కఠినమయిన మాటలు (FOR CHILDREN)

మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం తన జీవితంలోని కొన్ని సంఘటనలను తరచూ వివరిస్తూ ఉంటారు. వాటిలో ఆసక్తి కరమయిన ఒక సంఘటన అందరూ తెలుసుకోదగింది.

మానవ సంబంథాల్లో మాటలు విలువైనవి. అనుబంథాల్లో వాటిని అర్థవంతంగా ఉపయోగించాలి. విచక్షణతో మాట్లాడాలి.

ఒకరోజు అబ్దుల్‌కలాం స్కూలు నించి ఇంటికి వచ్చి తరువాత ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. చీకటిపడుతుండగా ఇంటికి వచ్చాడు. బాగ ఆకలిగా ఉంది. భోజనం పెట్టమని అమ్మను అడగడానికి వెళ్ళాడు. అప్పటికే ఆయన తండ్రి భోజనానికి కూచున్నాడు. తల్లి పెనం మీద రొట్టెలు కాలుస్తోంది. వేడి వేడి పొగలు వస్తున్నాయి. ఆమె ఒక వేపు కూర వండుతూ, ఇంకో వేపు రొట్టెలు కాలుస్తోంది. తండ్రి పనిమీద బయటికి వెళ్ళి అలసిపోయినట్లున్నాడు. ప్లేటు సిద్ధం చేసుకుని భార్య వేసే రొట్టె కోసం ఎదురు చూస్తున్నాడు.

చిన్నవాడయినా, ఆకలివేస్తున్నా ఆ దృశ్యం చూసిన అబ్దుల్‌ కలాం చల్ల బడ్డాడు. ఎందుకంటే తనకన్నాముందు తన తండ్రి రొట్టెలు తినడానికి కూచున్నాడు. పైగా అలసిపోయినట్లున్నాడు. ఆకలితో వున్నట్లు ఉన్నాడు. తండ్రి తినేదాకా ఆగుదామనుకున్నాడు.

కలాం తల్లి చెమట తుడుచుకుంటూ ఒకవేపు కూర కలుపుతూ ఇంకో వేపు రొట్టెలు కాలుస్తోంది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుందో, పిల్లలకూ తల్లిదండ్రులంటే అంతే ప్రేమ ఉంటుంది. గారాబం చేసిన పిల్లలు అన్నీ తమకే కావాలనుకుంటారు. వాళ్ళలో స్వార్థం ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచించరు.

అబ్దుల్‌ కలాం అలాంటివాడు కాదు. తల్లిదండ్రుల కష్ట సుఖాలు తెలిసినవాడు. అందుకని తండ్రి తినేదాకా ఆగుదామని నిర్ణయించుకున్నాడు.

తల్లి వేడివేడిగా రొట్టెను తండ్రి ప్లేటులో వేసింది. తొందరలో కూరపైన, రొట్టెలపైన రెంటిమీద దృష్టి పెట్టాల్సి రావడంతో రొట్టె బాగా మాడిపోయింది. ఆమె చూసుకోలేదు. భర్త ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ రొట్టెను తిన్నాడు. భార్య “రొట్టె ఎలా ఉంది?” అని అడిగింది. భర్త “చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది” అన్నాడు.

ఇదంతా అబ్దుల్‌ కలాం చూస్తున్నాడు. మాడిపోయిన రొట్టెను మనసారా తిన్న తండ్రిని చూసి విస్తుపోయాడు. కలాం కూడా తిన్న తరువాత తండ్రితో కలిసి పక్క గదిలోకి వెళ్ళాడు. కొడుకుతో తండ్రి “ఈరోజు ఎలా గడిచింది? స్కూలు విశేషాలేమిటి?” అని అడిగాడు.

కలాం ఆ విషయాలకు సమాధానం చెప్పకుండా “నాన్నా! అమ్మ మాడిపోయిన రొట్టె వేసినా నువ్వు అది చాలా రుచిగా ఉంది అన్నావు. నిజంగా రుచిగా వుందా?” అని అడిగాడు.

ఆ మాటలకు తండ్రి నవ్వి “నాయనా! రొట్టె మాడిపోయింది. నిజమే కానీ మీ అమ్మ ఉదయం నించీ ఇంటి పనితో ఎంతో అలసిపోయింది. రొట్టె మాడిపోయింది. కాల్చేటప్పుడు చూసుకోవా? అంటే ఆ కఠినమైన మాటతో ఆమెను బాధ పెట్టిన వాణ్ణవుతాను. అదే బావుంది అంటే ఆమె సంతోషిస్తుంది. మనసును బాధ పెట్టడం సులభం. కాబట్టి ఎప్పుడూ మాటలు కఠినంగా ఉండకూడదు. మనషుల్ని దగ్గరికి చేర్చేవి మంచి

మాటలే” అన్నాడు.

ఆ అనుభవాన్ని కలాం ఎప్పటికీ గుర్తుంచుకున్నాడు.

-సౌభాగ్య