కేన్స్ లో రెడ్ కార్పెట్ పై భార‌త థియేట‌ర్ న‌టి

ఈ చిత్రంలో న‌వ్వులు చిందిస్తున్న అమ్మాయి పేరు వేగా త‌మోషియా. త‌మిళ‌. హిందీ చిత్రాల‌తో పాటు హ్యాపీ హ్యాపీగా అనే తెలుగు చిత్రంలోనూ న‌టించింది. 30 ఏళ్ల వేగా చ‌త్తీస్‌గ‌ఢ్ అమ్మాయి. చిన్న‌ప్ప‌టినుండే థియేట‌ర్ ఆర్టిస్ట్ గా రాణించిన వేగా ముంబ‌యిలో ప్రొఫెష‌న‌ల్‌ థియేట‌ర్ ఆర్టిస్ట్ కూడా. ఆమె న‌టించిన స‌రోజ అనే త‌మిళ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌సూళ్లు సైతం సాదించింది. న‌టించిన ప్ర‌తి చిత్రంలోనూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. క‌మ‌ర్షియల్ ఆర్టిస్టుగా కంటే మంచి న‌టిగా ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈమె న‌టించిన ల‌వ్ కమ్స్ లేట‌ర్ అనే ల‌ఘు చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శితం కాబోతోంది. ఇద్ద‌రు యువ‌తులు మ‌రో దేశం మారాల్సిన స‌మ‌యంలో ఎదుర్కొన్న ఇమ్మిగ్రేష‌న్ క‌ష్టాల‌ను ఇందులో చిత్రించారు. ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో భాగ‌మైన సెమ‌న్ డెలా క్రిటిక్ అనే విభాగంలో పోటీ ప‌డబోతున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేవ‌లం ప‌ది సినిమాల‌ను ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రిటిక్స్ వీక్ పేరుతో ప్ర‌ద‌ర్శిస్తారు.  ల‌వ్ క‌మ్స్ లేట‌ర్ ఇంత ప్రతిష్టాత్మ‌క విభాగంలో ఎంపిక కావ‌టం ప‌ట్ల వేగా చాలా ఆనందంగా ఉంది. త‌మ చిత్రం కేన్స్ కి ఎంపిక కావ‌టం పెద్ద ఆశ్చ‌ర్యం అంటోంది. ప్ర‌స్తుతం వేగా కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో ఉంది. ఈ రోజే ఆమె న‌టించిన చిత్రం అక్క‌డ ప్ర‌ద‌ర్శితం కాబోతోంది. వేగా కేన్స్ లో రెడ్ కార్పెట్ మీద సైతం న‌డ‌వ‌బోతోంది. సోనీ సినీఆల్టా డిస్క‌వ‌రీ ప్ర‌యిజ్‌, కెనాల్ అవార్డ్ అనే రెండు విభాగాల్లో ఆమె చిత్రం పోటీప‌డుతుంది . ఈ చిత్రం త‌న‌లోని భావోద్వేగాలకు ప్ర‌తిబింబంలా ఉంటుంద‌ని వేగా చెబుతోంది. సోనీ జుహీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంకోసం తాను చాలా హార్డ్ వ‌ర్క్ చేశాన‌ని, ఆ కార‌క్ట‌ర్ ల‌క్ష‌ణాలు ప‌ట్టుకునేందుకు చాలా శ్ర‌మ‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని వేగా తెలిపింది. తాము కే్న్స్ కి అప్ల‌యి చేసిన‌పుడు ఇంకా చిత్రం పూర్తి కాలేద‌ని, ఇది త‌మ చిత్రానికి గొప్ప గౌర‌వంగా భావిస్తున్నామ‌ని, కే్న్స్ అంటే కేవ‌లం అయిదు నిముషాల పాటు రెడ్ కార్పెట్ మీద న‌డ‌వ‌డం కాద‌ని, ఎంతోమంది సినిమా ప్రేమికుల‌ను క‌ల‌వ‌టం, ఎన్నో మంచివిష‌యాలు చ‌ద‌వ‌డం, తెలుసుకోవ‌డం, గొప్ప చిత్రాలు చూడ‌డం…అదంతా ఒక మ‌ర్చిపోలేని అనుభూతి అని వేగా చెబుతోంది. మే 22 వ‌ర‌కు త‌న టీమ్‌తో క‌లిసి వేగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లోనే ఉంటుంది. అనంత‌రం భార‌త్ వ‌చ్చాక ల‌వ్ క‌మ్స్ లేట‌ర్ పూర్తి నిడివి ఫీచ‌ర్ ఫిల్మ్ ప‌నుల్లో పాల్గొంటుంది. అన్నీ బాగా జ‌రిగితే ఆఫీచ‌ర్ సినిమా సైతం కేన్స్ కు వెళుతుంద‌నే ఆశాబావాన్ని వేగా వ్య‌క్తం చేసింది.