ఇదీ శాశ్వతం కాదు (Devotional)

అతను యువకుడుగా ఉండగానే రాజయ్యాడు. చిన్న తనం నుండి గొప్ప అధ్యాత్మిక వేత్త అయిన గురువు దగ్గర విద్యాభ్యాసం చేశాడు. దానివల్ల ఆ రాజు యవ్వనంలో వున్నా అతనిలో కొంత వైరాగ్య భావన ఉండేది.

            తాను రాజయిన తరువాత ఒక రోజు తన గురువు గారి ఇంటికి వెళ్ళి “గురుదేవా! ఇంత గొప్పదేశానికి రాజయి నేను అహంకారపూరితుణ్ణి అవుతానేమో. సుఖాలలో మునిగి ధర్మాన్ని మరచిపోతానేమో! ఎప్పుడూ నన్ను నేను మరచిపోకుండా, నిత్య స్పృహతో ఉండేలాగా నాకు ఏదయినా మంత్రోపదేశం చేయండి” అన్నాడు.

            గురువు “దానికి మంత్రాలు ఎందుకు రాజకుమారా! నిన్ను నువ్వు గుర్తు పెట్టుకునేలా, నీ పరిధులు నువ్వు మరచిపోకుండా నేనొక పనిచేస్తాను. నీ కొక ఉంగరం ఇస్తాను. ఆ ఉంగరం మీద ఒక వాక్యం చెక్కించియిస్తాను. దాన్ని అన్ని వేళలా ధరించు. నీకు ఎప్పుడు ఎట్లాంటి సుఖం కలిగినా, ఎంతటి దుఃఖం కలిగినా ఆ ఉంగరాన్ని చూడు. అది నిన్ను నీకు గుర్తు చేస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించేలా చేస్తుంది” అన్నాడు.

            రాజ కుమారుడు సంతోషంతో “తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను గురుదేవా!” అని అన్నాడు.

            రాజ గురువు సేవకుల్ని పురమాయించి స్వర్ణకారుణ్ణి పిలిపించి సలహాలిచ్చి ఆ ఉంగరాన్ని తయారు చేయించి దాన్ని రాజ కుమారుడి వేలికి తొడిగాడు. రాజకుమారుడు ఆ ఉంగరంపై రాసిన మాటల్ని చదివాడు. ఆమాటలు “ఇదీ శాశ్వతం కాదు.” రాజకుమారుడు సంతోషంతో గురువుకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు.

            రాజు యువకుడు. వయసులో ఉన్నవాళ్ళే అతని చుట్టూ ఉంటారు. అన్ని రకాలయిన సుఖాలూ అందుబాటులో ఉంటాయి. మిత్రులు అతనికి మధుపానం అలవాటు చెయ్యడానికి ప్రయత్నించారు. మొదట కొంత తీసుకోవడానికి రాజకుమారుడు అభ్యంతరం చెప్పలేదు. ఒక గ్లాసు మధువు తాగాడు. మిత్రులు మళ్ళీ గ్లాసు నింపారు. ఆ రెండోసారి గ్లాసు తీసుకున్నపుడు వేలికున్న ఉంగరంపై దృష్టిపడింది. “ఇది శాశ్వతం కాదు” అన్నమాటలు చదివాడు. గ్లాసును కింద పెట్టేశాడు. ఇట్లా ప్రతి సందర్భంలో రాజకుమారుణ్ణి ఆ వాక్యం ఆదుకునేది.

            రాజును ఆశ్రయించి ఉపయోగం పొందాలనుకునేవాడు రాజును ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతూ అడుగులకు మడుగులొత్తుతూ పాదాల మీద పడేవాళ్ళు, వాళ్ళని పైకి లేపినపుడు ఉంగరంలోని మాటలు చదివి రాజు నవ్వుకునేవాడు.

            రాజకుమారుడికి అంగరంగ వైభోగంగా పెళ్ళయింది. పొరుగు రాజు కూతుర్ని వివాహమాడాడు. కొంత కాలం లోకాన్ని మరిచి దంపతులు స్వర్గసుఖాల్లో మునిగిపోయారు. రాజకుమారుడు తాను రాజునని, రాజ్యభారం తన మీద ఉందని తాను నిర్వహించాల్సిన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయన్న విషయాన్నే విస్మరించాడు. రాజకుమారుడు ఎప్పుడో తీసి తన ఉంగరాన్ని కిటికీ దగ్గర పెట్టి మరచిపోయాడు. ఉదయాన్నే సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసి గదిలోకి వచ్చాడు. కిటికీలో పెట్టిన ఉంగరంపై కిరణాలు పడి ఉంగరం మెరిసింది. దగ్గరికి వెళ్ళి చూశాడు “ఇదీ శాశ్వతం కాదు” అన్న మాటలు మనసుని చురుక్కుమని గుచ్చాయి. వెంటనే స్పృహలోకి వచ్చి సభకు వెళ్ళి మంత్రులతో రాజ్య వ్యవహారాల్లో మునిగిపోయాడు.

            ఒకసారి పొరుగు రాజ్యం సైన్యం సరిహద్దు మీదికి దండెత్తిందని తెలిసి రాజు సైన్యంతో బయల్దేరాడు. యుద్ధం భీకరంగా జరిగింది. గుర్రం బెదిరి రాజును కొండల్లోని లోయల్లోకి తీసుకెళ్ళింది. ఎవరూ లేని ఒక గుట్టమీద ఆగింది. గుర్రం దిగబోతూ ఉంటే రాజు వేలికున్న ఉంగరం కిందపడింది. రాజు చూశాడు “ఇదీ శాశ్వతం కాదు” అన్న మాటలు గుండెను హత్తుకున్నాయి. దారి తెలీని చీకట్లో ఆ రాత్రి ప్రశాంతంగా గడిపాడు. మరుసటి రోజు రాజును వెతుక్కుంటూ వచ్చిన సైన్యం రాజును కలిసింది.

            అట్లా ప్రతిక్షణం రాజుకు మార్గం చూపిస్తూ జీవితంలోనే కాదు, జీవితానంతరం కూడా రాజుకు ఆ వాక్యం దారి చూపింది.

– సౌభాగ్య