జగన్‌ వెనుక బడుతున్నారెందుకు?

రాజధాని ప్రాంతంలో తమ పొలాలను ఇవ్వడానికి ఇష్టపడని రైతులపై బెదిరించినట్లుగానే (బ్లాక్‌మెయిలింగ్‌ చేసినట్లుగానే) చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించింది. విద్యను కార్పొరేట్‌ మయం చేసి పిల్లల తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు ఫీజుల రూపంలో దండుకోవడానికే అలవాటు పడిన మంత్రి నారాయణకు రైతుల కష్టాలు తెలియవు కనుక ఈనెల 14న జరిగిన విలేకరుల సమావేశంలో అక్కసుతో కూడిన పదజాలం వాడి నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఆయన మాటలు వింటున్న వారికి భూములివ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందనేది అర్థం అవుతుంది.

రైతులపై ప్రభుత్వం పగబట్టినపుడు వారికి అండగా నిలబడాల్సింది ప్రతిపక్షం. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత రైతుల దౌర్భాగ్యం కొద్దీ వాళ్లను ఆదుకోవాల్సిన ప్రతిపక్ష నాయకులు వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఈ విషయంలో ఎందుకనో కిమ్మనడం లేదు. రాజధాని భూసేకరణ నోటిఫికేషన్‌ వెలువడే నాటికి జగన్‌ అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించడం మంచిదే. కాని పిడుగులాంటి నోటిఫికేషన్‌ వెలువడేటపుడు ఆయన ప్రజల్లోనే ఉన్నారు. ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ భూసేకరణ అంశంపై జగన్‌ నిప్పులు చెరిగి ఉండొచ్చు. కానీ ఆయన పెదవి విప్పలేదు. ఏదో తప్పదన్నట్లుగా కిందిస్థాయి నాయకులతో మాట్లాడించి ఊరుకుండి పోయారు.

అసలు జగన్‌కు ఈ మానసిక వెనుకబాటు తనం ఎందుకు వచ్చింది? వేలాది మంది పొట్టగొట్టే నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసినపుడు ప్రతిపక్షం దాడి చేయడానికి అంతకంటే మంచి అంశం మరొకటి ఉండదు. ప్రజలకు గండాలు ఎదురైనపుడు సకాలంలో స్పందించకపోవడం జగన్‌కు తొలిసారి కానేకాదు. మనం ఈ పనిచేస్తే ప్రతి పక్షం ఏ కోణంలో విరుచుకు పడుతుందోనని భీతిల్లే ప్రభుత్వాలకు కీలక సమయాల్లో ముఖ్యమైన అంశాలపై జగన్‌ స్పందించకపోవడంతో వారికి బెదురే లేకుండా పోయింది. జగన్‌కు స్వతహాగా రాజకీయ లక్షణాలు లేకపోవడం వల్ల వచ్చిన సమస్యా ఇది? లేక ఆయన చుట్టూ ఉన్నవంది మాగధులు ఆయనకు సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారా? అనే అనుమానాలకు వీరి పార్టీయే సమాధానం చెప్పాలి.

ఏది ఏమైనా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ ప్రాంత రైతుల కోసం వారి పక్షాన నిలబడి చేస్తున్న పోరాటం మాత్రం స్మరణీయమైనది. కానీ టీడీపీ బడా పెట్టుబడి దారులతో ఆర్కేను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఇప్పటి నుంచే పథకాలు పన్నుతూ ఉండటం ఎమ్మెల్యేకు కూడా జంకు కలిగిస్తోందని విశ్వసనీయ సమాచారం.