Telugu Global
Family

త్రిశంకుడు (FOR CHILDREN)

            “త్రిశంకు స్వర్గం” అనే మాట విన్నారు కదా? భూలోకానికీ స్వర్గలోకానీ మధ్యన వుండే – స్వర్గ స్థానమే త్రిశంకు(డి) స్వర్గం! మరి అటు స్వర్గలోకమూ చేరలేక ఇటు భూలోకమూ చేరక మధ్యలో అటుయిటూకాకుండా తలక్రిందులుగా వేళ్ళాడే త్రిశంకుడెవరు? ఏమా కథ?             సూర్యవంశపు రాజైన త్రిధ్వనుని కుమారుడే సత్యవ్రతుడు. సత్యవ్రతుడే త్రిశంకుడు. ఒకనాడు వివాహితని సత్యవ్రతుడు బలవంతంగా ఎత్తుకురావడంతో తండ్రి నగర బహిష్కారం చేసాడు. ఎక్కడికి పోవాలో తెలియక […]

“త్రిశంకు స్వర్గం” అనే మాట విన్నారు కదా? భూలోకానికీ స్వర్గలోకానీ మధ్యన వుండే – స్వర్గ స్థానమే త్రిశంకు(డి) స్వర్గం! మరి అటు స్వర్గలోకమూ చేరలేక ఇటు భూలోకమూ చేరక మధ్యలో అటుయిటూకాకుండా తలక్రిందులుగా వేళ్ళాడే త్రిశంకుడెవరు? ఏమా కథ?

సూర్యవంశపు రాజైన త్రిధ్వనుని కుమారుడే సత్యవ్రతుడు. సత్యవ్రతుడే త్రిశంకుడు. ఒకనాడు వివాహితని సత్యవ్రతుడు బలవంతంగా ఎత్తుకురావడంతో తండ్రి నగర బహిష్కారం చేసాడు. ఎక్కడికి పోవాలో తెలియక సత్యవ్రతుడు అదే విషయం అడిగాడు. “పో… పోయి కుక్కలను తినేవాళ్ళతో కలిసిపో…” అనడంతో నగరం వదిలి వెళ్ళాడు త్రిశంకుడు.

ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు ఆ రాజ్యం కరువు కాటకాలతో విలవిల్లాడి పోతూఉండేది. వసిష్ఠుడు రాజ్యాన్ని రక్షిస్తూ ఉండేవాడు. అదే సమయంలో విశ్వామిత్రుని కుటుంబం ఆకలికి తాళలేక వీధిన పడింది. “కన్నకొడుకును ఇస్తాను… నూరు ఆవులిస్తారా? లేదంటే మమ్మల్ని పోషిస్తారా?” అని కొడుకు కంఠానికి తాడు వేసి విశ్వామిత్రుడు తిప్పుతూవుంటే, పోషించడానికి సత్యవ్రతుడు ముందుకొచ్చాడు. వెనక కారణమూవుంది. వసిష్ఠుడు తన తండ్రిని సమర్థించాడే తప్ప, తనని సమర్థించలేదు. అలాంటి వసిష్ఠునికి విరోధి విశ్వామిత్రుడు. శత్రువుకి శత్రువంటే తనకు మిత్రుడే అన్నట్టు. పైగా వసిష్ఠుని ధేనువుని వధించాడు సత్యవ్రతుడు. ఆకలిచేత తానే తిన్నాడు. వశిష్ఠునికి ఈ విషయాలన్నీ తెలిసాయి. ఒకటి – తండ్రిని బాధ పెట్టే పనిచేయడం, రెండు – ధేనువుని వధించడం, మూడు – వధించిన పశువు మాంసం తినడం – ఇలా మూడు విధాల హృదయ శంకువులను నీకు నువ్వే కల్చించుకున్నావు గనుక త్రిశంకుడివైయ్యావని వసిష్ఠుడు అనడంతో ఆనాటి నుండి సత్యవ్రతుడు త్రిశంకుడిగానే పిలువబడ్డాడు. శంకువు అంటే మేకు, బల్లెము, స్థంభము, గుండు సూది అనే అర్థాలున్నాయి.

త్రిశంకుడికి దేహంతో స్వర్గానికి పోవాలని కోరిక కలిగింది. అంటే చనిపోయాక కాదు, బతికి ఉండగానే. అందుకు యాగం చెయ్యాలని వసిష్ఠుని యాచించాడు. వసిష్ఠుని కొడుకులనూ యాచించాడు. అంతా నిరాకరించడంతో త్రిశంకుడు నిందించాడు. దాంతో “ఛండాలుడివి కమ్ము” అని వాళ్ళు శపించారు. అలా వ్యాధిగ్రస్తుడై రాజ్యం విడిచిపెట్టాడు త్రిశంకుడు. అయితే ఆ కార్యానికి విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వసిష్ఠుని మీద వైరంతోనూ – తనను త్రిశంకుడు ఆదరించాడన్న అభిమానంతోనూ పూనుకున్నాడు. అయితే విశ్వామిత్రునికి తోటి మునులు సహా శిష్యులు కూడా సహకరించలేదు. విశ్వామిత్రుడు ఊరుకుంటాడా?, లేదు… తన తపః శక్తితో త్రిశంకుణ్ని స్వర్గలోకం పంపిస్తుండగా అది తెలిసి ఇంద్రుడు స్వర్గలోకపు తలుపులు మూసివేసాడు. త్రిశంకుణ్ని కిందికి పడదోసాడు. స్వర్గం నుండి తలక్రిందులుగా జారిపడుతూ కూడా తన కోరికను మరిచిపోలేదు. కోరిక తీర్చే విశ్వామిత్రుణ్ని కూడా! మనసులోనే తలచాడు. అదే సమయంలో దేవతలు విశ్వామిత్రుని మనసు మరల్చారు. ఇంకేముంది? త్రిశంకుడికి తలక్రిందులుగా వున్నచోటే – అటు స్వర్గానికీ కాక – ఇటు భూలోకానికీ చేరక మధ్యలో సొంత స్వర్గం ఏర్పాటుకాగా అందులో ఉండిపోయాడు.

అయితే, త్రిశంకుడు కులం తక్కువవాడు కావడం వల్లనే స్వర్గలోక ప్రవేశం కాకుండా ఇంద్రాది దేవతలు అడ్డుకున్నారనీ, పడదోసారని జానపదులు కథలుగా చెప్పుకుంటారు. ఇతని కొడుకే హరిశ్చంద్రుడు.

అందుకే త్రిశంకు స్వర్గంలో వుండొద్దని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  12 May 2015 1:01 PM GMT
Next Story