‘కేన్స్’లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఐశ్వర్య! 

‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’లో ఈసారి కూడా బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫ్రాన్స్‌లో ఏటా అత్యంత కోలాహలంగా జరిగే ఈ సినీ సంబరంలో వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీలు ఎంతోమంది పాల్గొంటున్నా, అందరి కళ్లూ మాత్రం ఐశ్వర్యపైనే! 2002 నుంచి ఆమె ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’కు విధిగా హాజరవుతోంది. ‘దేవదాస్’ విడుదలైనపుడు హీరో షారుఖ్ ఖాన్‌తో కలిసి ఆమె తొలిసారి ‘కేన్స్’లో పాల్గొంది. సినీనటిగానే కాదు, ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘లోఒరీల్’కు ప్రచారకర్తగా కూడా ఆమె ఈ ఉత్సవాలకు హాజరవుతోంది. నట జీవితంలో అయిదేళ్ల విరామం తర్వాత ప్రస్తుతం ‘జాబ్జా’లో నటిస్తున్న ఆమె 68వ ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’లో పాల్గొంటోంది. ఈ ఏడాది ‘కేన్స్’ వేడుకలకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్, సోనమ్ కపూర్ వచ్చినా ఐశ్వర్య హవా మాత్రం కొనసాగుతోంది. ఈనెల 17, 20 తేదీల్లో ‘రెడ్ కార్పెట్’పై ఆమె నడుస్తుందని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. సినీ ఉత్సవంలోనే కాదు, ఎయిడ్స్ వ్యాధి నివారణకు సంబంధించి ప్రచార కార్యక్రమంలోనూ ఆమె బిజీగా ఉంటోంది. ఎయిడ్స్‌పై అధ్యయనానికి పనిచేస్తున్న ఓ అమెరికన్ సంస్థ నిర్వహించే సదస్సులో భర్త అభిషేక్ బచ్చన్‌తోపాటు ఆమె పాల్గొంటోంది.