Telugu Global
Family

ఏకలవ్యుడు (FOR CHILDREN)

            ఏదైనా విద్య నేర్చుకోవాలంటే గురువుండాలి? తప్పొప్పులు చెప్పగలిగేలా వుండాలి! అనుభవాల్ని పాఠాలుగా ఇవ్వగలగాలి? మెలుకువలు తెలిపి రాణించేలా చేయగలగాలి! నమ్మకాన్నే కాదు, నైపుణ్యాన్ని ఇవ్వగలగాలి! విద్యార్థిలోవున్న శక్తి యుక్తుల్ని వెలికి తీయగలగాలి!             గురువులేని విద్యను ఊహించలేం. అయితే ఎన్నుకున్న గురువు విద్య నేర్పడానికి నిరాకరిస్తే? కులం తక్కువని కాదంటే? ఏం చేయాలి? ఏకలవ్యుడయితే ద్రోణాచార్యుల వారు కాదన్నా కృంగిపోలేదు. గురువుగారి మట్టిబొమ్మను ప్రతిష్టించుకొని పరోక్షంగానైనా నీవే గురువనుకున్నాడు. తనకి తానుగా పట్టుదలగా విలువద్యను నేర్చుకున్నాడు. […]

ఏదైనా విద్య నేర్చుకోవాలంటే గురువుండాలి? తప్పొప్పులు చెప్పగలిగేలా వుండాలి! అనుభవాల్ని పాఠాలుగా ఇవ్వగలగాలి? మెలుకువలు తెలిపి రాణించేలా చేయగలగాలి! నమ్మకాన్నే కాదు, నైపుణ్యాన్ని ఇవ్వగలగాలి! విద్యార్థిలోవున్న శక్తి యుక్తుల్ని వెలికి తీయగలగాలి!

గురువులేని విద్యను ఊహించలేం. అయితే ఎన్నుకున్న గురువు విద్య నేర్పడానికి నిరాకరిస్తే? కులం తక్కువని కాదంటే? ఏం చేయాలి? ఏకలవ్యుడయితే ద్రోణాచార్యుల వారు కాదన్నా కృంగిపోలేదు. గురువుగారి మట్టిబొమ్మను ప్రతిష్టించుకొని పరోక్షంగానైనా నీవే గురువనుకున్నాడు. తనకి తానుగా పట్టుదలగా విలువద్యను నేర్చుకున్నాడు. అతని అనుభవాలూ సాథనే అతణ్ని తీర్చిదిద్దాయి. ద్రోణుని దగ్గర విద్య నేర్చుకున్న అతని శిష్యులకే కాదు, గురువుగారు కూడా అబ్బురపడేలా చేసాయి. అసూయకూ దారితీసాయి. ఆచార్యులవారు అర్థించేలా చేసాయి. ఏకలవ్యుణ్ణి ఓడించి గెలిపించాయి!

అడవిలోవుండే హిరణ్య థ్వనుడనే ఎరుకలవాని కొడుకే గురికల ఏకలవ్యుడు. పుట్టుకతో వచ్చిన విద్య వేట. వృత్తి వేట. విలు విద్య నేర్చుకోవాల్సిన విద్య. థనుర్విద్యలందు ద్రోణున్ని మించిన వారు లేరని విన్నాడు. విని వెళ్ళాడు. కౌరవ పాండవులకు విద్య నేర్పుతున్న ద్రోణున్ని కలిసాడు. కోరిక తెలిపి అనుగ్రహించమన్నాడు. ద్రోణుడందుకు నిరాకరించాడు. ఏకలవ్యుడు తిరిగి అడవికి వచ్చాడు. ద్రోణుని మట్టిబొమ్మను చేసి గురువుగా తలంచి తలవంచి తనకు తానుగా విద్య నేర్చుకున్నాడు. కృషితో మనో అభీష్టము నెరవేరింది. “శబ్ద వేది” అంటే శబ్దాన్ని విని బాణంతో లక్ష్యాన్ని గురితప్పనివ్వకుండా కొట్టడం కూడా నేర్చుకున్నాడు.

ఒకరోజు అర్జునుడు అదే అడవికి వేటకు వచ్చాడు. వెంట తెచ్చిన వేటకుక్క వేటాడాల్సిన జంతువుని తరుముతూ అరుస్తోంది. ఆశబ్దం విని శబ్దవేది ప్రయోగించాడు ఏకలవ్యుడు. ఆకుక్క అరవకుండా నోట్లో బాణాలు దిగాయి. అర్జునుడు ఆశ్చర్యంతో చుట్టూ చూసాడు. గ్రహించాడు. ఏకలవ్యుణ్ణి, గురువుగా ద్రోణుని ప్రతిమని చూసి గ్రహించాడు. జరిగిన విషయం గురువుగారికి చెప్పాడు. ద్రోణుడు ఆశ్చర్యంతో అడవికి వచ్చాడు. చూసాడు. ఏకలవ్యుడు అతనికి గుర్తుకూడా లేడు. ద్రుపదుని చేత జరిగిన అవమానం గుర్తుంది. పాండవ మధ్యముడికి ఇచ్చిన మాట – విలు విద్యలో నిన్నుమించినవాడు లేకుండా చేస్తాను – గుర్తుంది. ఆ మాటను అర్జునుడు గుర్తు చేయడమూ గుర్తుంది.

ఏకలవ్యునికయితే ఏదీ గుర్తు లేదు. కులం తక్కువని విద్య నేర్పలేదన్నదీ గుర్తులేదు. అందుకే గురుదక్షిణ ఏమివ్వగలనన్నాడు. ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలిని అడిగాడు ద్రోణుడు. బొటన వేలు ఇస్తే విలువిద్యసరే, విల్లుని ఎక్కుపెట్టలేనని తెలిసికూడా కోరిన విధంగా కుడిచేతి బొటన వేలిని కోసి ఇచ్చాడు. శిష్యుని ముందు చిన్నబోయి నిలబడలేని ద్రోణుడు శిష్యులతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.

వేలు తెగి – వేళ్ళు తెగిన చెట్టులా మిగిలాడు ఏకలవ్యుడు!

ఓడి గెలిచినవాడు ఏకలవ్యుడు!!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  11 May 2015 1:17 PM GMT
Next Story