మూడు యూనివర్సిటీల స్థలాల్లో పేదలకు ఇళ్లు: కేసీఆర్

‘పేదల ఇళ్ల కోసం స్థలం ఎందుకు దొరకదు? మూడు వర్సిటీల్లో బోలెడంత జాగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఓపెన్‌ యూనివర్సిటీల్లో కావాల్సినంత స్థలం ఉంది. ఆ జాగాలను తీసుకుని పేదల కోసం ఇళ్లు నిర్మిస్తాం’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఓయూ క్యాంపస్‌కు సంబంధం లేని భూములనూ ఇళ్ల కోసం వినియోగిస్తామని, సీసీఎంబీ, ఎన్‌జీఆర్‌ఐకి చెందిన 70-80 ఎకరాల్లోనూ ఇళ్లు కట్టించే విషయాన్ని పరిశీలిస్తున్నామ‌ని చెప్పారు. గుర్రపు పందేలకు, గోల్ఫ్‌కోర్సులకు, క్లబ్బులకు స్థలాలు దొరుకుతున్నప్పుడు పేదల ఇళ్ల కోసం స్థలాలు ఎందుకు దొరకవన్నారు? స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఆయన బస్తీవాసులపై వరాలజల్లు కురిపించారు. ఆరు అంతస్థులు.. దానికో లిఫ్టు.. ఆ భవనంలో ఫ్లాట్లు.. ఒక్కో దాంట్లో రెండు బెడ్ రూంలు.. ఓ హాలు..వంటగది.. రెండు మరుగుదొడ్లు.. ఇంటింటికి నల్లా కనెక్షన్‌ స్వచ్ఛమైన గాలి.. వెలుతురు.. వివిధ కార్యక్రమాల కోసం దానికో కమ్యూనిటీ హాలు.. వాహనాల కోసం పార్కింగ్‌ సౌకర్యం…. ఇవన్నీ హమాలీబస్తీ వాసులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వరాలు! బస్తీవాసులు అంగీకరించడమే ఆలస్యం బుధవారం ఉదయమే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కూడా చేసేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేవలం ఐదు నెలల్లో ఐడీహెచ్‌ కాలనీలో వాటిని నిర్మించి బస్తీవాసులకు అందజేసి.. పేదలు తలెత్తుకు బతికేలా చేస్తానని కేసీఆర్‌ మాటిచ్చారు. ఒక్కో ఇంటికి సుమారు 9 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఆ ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని, బస్తీలోని పేదలంతా ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన వివ‌రించారు. ఇది ప్రజాస్వామ్య ప్రజల యుగమని, పేదవాళ్లు ఊరవతల జీవించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక మీదట పేదలకు డబ్బా ఇళ్లు ఉండబోవని, ఆ బాధలన్నీ తీరుస్తానని అన్నారు. ఆడపిల్లలు బట్టలు మార్చుకోవడానికీ ఇక ఇబ్బంది ఉండదన్నారు. ఇంటికి చుట్టం వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగదన్నారు.
విద్యార్థుల ఆగ్రహ జ్వాల
ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ‘స్వచ్ఛ హైదరాబాద్‌’లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిరసిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు సచివాలయంలోని సీఎం కార్యాలయం సీబ్లాక్‌ ప్రాంగణాన్ని నినాదాలతో హోరెత్తించారు. సుమారు 10 మంది ఓయూ జేఏసీ విద్యార్థులు సచివాలయానికి వచ్చారు. నేరుగా సీ బ్లాక్‌ ముందు బారికేడ్ల వద్దకు చేరుకున్నారు. ‘‘కేసీఆర్‌ ఓయూకు వస్తే బొంద పెడతాం, కావాలంటే పేదలకు నీ ఫామ్‌హౌస్‌ ఇచ్చుకో, ఉస్మానియా భూములను లాక్కొవద్దు’’ తదితర నినాదాలు రాసిన ప్లకార్డులు, ఎన్‌ఎస్‌యూఐ జెండాను ప్రదర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఓయూకు చెందిన 11 ఎకరాల స్థలాన్ని పేదలకు ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించడానికి అదేమీ ఆయన జాగీరు కాదని.. ఆ భూములపై ఎవరు కన్నేసినా ఊరుకోబోమని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీలో సోమవారం ఏబీవీపీ, పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, టీవీఎస్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మతో ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఎన్‌సీసీ గేటు వరకూ శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. డీఎస్‌యూ, టీవీఎస్‌ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కాలేజీ వద్ద విద్యార్థులు కేసీఆర్‌ దిష్టిబొమ్మను ఉరి తీశారు. పేద ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఓయూ భూములను కాపాడుకుంటామని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఓయూ భూములను పేదప్రజలకు అప్పగించేందుకు అవేమీ కేసీఆర్‌ దొరల గడీలు కావని ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.