Telugu Global
Family

దాతృత్వం (Devotional)

             రాజులందరూ చెడ్డవాళ్ళని అందర్నీ ఒకే గాట కట్టెయ్యలేం. కొందరు దుర్మార్గులుంటారు. కొందరు మంచి వాళ్ళుంటారు. ప్రజల్ని పట్టించుకోని స్వార్ధపరులుంటారు, అధికారం చెలాయించే అహంకారులుంటారు, ప్రజల కష్ట సుఖాల్ని పట్టించుకునే పాలకులు ఉంటారు. ఆదుకునే థర్మ ప్రభువులూ ఉంటారు.             ఒక ఔదార్యవంతుడయిన రాజుకు వారసత్వంగా లెక్కలేనంత ఐశ్వర్యం వచ్చింది. అతను దయాశీలి. చేతికి ఎముకలేని దాన శీలి. దేశమంతా తిరిగి రైతుల కష్ట సుఖాల్ని తెలుసుకుని వాళ్ళను వీలయినంతగా ఆదుకునేవాడు. తన సైనికుల బాగోగులు చూసేవాడు. […]

రాజులందరూ చెడ్డవాళ్ళని అందర్నీ ఒకే గాట కట్టెయ్యలేం. కొందరు దుర్మార్గులుంటారు. కొందరు మంచి వాళ్ళుంటారు. ప్రజల్ని పట్టించుకోని స్వార్ధపరులుంటారు, అధికారం చెలాయించే అహంకారులుంటారు, ప్రజల కష్ట సుఖాల్ని పట్టించుకునే పాలకులు ఉంటారు. ఆదుకునే థర్మ ప్రభువులూ ఉంటారు.

ఒక ఔదార్యవంతుడయిన రాజుకు వారసత్వంగా లెక్కలేనంత ఐశ్వర్యం వచ్చింది. అతను దయాశీలి. చేతికి ఎముకలేని దాన శీలి. దేశమంతా తిరిగి రైతుల కష్ట సుఖాల్ని తెలుసుకుని వాళ్ళను వీలయినంతగా ఆదుకునేవాడు. తన సైనికుల బాగోగులు చూసేవాడు.

సాంబ్రాణిపొగ నలుదిక్కులా వ్యాపించినట్లు దేశమంతా అతని మంచితనం మంచి గంథంలా వాసనలు చిమ్మింది.

నిజానికి వ్యక్తి గొప్పవాడు కావాలంటే మనసులో ఆర్ధతవుండాలి, ఔదార్యముండాలి. వాటికి ఎప్పుడు గుర్తింపు వస్తాయంటే ఇతరుల్ని ఆదుకున్నప్పుడే. గింజలు పొలంలో వేయందే మొలకెత్తవు కదా!

రాజకుమారునికి ఒక మిత్రుడుండేవాడు. అతను కూడా రాజవంశీకుడే. రాజకుమారుడు విచ్చలవిడిగా ధనం వెదజల్లడం అతనికి ఇష్టం లేదు. సమయంచూసి ఆ ప్రయత్నం మానిపించాలనుకున్నాడు. ఒకరోజు ఏకాంతంలో “మిత్రమా! ఇప్పుడు నువ్వు విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్న ధనం మీ పూర్వీకులయిన రాజులు కూడ బెట్టింది. రాజ ధనాగారం ఉన్నది రాజు బలాన్ని తెలపడానికి. ఖజానా ఉన్నది ఖాళీ చేయ్యడానికి కాదు. కొంత ఔదార్యాన్ని అదుపుచేసుకో, నువ్వు ధనహీనుడవయితే నీ శత్రువులు బలపడతారు. నువ్వు బలహీనుడవుతావు. నువ్వు బలహీనపడితే ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నవాడివవుతావు” అన్నాడు.

మిత్రుడు రాజకుమారుని మేలుకోరి తానామాటలు చెప్పానని భావించాడు. కానీ ఆ మాటలకు రాజకుమారుడికి ఆగ్రహం వచ్చింది.

“మిత్రమా! భగవంతుడు ఇంత ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చింది నేను దాచిపెట్టుకోవడానికి కాదు. లోభిలా జీవించడానికి కాదు. ఈ ధనమంతా ప్రజలది. ప్రజలకు ఉపయోగపడని ధనం ఉంటే లాభం లేదు. అట్లా అని కేవలం నా స్వార్థానికి ధనాన్ని ఉపయోగించుకోవడం దానవత్వమవుతుంది. ఆ ధనం నేనూ అనుభవించాలి, ఇతరులకూ పెట్టాలి. అప్పుడే నా జీవితానికి సార్ధకత చేకూరుతుంది” అన్నాడు.

రాజకుమారుని మాటలు మిత్రుని అభిప్రాయాన్ని మారేలా చేశాయి. మిత్రుడు క్షమాపణలు కోరాడు.

రాజకుమారుడు “మిత్రమా! ఈ ధనం మనం పోతే మనతో రాదు. మనం పోయినా మంచిపనులు చేస్తే ప్రజలు మనల్ని గుర్తుంచుకుంటారు” అన్నాడు.

మిత్రుడు ఉన్నతుడయిన రాజకుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.

– సౌభాగ్య

First Published:  14 May 2015 1:01 PM GMT
Next Story