మనది ఆధ్యాత్మిక బంధం: మంగోలియాలో మోడీ

ఆసియాలో శాంతి సుస్థిరతల కోసం మంగోలియాతో కలిసి అడుగులు వేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మంగోలియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగోలియా పార్లమెంటు ‘స్టేట్‌ గ్రేట్‌ హురల్‌’ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో మంగోలియా సరికొత్త ఆశాకిరణమని మోడీ ప్రశంసించారు. బౌద్ధం, ప్రజాస్వామ్యం ఇరుదేశాలను ఒకటి చేశాయన్నారు. భారత్‌, మంగోలియా నడుమ ఆధ్యాత్మిక బంధం ఉందని, ప్రపంచంలో ఇంతకన్నా దృఢమైన బంధం మరేదీ లేదని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు మద్దతు పలికినందుకు మంగోలియాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుదేశాల నడుమ రక్షణ సహకారం పెరుగుతోంది. మంగోలియా ప్ర‌జ‌ల శక్తిసామర్థ్యాలేమిటో ప్రపంచానికి తెలుసు. అలాంటి దేశంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడం గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆయన ఆ దేశ ప్రధాని చిమెడ్‌ సైఖాన్‌బైలెగ్‌తో భేటీ అయ్యారు. దేశాధ్యక్షుడు ఎల్‌బెగ్‌ దోర్జ్‌తోనూ మోడీ భేటీ అయ్యారు. మోదీ పర్యటన తొలి రోజున ఇరుదేశాలు 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మంగోలియాలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌, ఉలాన్‌ బాతార్‌లో ఇండో-మంగోలియన్‌ సంయుక్త పాఠశాల ఏర్పాటుకు భారత్‌ అంగీకరించింది. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారంలో భాగంగా మంగోలియా నేషనల్‌ కేన్సర్‌ సెంటర్‌కు బాబా అటమిక్‌ రీసెర్చి సెంటర్‌ తయారు చేసిన బాబా ట్రాన్‌ కేన్సర్‌ చికిత్స పరికరాన్ని మోడీ అందజేశారు. బాబా ట్రాన్‌-2 పరికరాన్ని అందించేందుకు మరో ఒప్పందం కుదిరింది. 
‘కమలం’ కలిపింది ఇద్దరిని..
బీజేపీ గుర్తు కమలం. మంగోలియా దేశ చిహ్నంలోనూ కమలం ఉంది. అందివచ్చిన అవకాశాన్ని మోడీ చక్కగా ఉపయోగించుకున్నారు. మంగోలియా పార్లమెంటులో 25 నిమిషాల ప్రసంగాన్ని ముగిస్తూ ఈ ప్రత్యేక బంధాన్ని ప్రస్తావించారు. ‘పార్లమెంటు హాలులోకి ప్రవేశించగానే మీ దేశ చిహ్నంలోని కమలం నన్ను ఆకర్షించింది. నాకు ఈ పార్లమెంటుతో ఓ ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది’ అని వ్యాఖ్యానించారు. దీంతో పార్లమెంటు హాలు చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కాగా ఓ విదేశీ నేత కోసం ఆదివారం నాడు పార్లమెంటు సమావేశం కావడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మంగోలియాలో పర్యటించిన తొలి భారతీయ ప్రధాని కూడా మోడీయే. ఆ దేశాధ్యక్షుడు ఎల్‌బెగ్‌ దోర్జ్‌తో కలిసి మోడీ సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.