శ్రీ‌మంతుడు ‘మ‌గాడు’గా మారాడు!

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మిల్కీబాయ్ మ‌హేష్ బాబు హీరోగా భారీతారాగ‌ణంతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌కాలం దీనికి .’శ్రీ‌మంతుడు’ అనే పేరు ప్ర‌చారంలో ఉంది. అయితే, తాజాగా సినిమా పేరు మార్చారంట‌. ఈ సినిమాకు ‘మ‌గాడు’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. దీనికి మ‌హేష్ కూడా అంగీక‌రించాడ‌ట‌. మ‌గాడు అన్న ప‌దం మ‌హేష్‌కు కొత్త‌దేం కాదు.’ అత‌డు’ సినిమాలో మ‌హేష్ పాత్ర గొప్ప‌త‌నం గురించి త‌నికెళ్ల భ‌ర‌ణి చెబుతూ ప‌దేప‌దే ‘ఆడు మ‌గాడ్రా బుజ్జీ ‘ అంటూ పొగుడుతుంటాడు. ఆ డైలాగ్ ఎంత పాపుల‌రైందంటే మ‌హేష్ బావ‌మ‌రిది సుధీర్‌బాబు దాన్నే టైటిల్‌గా పెట్టి సినిమా కూడా తీసేశాడు. టాలీవుడ్‌లో ఉన్న కొన్ని సెంటిమెంట్ల‌కు మ‌హేష్ అతీతుడేం కాదు. మూడ‌క్ష‌రాల పేర్ల‌తో వ‌చ్చిన మ‌హేష్ సినిమాలు భారీ హిట్లు సాధించాయి. అందులో ‘ఒక్క‌డు, మురారి, పోకిరి, దూకుడు’ లాంటి భారీ హిట్లు ఉన్నాయి. (ఖ‌లేజా, ఆగ‌డు లాంటి డిజాస్ట‌ర్లు కూడా ఉన్నాయ‌నుకోండి) రెండ‌క్ష‌రాల‌తో వ‌చ్చిన‌ ‘బాబీ, నాని’ చిత్రాలు భారీ అప‌జ‌యాన్ని న‌మోదు చేయ‌డ‌మే ఇందుకు కార‌ణంగా చెబుతారు. ఈసారి నాలుగ‌క్ష‌రాల‌తో .’శ్రీ‌మంతుడు’ సినిమా వ‌స్తుంద‌నుకున్నారంతా కానీ, మ‌హేష్ మాత్రం మూడ‌క్ష‌రాల టైటిల్‌కే ఓటు వేశాడు. ఇటీవ‌ల విడుద‌లైన ‘ఆగ‌డు’ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. దీంతో ఈ సినిమాపై మ‌హేష్ అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.