరిణామాలు నాలుగు రోజుల ముందే ఆ […]

ఆర్టీసీ సిబ్బంది-యాజ‌మాన్యం ఎడ‌మొగం... పెడ‌మొగం!
X
హైద‌రాబాద్: ఆర్టీసీ యాజ‌మాన్యం, సిబ్బంది ఎడ‌మొగం-పెడ‌మొగంగా భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో సమ్మె కొత్త మలుపు తిరిగింది. ఎవ‌రెలా పోతే మాకేంటి అనే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌వైపు పెళ్ళిళ్ళు… మ‌రోవైపు ప‌రీక్ష‌లు… ఇవేమీ ప‌ట్టించుకోకుండా కార్మిక సంఘాలు స‌మ్మె బాట వీడ‌కుంటే అంతే మంకు ప‌ట్టుద‌ల‌తో ఆర్టీసీ యాజ‌మాన్య‌మూ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీగా అధికారిక విభజన అమలులోకి వస్తుండగా… సమ్మె నేపథ్యంలో చోటు చేసుకున్న నాటకీయ, ఉద్రిక్త పరిణామాలు నాలుగు రోజుల ముందే ఆ ప‌రిస్థితికి తెచ్చాయి. మంచి వాతావ‌ర‌ణంలో జ‌ర‌గాల్సిన ‘విభజన’ కాస్తా క‌లుషిత వాతావ‌ర‌ణంలో ఖరారైపోయింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు వేత‌నాలు ఖ‌రార‌య్యే ప‌రిస్థితి క‌నుమ‌రుగై పోయింది. కార్మిక సంఘాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు క్షేత్రస్థాయిలోనూ కార్మికులకూ, ఆర్టీసీ యాజమాన్యానికీ మధ్య దూరం బాగా పెరిగిపోయింది. సమ్మెలో ఉద్రిక్తతల ‘స్థాయి’ తీవ్రమైంది. 43 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు మరిన్ని డిమాండ్లతో బుధవారం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఎండీ చర్చను ప్రారంభిస్తూ ‘‘చర్చలకు సిద్ధమని పత్రికాముఖంగా చెబుతున్నారు కాబట్టి… మిమ్మల్ని ఆహ్వానించాను. మంత్రి శిద్ధా రాఘవరావు వద్దకు తీసుకెళతాను. మీరు మాట్లాడుకోండి. 27 శాతం ఫిట్‌మెంట్‌ కూడా చాలా రిస్క్‌తోనే ప్రకటించాం. అది కూడా ఏపీలోని కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణలో అంతకన్నా ఎక్కువైనా ఇవ్వొచ్చు. తక్కువైనా ఇవ్వొచ్చు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాచారం లేదు. ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఒక్క‌టిగా స్పందిస్తే ఏమైనా చేయ‌గ‌లం. టీ-సర్కారు స్పందించడం లేదు. వేచి చూసే ధోర‌ణి అవ‌లంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు మాత్రమే ఎంతో కొంత స్పందిస్తోంది. మేం చేయ‌గ‌లిగింది ఏమీ లేదు’’ అని సాంబ‌శివ‌రావు తెలిపారు. దీంతో టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘‘ఆ విషయం ముందే చెబితే చర్చలకు వచ్చేవాళ్లం కాదు కదా! ఈయూతోనే మాట్లాడుకుంటే సరిపోయేది కదా’’ అని ప్రశ్నించారు. ‘‘కార్మిక నేతలు అందుబాటులో ఉండడంలేదని, ఫోన్లకు స్పందించడంలేదని చెబుతున్నారు. మీరు మమ్మల్ని ఎప్పుడు పిలిచారు? పైగా… కార్మిక సంఘాలకు రూ.90 లక్షలు ఇచ్చామని చెబుతున్నారు. మీ సొంత డబ్బులు ఇచ్చారా? కార్మికుల నుంచి మినహాయించుకున్న డబ్బునే కార్మిక సంఘాలకు ఇస్తారు. మీ మాటలతో ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళతాయి? ఎండీలుగా వచ్చి విదేశాలకు వెళ్లిన వాళ్లను చూశాం. ఎండీలు వస్తుంటారు… పోతుంటారు’’ అని అశ్వత్థామరెడ్డి, పద్మాకర్‌ రావు వ్యాఖ్యానించారు. దీనిపై సాంబ‌శివ‌రావు కూడా ధీటుగానే స్పందించారు. ‘‘విదేశాలకు వెళ్లిన వారిని అడగండి. నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు. అలా అయితే మీతో మాట్లాడేది లేదు. మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి కాదు నేను ఇక్కడ ఉన్న‌ది. ఏమైనా ఉంటే జేఎండీతో మాట్లాడుకోండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి, సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. దీంతో కార్మిక సంఘాల‌కు ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలతో ఆర్టీసీ ‘దారులు’ వేరయ్యాయి. మ‌రో నాలుగు రోజులు ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే అప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీగా మారిపోయి వేరు ప‌డ‌తాయి… అప్పుడు వీరి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మ‌రింత జ‌ఠిల‌మ‌వడం ఖాయం. వేచి చూసే ధోర‌ణిలో ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉండ‌డం… స‌మ‌యం, సంద‌ర్భం చూసుకోకుండా ఆర్టీసీ సిబ్బంది స‌మ్మెకు దిగ‌డంతో ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఎవ‌రెలా పోతే మాకేంటి అనే ధోర‌ణిలో ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు… కార్మిక సంఘాలు ఉన్నాయి.-పీఆర్‌
First Published:  9 May 2015 12:27 AM GMT
Next Story