సీఎంలు, గ‌వ‌ర్న‌ర్‌లు… ప‌రుగో ప‌రుగు!

ప్రాణం భ‌యం అంద‌రికీ ఒక‌టే క‌దా! సీఎం అయినా సామాన్యుడైనా తేడా ఏమీ ఉండ‌ద‌ని నిరూపిత‌మైంది మంగళవారం మ‌రోసారి. నేపాల్‌ భూకంపతాకిడితో భారతదేశంలోని పలు పట్టణాలు కంపించిపోయాయి. భవనాలు ఊగిపోయాయి. సామాన్య ప్రజలు మొదలు ప్రముఖుల వరకు అందరూ ప్రాణాలరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పాట్నాలో 7 సర్క్యులర్‌ రోడ్డులోని అధికారిక నివాసంలో ఉన్న బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్ భూ ప్రకపంనలతో భవనం ఊగి పోతుండటంతో ఒక్క ఉదుటన బయటకు పరుగుదీశారు. రాజ్‌భవన్‌లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న బీహార్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి కూడా ప్రకంపనల తాకిడికి లాన్‌లోకి వచ్చేశారు. పుస్తకావిష్కరణలో పాల్గొనేందుకు వచ్చిన వారు సైతం బయటకు పరుగులు తీశారు. పాట్నాలో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్‌ కుమార్ మోడీ ఉన్నపళంగా సమావేశం నుంచి బయటకు పరుగుపెట్టారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ అధికారులతో సమావేశంలో ఉండగా ప్రకంపనలు సంభవించడంతో ఆయన భవనం నుంచి వెలుపలికి వచ్చేశారు. లఖ్‌నవ్‌లో అధికారిక కార్యక్రమంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, పలువురు అధికారులూ భవనం నుంచి బయటకు పరుగుపెట్టారు. భూకంపం సంభవించినప్పుడు నేపాల్‌లో పార్లమెంటు సమావేశం జరుగుతోంది. పార్లమెంటు భవనం ఒక్కసారిగా ఊగిపోవడంతో పార్లమెంటు సభ్యు లు భయంతో బయటకు పరుగులుదీశారు.