Telugu Global
Family

బకాసురుడు (FOR CHILDREN)

బకాసురుడు!             అడ్డూ అదుపూ లేకుండా అమాంతం దేన్నైనా మింగేసేవాడిని బకాసురుడని అలవాటైన అర్థంలో వాడుతూ ఉంటాం!             నిజానికి బకము అంటే కొంగ. అసురుడు – సురుడు కాని వాడు అసరుడు. దేవతలు కాని వారు రాక్షసులు – రాక్షసుడు. కొంగ రాక్షసుడనే అర్థం వస్తుంది. అయితే భాగవతంలో ఇందుకు సంబంధించిన కథ కూడా ఉంది. బలరామకృష్ణులు పశువుల్ని మేపి ఇంటికి తిరిగి వస్తూవుంటే బకుడు పెద్ద కొంగరూపంలో వచ్చి కృష్ణుణ్ని మింగేసాడట. అప్పుడు కృష్ణుడు […]

బకాసురుడు!

అడ్డూ అదుపూ లేకుండా అమాంతం దేన్నైనా మింగేసేవాడిని బకాసురుడని అలవాటైన అర్థంలో వాడుతూ ఉంటాం!

నిజానికి బకము అంటే కొంగ. అసురుడు – సురుడు కాని వాడు అసరుడు. దేవతలు కాని వారు రాక్షసులు – రాక్షసుడు. కొంగ రాక్షసుడనే అర్థం వస్తుంది. అయితే భాగవతంలో ఇందుకు సంబంధించిన కథ కూడా ఉంది. బలరామకృష్ణులు పశువుల్ని మేపి ఇంటికి తిరిగి వస్తూవుంటే బకుడు పెద్ద కొంగరూపంలో వచ్చి కృష్ణుణ్ని మింగేసాడట. అప్పుడు కృష్ణుడు ఆ కొంగ కంఠము చీల్చి బయటకొచ్చాడట.

అందుకేనేమో బకవైరి అంటే “కృష్ణుడ’ని అర్థం ఉంది. ఇంకో అర్థం కూడా వుంది… “భీముడు” అని! భారతంలో అందుకు సంబంధించిన కథ కూడా ఉంది.

పూర్వం ఏక చక్రపురం అనే పురం అంటే ఊరు ఉండేది. అది పేరుకు ఊరే గాని దాని తీరు వల్లకాడుగా వుంది. బకాసురుడు ఊరిమీద పడి దొరికినోళ్ళను దొరికినట్టు మింగేసేవాడు. పశువులూ పక్షులూ మనుషులు అన్న తేడా లేదు. పంటా తిండీ దేన్నీ వదిలేవాడు కాదు. ఎప్పుడు ఎవరు గుటుక్కుమంటారో తెలీదు. అందుకే ఆ ఊరివాళ్ళందరూ జట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు. అంతా కలిసి బకాసురుని దగ్గరకు వెళ్ళి మొత్తుకున్నారు. నువ్వు మా ఊరి మీద పడాల్సిన అవసరం లేదన్నారు. తామే ఇంటికొరకు చప్పున వస్తామన్నారు. ఆహారమవు తామన్నారు. బండితో బండెడు అన్నమూ బండిని లాగిన రెండు పోతులూ వాటిని తీసుకొచ్చే మనిషీ – ప్రతిరోజూ మీకు సమర్పించుకుంటామని మొక్కారు. నీ భక్షణ కొచ్చిన ఆటంకం లేదని వేడుకొని ఒప్పందం చేసుకున్నారు.

ఆప్రకారమే ఇంటికొకరు ఆహుతవుతున్నారు. ఎవరిల్లు వంతు వస్తే ఆ ఇంట్లో ఏడుపులే. శోకాలే. అప్పటికి ఆగ్రామంలో ఉన్న భీముడది విన్నాడు. బకాసురుడి గురించి తెలుసుకున్నాడు. ఆ ఇంటి వంశాంకురం వంతు తాను వెళ్తానన్నాడు. వద్దని వారించినా ఒప్పలేదు. చివరకు భీముడు రెండడ్ల బండి పూయించి బండెడన్నంతో బకాసురుడు ఉండే గుహ దగ్గరకు వెళ్ళాడు. బకాసురుడు సమయానికి లేడు. ఆ బండెడన్నమూ భీముడే తిని తేన్చు తున్నప్పుడు బకాసురుడు వచ్చాడు. భీముణ్ని ఒక్క గుద్దు గుద్దాడు. భీముడు కాచుకోవడమే కాదు తిరిగి గుద్దాడు. ఒకటి కాదు, వందల కొద్దీ పిడిగుద్దులు కురిపించాడు భీముడు. బకాసురుడు నేలకు ఒరిగిపోయాడు. ఊపిరివదిలాడు. బకాసురుడి పీడ ఆ ఊరికి వదిలింది. వేడుక చేసుకున్నారు.

బ్రహ్మ వైవర్తపురాణంలో బకాసురునికి సంబంధించి మరో కథ ఉంది. పూర్వ జన్మలో బకాసురుడు గంధర్వుడని శివభక్తుడని – ప్రతిరోజూ ఒక కమలాన్ని తెచ్చి శివున్ని పూజించేవాడని – ఒకరోజు పార్వతి కొలనులోంచి కమలాన్ని కోసాడనీ పార్వతి కోపగించుకున్నదనీ – ఆమె ఏ కృష్ణుణ్ని పూజించడం కోసం కమలాన్ని ఉంచిందో ఆకృష్ణుణ్ని చూడాలని బకాసురుడు కోరడం – ఆకోర్కె తీరడంకోసం భూలోకంలో రాక్షసుడివై పుట్టాలని శపిస్తూనే – తిరిగి శ్రీకృష్ణుని దర్శనానంతరం విమోచనంకలిగి విముక్తడవుతావని చెప్పిందట పార్వతి.

బకాసురడికి ఆకలే కాదు, కథలూ ఎక్కువే!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  10 May 2015 1:02 PM GMT
Next Story