Telugu Global
Family

సంజయుడు (FOR CHILDREN)

మహాభారతంలో యుద్ధం. మహాభారత యుద్ధం. కురుక్షేత్రం… కౌరవుల పాండవుల రణక్షేత్రం! యుద్ధక్షేత్రంలో కాలు పెట్టిన వాడి చేతిలో కత్తీ డాలూ వుండాలి. ఏదో ఒక ఆయుధం వుండాలి. ఏ ఆయుధం లేకుండా యుద్ధ భూమిలో ప్రవేశించడమే కాదు, తిరిగి రావడమూ కష్టమే. అసాధ్యమే!             అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినవాడు సంజయుడు. చేతిలో ఏ ఆయుధమూ లేకుండా కురుక్షేత్రంలోకి దిగగలిగిన వాడు. దిగి భీకర యుద్ధంలో తిరగ గలిగిన వాడు. కత్తి గాటు పడనివాడు. విల్లంభులు విసరనివాడు. […]

మహాభారతంలో యుద్ధం. మహాభారత యుద్ధం. కురుక్షేత్రం… కౌరవుల పాండవుల రణక్షేత్రం! యుద్ధక్షేత్రంలో కాలు పెట్టిన వాడి చేతిలో కత్తీ డాలూ వుండాలి. ఏదో ఒక ఆయుధం వుండాలి. ఏ ఆయుధం లేకుండా యుద్ధ భూమిలో ప్రవేశించడమే కాదు, తిరిగి రావడమూ కష్టమే. అసాధ్యమే!

అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినవాడు సంజయుడు. చేతిలో ఏ ఆయుధమూ లేకుండా కురుక్షేత్రంలోకి దిగగలిగిన వాడు. దిగి భీకర యుద్ధంలో తిరగ గలిగిన వాడు. కత్తి గాటు పడనివాడు. విల్లంభులు విసరనివాడు. ఎవరి కంటికీ కనపడకుండా సంచరించువాడు. అందరి మాటలూ వినగలిగినవాడు. యుద్ధాన్ని పక్కనే ఉండి చూడగలిగిన వాడు. ఎవ్వరి చూపులకూ చిక్కని వాడు. సర్వాన్ని సమరాన్నీ కన్నులారా చూసి యుద్ధభూమి నుండి వెళ్ళ గలిగినవాడు సంజయుడు ఒక్కడే! అలాంటి అద్భుతమైన శక్తిని వ్యాసుని నుండి పొందిన వాడు… కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలినవాడు అతనొక్కడే!

యుద్ధం చెయ్యనివాడు… యుద్ధాన్ని చూసి యేం చేస్తాడు? సంజయుడి విథి యేమిటి? ఏరోజు యుద్ధంలో ఏం జరిగిందో… ఎవరిది పైచేయి అయిందో… ఎవరు గెలిచారో ఎవరు ఓడారో ప్రతీదీ పూసగుచ్చినట్టు చూసింది చూసినట్టు సంజయుడు చెప్పేవాడు. ఎవరికి? ఇంకెవరికి? కళ్ళు లేని ధృతరాష్ట్రునికి! ఆఖరికి అర్జునుడికి కృష్ణుడు చేసిన గీత బోధను సంజయుడు విన్నాడు. ఆ విషయం ఎవరికీ తెలీదు. ఎందుకంటే సంజయుడు అదృశ్య రూపంతో కదా వున్నాడు. అన్నీ ధృత రాష్ట్రునికి చెప్పాడు. పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని ధృతరాష్ట్రునికి ప్రత్యక్ష ప్రసారం చేసాడు. ఆఖరి రోజున సంజయుడికి ఆపద వచ్చింది. సాత్యకి పట్టుకొని చంపబోయాడు. కాని వ్యాసుడు వచ్చి వద్దని వారించాడు. సంజయుడి ప్రాణాలు నిలబడ్డాయి.

సంజయుడు సూత పుత్రుడయినా గాంధారి ధృతరాష్ట్రులకు అనుంగుపుత్రుడనే అనుకోవాలి. ఎందుకంటే ధృతరాష్ట్ర దంపతులకు ఎన్నో సేవలు చేసాడు. చేదోడు వాదోడుగా వున్నాడు. అలాగని ధృతరాష్ట్రుని పుత్రులైన దుర్యోధన దుశ్శాసనులతో ఏనాడు చేరలేదు. పాండవుల అజ్ఞాత వాసం ముగిసిన సందర్భంలో ధృతరాష్ట్రుని తరుపున రాయబారిగా వెళ్ళాడు. యుద్ధము వద్దని పరుషంగా కాక తియ్యగా ఒప్పించాలని చూసాడు. ధృతరాష్ట్రుని కళ్ళే కాదు, మాట కూడా అయ్యాడు. కొడుకుల్ని కోల్పోయిన వారికి కొడుకయ్యాడు. గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్ళాడు. ఆలనపాలనా చూసాడు. అయితే ఒకరోజు అడవిని కార్చిచ్చు కాల్చేస్తున్న సమయంలో గాంధారీ ధృతరాష్ట్రుని బలవంతంతో ప్రమాదం నుండి తప్పించుకొని వేరే దారిన వెళ్ళి చివరకు హిమాలయాలకు చేరుకున్నాడు సంజయుడు!

తనకోసం కాక తనను నమ్మిన గాంధారీ ధృతరాష్ట్ర దంపతులకోసమే మెలిగి వెలిగిన పాత్ర సంజయుడు!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  16 May 2015 1:02 PM GMT
Next Story