Telugu Global
Family

సీత (FOR CHILDREN)

“రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది?” అని వెనకటికెవడో అడిగాడట. ఔను, ఏమవుతుంది? భార్యవుతుంది! ఇంకా చెప్పాలంటే రాముని ఇంటి పేరయింది? దశరథ రాముడు పెళ్ళయ్యాకసీతారాముడయ్యాడు. రాముని ముందు సీత పేరు చేరింది. జత చేరింది. రెండు పేర్లూ కలిసి ఒక్కపేరయింది.             పిల్లలు లేక పుత్రకామేష్టియాగం చెయ్యాలనుకొని జనకమహారాజు భూమిని దున్నుతూ వుంటే నాగేటి చాలులో బంగారపు పెట్టెలో దొరికింది కాబట్టి సీతని పేరు పెట్టారు. శివధనస్సు విరిచిన వారికేసీతను ఇచ్చి పెళ్ళి చేస్తామన్నారు. విశ్వామిత్రుని […]

“రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది?” అని వెనకటికెవడో అడిగాడట. ఔను, ఏమవుతుంది? భార్యవుతుంది! ఇంకా చెప్పాలంటే రాముని ఇంటి పేరయింది? దశరథ రాముడు పెళ్ళయ్యాకసీతారాముడయ్యాడు. రాముని ముందు సీత పేరు చేరింది. జత చేరింది. రెండు పేర్లూ కలిసి ఒక్కపేరయింది.

పిల్లలు లేక పుత్రకామేష్టియాగం చెయ్యాలనుకొని జనకమహారాజు భూమిని దున్నుతూ వుంటే నాగేటి చాలులో బంగారపు పెట్టెలో దొరికింది కాబట్టి సీతని పేరు పెట్టారు. శివధనస్సు విరిచిన వారికేసీతను ఇచ్చి పెళ్ళి చేస్తామన్నారు. విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు రాముడు శివధనస్సును ఎక్కుపెట్టాడు. విల్లు విరిగింది. సీతారామ కళ్యాణం జరిగింది.

అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం జరగాల్సిందే, కాని కైక కోరికతో తండ్రి మాటకు తలవంచి రాముడు అడవులకు వెళ్ళాడు. తోడిదే సీత. రాముడు వద్దన్నాడు. పతులను విడిచి వుండడం సతులకుధర్మం కాదంది సీత. నీడై నడిచింది. వనవాసంలో కూడా రాముని సహవాసమే కోరుకుంది. అడవిలో ఎందరో మునీశ్వరుల ఆశీర్వాదం అందుకుంది. అత్రిమహాముని ఆశ్రమాన కొంతకాలం వున్నప్పుడుమునిపత్నికి తన కథ చెప్పుకుంది. అనసూయ అభిమానంతో పాటు ఆమె చెప్పిన సతి ధర్మాలను తెలుసుకుంది.

గౌతమీ తీరాన పంచవటిలో పర్ణశాలలో భర్త తోడిదే లోకంగా జీవించింది. ఆనందించింది. ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. శూర్పణఖ రూపంలో ఆపద మొదట తొంగి చూసింది. రాముడు కాదనిఅవమానించినందుకు శూర్పణఖ సీత మీద అసూయ, ద్వేషం పెంచుకుంది. ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడైతే – అందుకు పర్యవసానం సీత అనుభవించింది. శూర్పణఖ తన అన్న రావణునికి సీతఅందం గురించి చెప్పి ఉసిగొలిపింది. రావణమాయతో మాయలేడిగా మారీచుడు వచ్చాడు. బంగరులేడిని ముచ్చటపడింది సీత. రాముడు తీసుకొస్తానని వెళ్ళాడు. రాలేదు. ప్రమాదంలో వున్నట్టు పిలుపు.లక్ష్మణున్ని వెళ్ళమని కోరింది సీత. అన్నకి ఏ ఆపదా రాదని చెప్పాడు. కీడు శంకించి బాధతో లక్ష్మణుని సీత నిష్టూరమాడింది. అందులో రాముడి మీదున్న ప్రేమే కనిపిస్తుంది.

లక్ష్మణుడు వెళ్ళాక రావణుడు వచ్చాడు. మాయ చేసాడు. ఆ రాక్షస రూపానికి సీత మూర్ఛపోయింది. ఎత్తుకు పోతున్న రావణునితో జటాయువు పోట్లాడి నేల కొరిగింది. సీత తెప్పరిల్లిజరిగినదేమిటో గ్రహించి తన ఆభరణాలను ఆనవాళ్ళుగా మూటకట్టి కిందికి జార విడిచింది. ఆ తర్వాత అశోక వనంలో శోక దేవతే అయింది. రావణుని కోరిక నెరవేర్చలేదు. రామనామమే సర్వనామమయింది.రాముని బంటుగా హనుమంతుడు ఉంగరం తెచ్చి చూపిస్తే మురిసిపోయింది. తనతో రమ్మంటే, రామునికది ఖ్యాతి కానే కాదంది. రానంది.

రావణుడు తన ప్రయత్నం మానలేదు. రాముడు మరణించాడని నమ్మించబోతే – ఏడ్చినాసరే, నమ్మకాన్ని వదులుకోలేదు. నమ్మినట్టుగానే రాముడొచ్చి రావణున్ని చంపి తనతో తీసుకువెళ్ళాడు.సీత అగ్నిప్రవేశం చేసి తనేమిటో నిరూపించుకుంది. తర్వాత సీత గర్భవతి అయింది. రాముడు కోరిక చెప్పమంటే మునిపత్నులతో ఉండాలని ఉందని అంది సీత. రాముడు కాబట్టి రావణుడి ఇంటవున్నసీతను ఏలుకున్నాడని నింద పడ్డాక సీతకు చెప్పకనే లక్ష్మణుని తోడిచ్చి అడవికి పంపాడు. లక్ష్మణుడు దుఃఖ పడితే అసలు విషయం తెలిసి కూడా కన్నీళ్ళను మింగికూడా అన్నమాట నెరవేర్చడం నీధర్మంఅని ధైర్యం చెప్పి పంపింది. వాల్మీకి ఆశ్రమంలో సీత ఉండి లవకుశలకు జన్మనిచ్చింది. లవకుశలు శ్రీరాముని చరితమును వాల్మీకి ద్వారా విని, నేర్చుకొని అయోధ్యలో ఆలపించారు. రాముడుచలించిపోయాడు. కన్నీరయ్యాడు. సీత జాడ తెలుసుకున్నాడు. వాల్మీకి ఆశ్రమానికి శత్రుఘ్నుని పంపించాడు. సీత వెంట వచ్చింది. సీత యెంత పవిత్రురాలో వాల్మీకి చెప్పాడు. రాముడు మూగవాడయ్యాడు.సీత మాత్రం తీరని దుఃఖంతో “నేను కల్మషం కాకుంటే – రాముని తప్ప వేరెవరినీ ఎరగకుంటే – ఈ భూదేవి నాకు చోటిస్తుంది” అనడంతో భూమి చీలింది. రత్నసింహాసనం ఎక్కి భూమిలోపలికి వెళ్ళిపోయింది.భూమిలో పుట్టి భూమిలో కలిసి భువిలో లేని కథ సీత కథ! కన్నీటి కథ!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  18 May 2015 1:02 PM GMT
Next Story