వరంగల్‌ నిట్‌ తెలంగాణదే : మంత్రి కడియం

వరంగల్‌లో ఉన్న నిట్‌ తెలంగాణకే చెందుతుందని, నిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీట్లు కోరడం సరికాదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆర్టికల్‌ 371 డి ప్రకారం ఏపీ వాదన చెల్లదని అన్నారు. గతంలో జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించారని ఆయన తెలిపారు. నిట్‌ ప్రకటించిన అడ్మిషన్‌ ప్రొగ్రాం ప్రకారం 50 శాతం సీట్లు తెలంగాణకే దక్కాలని కడియం అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏపీ తెలంగాణ విద్యార్థుల సీట్లను కొల్లగొడతామనడం సరికాదని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మా విద్యార్థులకు మెడికల్‌, ఇంజనీరింగ్‌, టెక్నికల్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లలో సీట్లు దొరకడం లేదనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో పరపతి ఉపయోగించి ఏదో చేయాలని అనుకుంటున్నారని, దాన్ని తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, అవసరమైతే చట్టపరంగా న్యాయపోరాటం చేస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.