తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండ‌లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. రోహిణీకార్తె త్వ‌ర‌లో రానుండ‌డంతో వేడి క్ర‌మంగా పెరుగుతోంది. గ‌త రెండు రోజులుగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్టోగ్ర‌త అధికంగా న‌మోద‌వుతుంది. కోస్తాంధ్ర ప్రాంత ప్ర‌జ‌ల ఎండ వేడిమితోపాటు ఉక్క‌పోత‌తో త‌డిసి పోతున్నారు. ఉద‌యం 9 గంట‌ల నుంచే ఎండ‌లు మండిపోతుంటే… సాయంత్రం ఐదు గంట‌ల‌యినా బ‌య‌టికి వెళ్ళే సాహ‌సం చేయ‌డం లేదు. ఈ సీజ‌న్‌లో మంగ‌ళ‌వార‌మే అత్య‌ధికంగా నిజామాబాద్‌లో 45 డిగ్రీలు, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌లలో 44 డిగ్రీల ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యాయి. అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌తగా చెప్పుకో వ‌ల‌సి వ‌స్తే 36 డిగ్రీలు విశాఖ‌ప‌ట్నంలో న‌మోదైంది. అయితే స‌ముద్ర తీరం కావ‌డం వ‌ల్ల ఉక్క‌పోత‌తో జ‌నం ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఇక హైద‌రాబాద్‌, ఖ‌మ్మంలో 42 డిగ్రీలు, విజ‌య‌వాడ 41, క‌ర్నూలు, నెల్లూరు, వ‌రంగ‌ల్‌, క‌డ‌ప‌ల్లో 40, తిరుప‌తిలో 38 డిగ్రీలుగా ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యాయి. ఈ పెరిగిన ఉష్ణోగ్ర‌త‌లు మ‌రో వారం రోజుల‌పాటు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ ప‌రిశోధ‌న కేంద్రం తెలిపింది.