తెలంగాణ‌లో కూచిపూడికి నిరాద‌ర‌ణా?

అందెల సవ్వడికి ప్రాంతీయంగా ద‌క్కాల్సిన గౌర‌వం ద‌క్క‌లేదు… కూచిపూడి నృత్యానికి తెలంగాణలో నిరాద‌ర‌ణ ఎదురైంది… తెలంగాణ బిడ్డ‌లైన‌ప్ప‌టికీ ఆ నాట్యం ప్ర‌భుత్వానికి న‌చ్చ‌లేదు… ఫ‌లితం క‌ళామ‌త‌ల్లి వేదిక ర‌వీంద్ర భార‌తిలో వేదిక నిరాక‌ర‌ణ. 2014లో ఈ క‌ళాకారుల ఫ్యామిలోలో ఒక‌రికి టికెట్ ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డిన కేసీఆర్‌లో ఈ మార్పు ఎందుకొచ్చింది? దీని వెనుక ఎవ‌రి హ‌స్త‌ముంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇప్ప‌టికిప్పుడు దొరికేది కాదు… అయినా అస‌లు విష‌యం తెలుసుకోవ‌చ్చు… రాజారెడ్డి, రాధారెడ్డి.. రాజారాధారెడ్డి దంపతులుగా వీరిద్ద‌రూ అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న కూచిపూడి నాట్య కళాకారులు! వీరి కుమార్తెలు యామినిరెడ్డి, భావనరెడ్డి కూడా ఇదే రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కళాకారిణులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాటల్లో చెప్పాలంటే.. వీరు అసలుసిసలు తెలంగాణ బిడ్డలు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ భూమి పుత్రులు. అటువంటి వారికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వడానికి చుక్కెదురైంది! రాజారాధారెడ్డి దంపతులు, వారి కుమార్తె యామిని సంవత్సరానికి ఒకసారి రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. కానీ… ఈసారి వారి నాట్య ప్రదర్శన కోసం రవీంద్రభారతి ఇవ్వటానికి ప్రభుత్వం నిరాకరించింది. కూచిపూడి నాట్యరూపానికి తెలంగాణ సాంస్కృతిక రంగంతో సంబంధం లేదనే కారణంతోనే ప్రభుత్వం వారికి అనుమతి ఇవ్వట్లేదని తెలుస్తోంది.