రాజ‌మండ్రిలో మహా పుష్కర ఘాట్..

మినీ కుంభ మేళాకు కౌంట్‌ డౌన్ మొదలైంది. పుష్కర పండక్కి సమయం సమీపిస్తోంది. పనులను వేగవంతం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇంకా నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పుష్కరాలకు వేదికగా చెప్పుకునే రాజమహేంద్రవరంలో పనులను వేగవంతం చేస్తున్నారు. మరోవైపు 2015 పుష్కరాలకు హైలెట్‌గా నిలిచేలా రాజమండ్రి కోటిలింగాల గోదావరి రేవులో మహా పుష్కర ఘాట్ నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు కిలోమీటరు విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతిపెద్ద స్నానఘట్టంగా చరిత్రకెక్కనుంది.  పుష్కరాల వేడుకలకు 8 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జిల్లాలో ఇప్పటికే 60 పుష్కర ఘాట్లు ఉన్నాయి భక్తుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో 80 ఘాట్లను నిర్మిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు జాతీయ స్థాయిలో పేరుండటంతో సెలబ్రిటీల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశముంది. దీంతో ఇప్పుడున్న వీఐపీ ఘాట్‌కు అదనంగా మరో వీఐపీ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. ఇక ఆర్ అండ్ బీ అధికారులు రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనకు తాత్కాలిక మరమ్మత్తులు చేపడుతున్నారు. అటు ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. తూర్పుగోదావరి పుష్కరాలకు సర్కార్ 425 కోట్లను కేటాయించింది. రాజమండ్రి, రాజానగరం, సీతానగరం, కోనసీమలతోపాటు గోదావరి తీర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పుష్కర పనులను పర్యవేక్షించేందుకు ఐ.ఎ.ఎస్ అధికారి మురళిని ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. ఇంకా పనులు మాత్రం నత్తనడకనే కొనసాగుతున్నాయి. పలు పనులకు ఇంకా టెండర్లు ఖరారు కాని పరిస్థితి నెలకొంది. పనులకు సంబంధించిన సమగ్ర సమాచారం అధికారుల దగ్గర లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇదిలాఉంటే పుష్కర పనులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఘాట్లు, రోడ్లు, ఫుట్‌పాత్‌లతో పాటు ఇతర పనుల్లో నాణ్యత కొర‌వ‌డింద‌ని ఆరోపణలు వస్తున్నాయి. పలుచోట్ల అనవసర నిర్మాణాలను చేపట్టారని విపక్షనేతలు ఆరోపిస్తున్నారు. అయితే విపక్షాల ఆరోపణలను అధికార నేతలు ఖండిస్తున్నారు. దమ్ముంటే పుష్కర పనుల్లో అవినీతిని నిరూపించాలని సవాల్‌ విసురుతున్నారు.
గోదావరి పుష్కరాల లోగో ఆవిష్కరణ..
జులై నెలలో నిర్వహించే గోదావరి పుష్కరాల లోగోను ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. సమాచార శాఖ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియా ఎదుట లోగోను ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు సంస్కృతి, సంప్రదాలు ఉట్టిపడేలా పుష్కరాలా లోగో ఉందన్నారు. వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలపై సోషల్ మీడియాలో భారీ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. పుష్కరాల కోసం ప్రత్యేక రైళ్లను, బస్సులను ఏర్పాటు చేస్తామని పరకాల స్పష్టం చేశారు.