లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కేజ్రీవాల్ యుద్ధం

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్య అధికార యుద్ధం మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెలవుపై వెళ్లడంతో కేవలం 10 రోజులకు ఇన్‌చార్జిని నియమించడంపై తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. సర్కారు పరిమళ్‌ రాయ్‌ పేరును సూచిస్తే, గవర్నర్‌ దాన్ని తోసిపుచ్చి ఇంధన శాఖ కార్యదర్శి శకుంతల గామ్లిన్‌ను నియమించి ఆదేశాలిచ్చారు. దీనికితోడు బాధ్యతలు స్వీకరించవద్దని ప్రభుత్వం శకుంతలకు లేఖ రాసినా ఆమె దాన్ని ప‌ట్టించుకోకుండా విధుల్లో చేరిపోవడంతో కేజ్రీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆ వెంటనే గవర్నర్‌ జంగ్‌కు ఘాటుగా లేఖ రాశారు. ‘రాజ్యాంగానికి లోబడి పనిచేయండి’ అని ఘాటుగా స్పందించారు. ‘‘నిర్దిష్ట ప్రక్రియలకు భిన్నంగా, చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని ప‌ట్టించుకోకుండా మీరు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప‌ట్టించుకోకూడ‌ద‌న్న‌ట్టుగా మీరు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదే మీ చర్యల్లో నాకు కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర పదజాలం ప్రయోగించారు. అలాగే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు కేజ్రీ స్వయంగా వెల్లడించారు. ఇక రాజభవన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో గవర్నర్‌ కూడా దీటుగా స్పందించారు. తాను అన్ని నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరించానన్నారు. ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి నియామకంలో మీరు 40 గంటలు జాప్యం చేసినందునే తాను నేరుగా ఉత్తర్వులిచ్చానని పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఆదేశాల మేరకు శకుంతలకు నియామక ఉత్తర్వులిచ్చిన సేవా విభాగం ముఖ్య కార్యదర్శి అరిందమ్‌ మజుందార్‌ను కేజ్రీవాల్‌ బదిలీ చేయ‌డం… దాన్ని గ‌వ‌ర్న‌ర్  రద్దు చేయ‌డం కూడా మ‌రో వివాదానికి తెర‌తీసింది. బీజేపీ గామ్లిన్‌ నియామకం రూపంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ద్వారా త‌మ ప్ర‌భుత్వాన్ని అప్ర‌దిష్ట‌పాలు చేసే కుట్రను అమలు చేస్తోందని  ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా మండిపడ్డారు. కాగా కేజ్రీ వైఖరిపై బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు సతీష్‌ ఉపాధ్యాయ్‌ ధ్వజమెత్తారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌పైనా ఆయన తన నియంతృత్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.