స్వచ్ఛ హైద‌రాబాద్‌కు శ్రీ‌కారం

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అందంగా తీర్చిదిద్దే కార్యక్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి శ్రీ‌కారం చుట్టారు. జిహెచ్ఎంసీని నాలుగు జోన్‌లుగా విభ‌జించి, మ‌ళ్ళీ దాన్ని 450 విభాగాలుగా నిర్ణ‌యించి స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌కు మార్గం సుగ‌మం చేసిన కేసీఆర్ ఈ కార్యక్ర‌మాన్ని గ‌వ‌ర్న‌ర్ చేతులు మీదుగా ప్రారంభించారు. తెలంగాణలోని మిగ‌తా జిల్లాల‌కు, ప‌ట్ట‌ణాల‌కు స్వ‌చ్ఛ హైద‌రాబాద్ స్ఫూర్తి కావాల‌ని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ఐక్యంగా ప‌ని చేస్తే అద్భుత ఫ‌లితాలే సాధించ‌గ‌ల‌మ‌ని ఈ కార్య‌క్ర‌మం ద్వారా నిరూపిద్దామ‌ని కేసీఆర్ అన్నారు. ప్ర‌పంచంలో సుర‌క్షిత‌మైన న‌గ‌రం హైద‌రాబాద్ అని ఆయ‌న అన్నారు. హైద‌రాబాద్ ఎంత బాగుందో అంత బాగోలేద‌ని వ్యాఖ్యానించారు. పౌర వ‌స‌తులు స‌రిగా లేక‌పోవ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని, నాయ‌కులు, అధికారులు బ‌స్తీల్లోకి వెళ్ళి అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్క‌రించాల‌ని కేసీఆర్ కోరారు. ఫేస్‌బుక్‌లో స్వ‌చ్ఛ హైద‌రాబాద్ పేజీని చంద్ర‌శేఖ‌ర‌రావు ప్రారంభించారు. ప‌రిశుభ్ర‌త‌లో కీల‌క‌పాత్ర పోషించే స‌ఫాయి కార్మికులు త‌న‌కు దేవుళ్ళ‌ని ఆయ‌న అన్నారు. స్వ‌చ్ఛ హైద‌రాబాద్ నిర్వ‌హిస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అభినందిస్తున్నాన‌ని, ఇది ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం కాద‌ని, ప్ర‌జల భాగ‌స్వామ్యంతో జ‌ర‌గాల్సిన  ప్ర‌జా చైత‌న్య కార్య‌క్ర‌మం అని ద‌త్తాత్రేయ అన్నారు. స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మం కాద‌ని, ఇదొక నినాదం కావాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. ఈకార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్‌, సీఎంతోపాటు, కేంద్ర‌మంత్రి బండారు ద‌త్తాత్రేయ‌, విధాన‌స‌భ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, విధాన ప‌రిష‌త్ ఛైర్మ‌న్ స్వామిగౌడ్‌, మంత్రులు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రంగంలోకి దిగిన గ‌వ‌ర్న‌ర్… ఆదేశాలు జారీ
కాగా ఈ ప్రారంభ కార్య‌క్ర‌మం అయిన వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రంగంలోకి దిగారు. ఆనంద‌న‌గ‌ర్ కాల‌నీకి ప్యాట్ర‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న అక్క‌డ స్థానికుల‌తో మాట్లాడి పరిశుభ్ర‌త పాటించాల్సిందిగా కోరారు. ఆయ‌న వెంట కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ కూడా ఉన్నారు. ఆనంద‌న‌గ‌ర్ కాల‌నీలోని స‌మ‌స్య‌ల‌పై స్థానికులు ఏక‌రవు పెట్టారు. శ్రీ‌న‌గ‌ర్ పార్క్ డంప్ చాలా ఇబ్బందిగా ఉంద‌ని స్థానికులు తెలుప‌గా దాన్ని వెంట‌నే అక్క‌డ నుంచి తొల‌గించాల‌ని అధికారుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆదేశించారు. అస‌లు డంప్ అక్క‌డ ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్థానికుల‌తో క‌మిటీ వేసి స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.