ఆర్టీసీ బాదుడుకు జూన్‌లో ముహూర్తం!

రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు చుక్కలు చూపించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఒక్కటి కాదు… రెండు కాదు… ఐదు వందల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిపై మోపాల‌నుకుంటోంది. ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టడానికి ఆర్టీసీ సిద్ధమైంది. ఫిట్‌మెంట్‌, చమురు ఛార్జీల బూచి చూపించి జనంపై భారం వేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. బస్సు ఛార్జీల రూపంలో జనం జేబులకు చిల్లు పెట్టేందుకు అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసికి 15 రోజుల వ్య‌వ‌ధిలో రెండుసార్లు పెరిగిన‌ డీజిల్ ధ‌ర‌లు గుదిబండ‌గా త‌యార‌య్యాయి. వీటి ప్ర‌భావంతో ఆర్టీసీపై రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ఇప్ప‌టికే రూ.1900 కోట్ల న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది మోయ‌లేని భారంగా మారింది. దీంతో సంస్థ మ‌నుగ‌డ‌కు టికెట్ ధ‌ర‌ల‌ పెంపు  అనివార్యంగా మారింద‌ని చెబుతున్నారు. ఇటీవల సమ్మె అస్త్రంతో ఆర్టీసీ కార్మికులు ఫిట్‌మెంట్ సాధించారు. ఎస్మాకు ఎదురొడ్డి విజయబావుటా ఎగరేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తే… తెలంగాణ సర్కార్‌ ఓ మెట్టు పైకెక్కి 44 శాతం ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. ఇదే ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యానికి బ్రహ్మాస్త్రంగా మారింది. ఫిట్‌మెంట్‌ను సాకుగా చూపిస్తూ… లోటును పూడ్చుకునేందుకు ఆర్టీసీ ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే బస్సు ఛార్జీల పెంపు తప్పదంటూ కేసీఆర్ ప్రకటించారు. ప్ర‌భుత్వం భ‌రించే దానిలో కొంత ప్ర‌జ‌లు కూడా పంచుకోవాల‌ని ప్ర‌యాణికుల‌ను బాదేయ‌డానికి మాన‌సికంగా సిద్దం చేశారు. 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వ‌డం వ‌ల్ల తెలంగాణ ప్ర‌భుత్వంపై ఈ భారం రూ.850 కోట్ల‌కుపైగా ఉంటుంద‌ని అంచ‌నా. ఈ భారాన్ని ప్ర‌భుత్వం ఎలా స‌ర్దుబాటు చేస్తుంద‌న్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. తెలంగాణ‌లో 93 శాతం ర‌వాణా ఆర్టీసీ ఆధారంగానే జ‌రుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆంధ్ర క‌న్నా.. తెలంగాణ‌లో పెంపు అనివార్యంగా మారింది. 
15 శాతం పెంచ‌డానికి ఏర్పాట్లు? 
     ఇపుడు ఉద్యోగుల‌కు ఇచ్చిన ఫిట్‌మెంట్ భారం ప్ర‌భుత్వం ప‌డ‌కుండా ఉండాలంటే 15 శాతం వ‌ర‌కు ఛార్జీల పెంపు అనివార్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంది. ఆర్టీసీ నడుపుతున్న అన్ని రకాల బస్సులపై ఒకే విధంగా 15 శాతం ఛార్జీలు పెంచేందుకు యాజమాన్యం ప్రతిపాదనలు చేసింది. అయితే ఆర్టినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు కొంత మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది. 10 నుంచి 12 శాతానికి మించనివ్వొద్దని కేసీఆర్ సూచించిన‌ట్టు సమాచారం. సూపర్ ఎక్స్‌ప్రెస్‌, సూపర్ డీలక్స్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్‌ బస్సులకు మాత్రం ఖచ్చితంగా 15 శాతం క‌న్నా ఎక్కువ‌గా పెంచే అవకాశం ఉంది. ఏసీ స్లీపర్‌, వెన్నెల బస్సు ఛార్జీలు ఇప్పటికే అధికంగా ఉన్నందున వాటికి 10 శాతంలోపే పెంచనున్నట్లు సమాచారం. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జ‌ర‌గ‌నుండ‌డంతో ఆ తర్వాతే ఛార్జీల పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ పెంపుతో ప్రజలపై మరో పిడుగు పడనుంది.
-పీఆర్‌