Telugu Global
Family

టైలర్‌ (Devotional)

అది యూదుల పవిత్రమయిన పండుగ. రబ్బీ పరిశుభ్రంగా స్నానం చేసి తాల్మడ్‌, తోరాల నుండి కొన్ని అధ్యాయాలు చదివి వాటి అంతరార్ధాన్ని శిష్యులకు వివరించి పాటలు పాడి ప్రార్థనలు చేశాడు. శిష్యులు ఆ పండుగను ఆనందంగా గడుపుకుని సంతృప్తిగా భోజనాలు చేశారు. ఆహ్లాదకరంగా, అర్థవంతంగా ఆరోజు గడిచినందుకు రబ్బీ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చీకటి పడింది. అందరూ ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారు. అంతలో ఆ గదిలో మెరుపు మెరిసినట్లయింది. పెద్ద శబ్దం వచ్చింది. అందరూ […]

అది యూదుల పవిత్రమయిన పండుగ. రబ్బీ పరిశుభ్రంగా స్నానం చేసి తాల్మడ్‌, తోరాల నుండి కొన్ని అధ్యాయాలు చదివి వాటి అంతరార్ధాన్ని శిష్యులకు వివరించి పాటలు పాడి ప్రార్థనలు చేశాడు. శిష్యులు ఆ పండుగను ఆనందంగా గడుపుకుని సంతృప్తిగా భోజనాలు చేశారు. ఆహ్లాదకరంగా, అర్థవంతంగా ఆరోజు గడిచినందుకు రబ్బీ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

చీకటి పడింది. అందరూ ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారు. అంతలో ఆ గదిలో మెరుపు మెరిసినట్లయింది. పెద్ద శబ్దం వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ శబ్దం తరువాత “రబ్బీ! నీ పవిత్ర ప్రార్థనలు విన్నాను. ఈ పట్టణంలో వున్న మనుషుల్లో నువ్వంటే నాకు ఇష్టం. నీతో బాటు ఒక పేదటైలరంటే మరీ ఇష్టం. అతనికి మొదటి స్థానమిస్తాను. నీది రెండోస్థానం” అన్న మాటలు వినిపించాయి.

ఆ మాటలకు రబ్బీ తలవంచి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కాసేపయ్యాకా “పేదటైలరంటే ఎవరు? మన యూదుల్లో పేద వాడయిన టైలర్‌ ఈ ఊళ్ళో ఎవరున్నారు?” అని అడిగాడు.

అందరూ ఎవరో మాకు తెలీదు అన్నారు. ఒక శిష్యుడు “రబ్బీ! ఊరి చివర గుడిసెలో ఒక పేద టైలర్‌ ఉంటాడు” అన్నాడు.

రబ్బీ వెంటనే బయల్దేరి అతని ఉత్తమ గుణాలెవో తెసుకోవాలనుకున్నాడు. ఊరి చివరికి లాంతరు పట్టుకుని బయల్దేరాడు. దేవునికి అంత ప్రియమైన వ్యక్తి ఎంత సాధు జీవనుడో, ఎంత జ్ఞాన సంపన్నుడో అతన్ని కలిసే దాకా నాకు విశ్రాంతి లేదు అని రబ్బీ భావించాడు.

ఇరుకుగా వున్న సందుల్లో జాగ్రత్తగా నడిచి ఊరి చివరవున్న గుడిసెముందు ఆగి తలుపు తట్టాడు.

ఒక పేద స్త్రీ తలుపు తీసింది. రబ్బీని చూసి ఆశ్చర్యపోయింది. అంత గౌరవనీయుడయిన వ్యక్తి తమయింటికి రావడం చూసి విస్తుపోయింది. అది గుడిసెలాంటి ఇల్లే కానీ రెండు గదులున్నాయి. ఒక స్టూలు వేసి రబ్బీని కూర్చోమంది.

రబ్బీ “అమ్మా! మీ ఆయన ఉన్నాడా?” అని అడిగాడు.

ఆ స్త్రీ “కూర్చోండి. ఇప్పుడే రెండు నిముషాల్లో వస్తాను” అని పక్క గదిలోకి వెళ్ళింది.

రబ్బీ ఆ నిరుపేదయింటిని పరిశీలిస్తున్నాడు. ఆ ఇంట్లో పేదతనం తప్ప ఏమీ లేదనిపించింది.

అంతలో చెంబుతో బక్కెటులోకి ఎవరో నీళ్ళు పోస్తున్నట్లు శబ్దం వినపడింది. బక్కెటు నిండాకా ఎవరో ఒక్కసారిగా ఎవరిమీదనో ఆ నీళ్ళన్నీ పోసినట్లు పెద్ద శబ్దం వచ్చింది.

