ఆదిలోనే హంస‌పాదు… జేడీయు-ఆర్జేడీ మధ్య విభేదాలు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా… జనతా పరివార్ ఏకం కావాలన్న ప్రతిపాదనపై కొన్ని నెలలుగా కసరత్తు సాగుతూనే వుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. పాత జనతాదళ్‌కు చెందిన పార్టీలన్నీ మళ్లీ ఒక్కటి కావాలని నేతలు భావించారు. అయితే బీహార్ ఎన్నికలలోపు అది సాధ్యపడేలా లేదు. దీంతో మళ్లీ ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేయటమే కాదు.. మరికొంత కాలం తర్వాతైనా విలీనమయ్యే పార్టీలు కాబట్టి… సర్దుకుపోదామన్న దోరణి వాటిలో కనిపించటం లేదు. బీహార్‌ ఎన్నికల సీట్ల సర్దుబాటు కుదరట్లేదు. మాకు ఎక్కువ సీట్లు కావాలంటే… మాకు ఎక్కువ కావాలని… జేడీయు, ఆర్జేడీ కీచులాటకు దిగుతున్నాయి. బీహార్ అసెంబ్లీ మొత్తం స్థానాలు 243. వీటిలో 145 స్థానాలు కావాలంటూ ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘవంశ్ ప్రసాద్‌సింగ్‌ కొత్త ప్రతిపాదన తెచ్చారు. జేడీయుకు రాష్ట్రంలో ఇపుడు ప్రజాదరణ తగ్గిందని… అందుకే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి కాకుండా… ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి సీట్ల కేటాయింపు ఉండాలని అడుగుతున్నట్లు చెప్పారు. దీనిపై జేడీయు తీవ్రంగా స్పందించింది. 145 ఎందుకు మొత్తం 243 స్థానాల్లో మీరే పోటీ చేయండని జేడీయు సీనియర్ నేత, బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రం సందించారు. త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికల విషయంలోనూ రెండు పార్టీల మధ్య అదే పరిస్థితి. మండలిలో ఖాళీ కానున్న 24 స్థానాల్లో 12 సీట్లతో తాము పోటీ చేస్తామని… ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ ఇప్పటికే ఏకపక్షంగా ప్రకటించారు. అయితే ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని… జేడీయు ప్రకటించింది.