బాలయ్యపై జగన్ గుర్రు

ఒకప్పుడు బాలకృష్ణ సినిమా చేస్తే అది ఫిలింసర్కిల్ లోనే సంచలనమయ్యేది. కానీ ఇప్పుడు బాలయ్య కేవలం ఓ హీరో మాత్రమే కాదు.. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా. మరీ ముఖ్యంగా టీడీపీలో కీలకమైన నేత. ఇలాంటి హీరో కమ్ పొలిటీషియన్ సినిమా తీస్తే అది కచ్చితంగా రాజకీయంగా కూడా కాస్తోకూస్తో దుమారం రేపడం సహజం. లయన్ విషయంలో అదే జరిగింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి మాస్ జనాలు బాగానే కనెక్ట్ అయ్యారు. అయితే వైసీపీ నేతలు మాత్రం గుర్రుగా ఉన్నారు. సినిమాలో ఓ పాత్రతో లక్ష కోట్ల రూపాయల ప్రస్తావన తీసుకొచ్చారు. లక్ష కోట్లు సంపాదించడం గొప్ప కాదు.. లక్ష ఓట్లు సంపాదించడం గొప్ప అనే డైలాగ్ వైసీపీ శ్రేణుల్ని ఎక్కడో తాకింది. వైసీపీ అధినేత జగన్ ను తెలివిగా టార్గెట్ చేశారనే విషయం ఇక్కడ బహిరంగ రహస్యమైంది. దీంతో వైసీపీ నేతలు కొందరు దీనిపై సెన్సార్ బోర్డును ఆశ్రయించే పనిలో ఉన్నారు. పనిలోపనిగా తమకు అభ్యంతరకరంగా తోచిన మరికొన్ని సన్నివేశాల్ని కూడా జగన్ పార్టీ గుర్తించినట్టు సమాచారం. సెన్సార్ బోర్డు స్పందించకపోతే.. కేంద్ర సెన్సార్ బోర్డు వరకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు నేతలు. అయితే ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలనే అంశంపై జగన్ మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.