పక్క గదిలో మంచం మీద ఆ టైలర్‌ నిద్రపోతున్నాడు. అతన్ని నిద్ర లేపడానికి ఆమె చేసిన పని అది.

ఆ దెబ్బతో ఉలిక్కి పడి “చచ్చాన్రోయ్‌” అని టైలర్‌ మంచం మీద లేచి కూచున్నాడు. అతని భార్య “తాగుబోతు మనిషీ! నిన్నటి నించీ నువ్వు మత్తులోనే ఉన్నావు. పైగా ఈరోజు నువ్వు చేసిన పనికి రబ్బీ నిన్ను శిక్షించడానికి మన ఇంటికే వచ్చాడు” అంది.

ఆ మాటల్తో టైలర్‌ మత్తు దిగిపోయింది. వెంటనే లేచి రబ్బీ ఉన్న గదికి వచ్చి “రబ్బీ! పొరపాటయిపోయింది మన్నించండి. పవిత్ర దినం నాడు నేను అపచారం చేశాను. దయచేసి నన్ను శిక్షించకండి” అన్నాడు.

నీళ్ళు కారుతున్న టైలర్‌తో “నిన్ను శిక్షించడానికి రాలేదు. వెళ్ళి నీ బట్టలు మార్చుకుని రా. నీతో ఒక విషయం మాట్లాడాలి” అన్నాడు.

టైలర్‌ రబ్బీమాటలు నమ్మలేదు. వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి “రబ్బీ! నేను చేసింది తప్పే. నన్ను మన్నించండి” అన్నాడు.

రబ్బీ! “నీ తప్పు తెలుసుకోవడానికి, నిన్ను శిక్షించడానికి నేను రాలేదు. ఆ సంగతి చెప్పినా నువ్వు నమ్మడం లేదు. అసలు నువ్వు ఏం తప్పు చేశావో కూడా నాకు తెలీదు. ఇంతకూ నువ్వు ఏంచేశావు?” అని అడిగాడు.

టైలర్‌ ఒకింత స్థిమితపడి. రబ్బీ! ఉదయాన్నే ఊళ్ళోకి వెళ్ళాను. అందరూ హడావుడిగా సరుకులు కొని ఉరుకులు, పరుగులతో ఉన్నారు. ఎందుకింత హడావుడో నాకు అర్థంకాలేదు. నాకు తెలిసిన ఒక వ్యక్తిని “ఏమయింది? అందరూ ఎందుకింత ఉత్సహంగా వున్నారు?” అని అడిగాను.

అతను “నువ్వు ఏంమనిషివి? ఎప్పుడూ తాగడం తప్ప నీకు ఏమీ తెలీదు. ఈ రోజు పవిత్ర దినం. వున్నంతలో సరకులు కొని, మాంసం వండుకుని ప్రార్థనలు చేసి వైన్‌ తాగుతాం. నీకా సంగతే గుర్తున్నట్లు లేదు. మరి ఈ సంగతి కూడా మరచిపోయినట్లున్నావు. ఈ రోజు నుంచి ఎనిమిది రోజులపాటు మద్యపానం చెయ్యకూడదు” అని వెళ్ళాడు.

ఆ మాటల్తో నా నెత్తిన పిడుగు పడ్డట్లయింది. ఎనిమిది రోజులు వొడ్కా తాగకుండా ఉండడమా? అది నావల్ల జరిగేపనా! అని ఆలోచించి ఒక కిటుకు కనుక్కున్నాను. వొడ్కా సీసా కొని ఎనిమిది రోజుల మందు ఒక్క సారిగా తాగేసి, సరుకులు తెచ్చి, మాసం, వైను సిద్ధం చేసి దేవుణ్ణి ప్రార్థించాను.

“దేవా! ఎవరో మా నాన్నని చంపేసినపుడు నేను చిన్న వాణ్ణి. ఆరోజునించీ నేటివరకూ ఎన్నో పనులు చేసి సంసారాన్ని ఈదాను. ఇప్పుడు టైలర్‌పని చేస్తున్నా. నేను చదువు రాని అజ్ఞానిని. పవిత్ర గ్రంథాల్లో ఒక్క అక్షరం చదవడం కూడా రాని వాణ్ణి. తాగుబోతుని. ఇంత అపవిత్రమయిన వ్యక్తిని నువ్వు క్షమిస్తావో లేదో నాకు తెలీదు. అని కన్నీళ్ళు పెట్టుకుని ఇంత క్రితమే పడుకున్నా. మా ఆవిడ లేపింది. మన్నించండి” అన్నాడు.

అంత స్వచ్ఛమయిన హృదయమున్న టైలర్‌ని చూసి రబ్బీ కళ్ళలో ఆనంద భాష్పాలు కదిలాయి.

– సౌభాగ్య

First Published:  15 May 2015 1:01 PM GMT
Next Story