Telugu Global
Family

మాటల్లేని ప్రశ్న (Devotional)

            టిబెట్‌ మార్మికుడయిన మార్పాకు సంబంధించిన కథయిది. ఎవరో ఒక వ్యక్తి మార్పా దర్శనానికి వచ్చాడు. అతను ఏదో అడగాలన్న ఉద్దేశంతో వచ్చాడు. అతను చిత్రంగా అడిగాడు. అద్భుతంగా ప్రశ్నించాడు. “దాన్ని గురించి నాకు ఏదయినా చెప్పు. నేను దాన్ని గురించి విన్నాను. దాన్ని గురించి వివరించడానికి వీలుపడదు. అది చెప్పడానికి వివరించడానికి మాటలు వుపయోగించకూడదు. అక్కడ భాష నిష్ఫలమవుతుంది. కాబట్టి పదాలు పట్టివ్వలేని, మాటలు అందివ్వలేని దాన్ని గురించి […]

టిబెట్‌ మార్మికుడయిన మార్పాకు సంబంధించిన కథయిది. ఎవరో ఒక వ్యక్తి మార్పా దర్శనానికి వచ్చాడు. అతను ఏదో అడగాలన్న ఉద్దేశంతో వచ్చాడు. అతను చిత్రంగా అడిగాడు. అద్భుతంగా ప్రశ్నించాడు. “దాన్ని గురించి నాకు ఏదయినా చెప్పు. నేను దాన్ని గురించి విన్నాను. దాన్ని గురించి వివరించడానికి వీలుపడదు. అది చెప్పడానికి వివరించడానికి మాటలు వుపయోగించకూడదు. అక్కడ భాష నిష్ఫలమవుతుంది. కాబట్టి పదాలు పట్టివ్వలేని, మాటలు అందివ్వలేని దాన్ని గురించి నాకు వివరించు” అని అడిగాడు.

ఆ మాటలు విని మార్పా “నవ్వాడు. “నేను తప్పక చెబుతాను. సందేహం లేదు. అయితే ఒకటే షరతు. పదాలు లేని ప్రశ్న నువ్వు వెయ్యాలి. మాటలతో సంబంధంలేని సందేహం కావాలి. అట్లాంటి ప్రశ్న ఎప్పుడయితే వేస్తావో అప్పుడు నేను సమాధానమిస్తాను” అన్నాడు.

అప్పుడా వ్యక్తి “పదాలతో పని లేకుండా నేను ఎలా ప్రశ్నించేది?” అన్నాడు మార్పా “అది నీ సమస్య. నా సమస్య కాదు. సమస్య గురించి నువ్వే ఆలోచించు. నా సమస్య నేను సమాధానమిచ్చేటప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రశ్నించడమెలా అన్నది నీ సమస్య” అన్నాడు.

ఆ వ్యక్తి ఆ విషయం గురించి గంభీరంగా అడిగాడు. ఆషామాషీగా అడగలేదు. మార్పా మాటలు విన్నాడు. ఆలోచనలో పడ్డాడు. “మాటల్లేకుండా ప్రశ్నించడమెలా? నిజమే మార్పా చెప్పింది సరైందే. ఎందుకంటే మాటలతో సంబంధంలేని సమాధానాన్ని నువ్వు ఆశిస్తే మాటలతో సంబంధంలేని ప్రశ్ననే నువ్వు అడగాలి. నిజమే కదా!”

ఆ వ్యక్తి దాన్ని గురించి ధ్యానం చేశాడు. ఆలోచించాడు. అది అసాధ్యమనిపించింది. సంవత్సరాలు గడిచిపోయాయి. అది నిరంతరమయిన, ఎడతెగని పరిశోధన. అక్కడ ఆలోచనలు ఆగిపోతాయి. మనిషి శూన్యంగా మిగిలిపోతాడు. దాంతో ఆ వ్యక్తి మార్పా దగ్గరకు రావడం మానేశాడు. కొన్నాళ్ళు గడిచాయి. ఆ వ్యక్తి మార్పా దగ్గరకు మళ్ళీ వచ్చేలా అనిపించలేదు.

ఒకరోజు హఠాత్తుగా మార్పా వెళ్ళి ఆ వ్యక్తి ఇంటి తలుపు తట్టాడు. ఆ వ్యక్తి తలుపు తీశాడు. మార్పా ఆ వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వాడు. “నువ్వు నన్ను ప్రశ్నించావు, నేను సమాధాన మిచ్చాను” అన్నాడు.

ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు.

ఆ రోజు మొదలు ఆ ప్రశ్నించిన వ్యక్తి మార్పాని అనుసరించాడు, అనుయాయి అయ్యాడు. అతను ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.

అతన్ని చూసిన వ్యక్తులు అతన్ని గురించి మార్పాతో “ఇతనెప్పుడూ ఎందుకూ నవ్వుతూ ఉంటాడు?” అని అడిగే వాళ్ళు.

మార్పా “ఏం లేదు, ఇతను మాటలతో పనిలేకుండా నన్ను ప్రశ్నించాడు. నేను మాటలతో సంబంధం లేకుండా సమాధానమిచ్చాను. అందువల్ల అప్పటి నించీ నవ్వుతున్నాడు” అన్నాడు.

హేతువు ఆలోచనకు సంబంధించింది.

రహస్యం ఆలోచనకు అందని స్థితికి చెందింది.

– సౌభాగ్య

First Published:  10 May 2015 1:03 PM GMT
Next Story