Telugu Global
Family

దధీచి (FOR CHILDREN)

ఆయుధాల్లోకెల్లా మేటి ఆయుధం… సాటిలేని ఆయుధం వజ్రాయుధం! అలాగే అస్త్రాలలోకెల్లా అద్భుతమైన అద్వితీయమైన అస్త్రం… బ్రహ్మ చక్రం! ఇలాంటి అనేక ఆయుధాస్త్రాలు దేవతల బలాన్ని పెంచేవేగాక విజయాన్ని వరించి తెచ్చిపెట్టేవి! మరి వజ్రాయుధం, బ్రహ్మచక్రం ఇలాంటి ఎన్నో ఆయుధాస్త్రాల కథ తెలుసుకోవాలంటే దధీచి కథ తెలుసుకోవాల్సిందే! దధీచి మహాముని మహా తప‌శ్శాలి! అంతులేని తపస్సు చేసి ఇంద్రుణ్ని మెప్పించి బ్రహ్మజ్ఞానాన్ని వరంగా పొందాడు. వరమయితే ఇచ్చాడుగాని ఇంద్రునికి భయం పట్టుకుంది. అందుకని వరంతోపాటు ఒక నిబంధన కూడా […]

ఆయుధాల్లోకెల్లా మేటి ఆయుధం… సాటిలేని ఆయుధం వజ్రాయుధం! అలాగే అస్త్రాలలోకెల్లా అద్భుతమైన అద్వితీయమైన అస్త్రం… బ్రహ్మ చక్రం! ఇలాంటి అనేక ఆయుధాస్త్రాలు దేవతల బలాన్ని పెంచేవేగాక విజయాన్ని వరించి తెచ్చిపెట్టేవి! మరి వజ్రాయుధం, బ్రహ్మచక్రం ఇలాంటి ఎన్నో ఆయుధాస్త్రాల కథ తెలుసుకోవాలంటే దధీచి కథ తెలుసుకోవాల్సిందే!
దధీచి మహాముని మహా తప‌శ్శాలి! అంతులేని తపస్సు చేసి ఇంద్రుణ్ని మెప్పించి బ్రహ్మజ్ఞానాన్ని వరంగా పొందాడు. వరమయితే ఇచ్చాడుగాని ఇంద్రునికి భయం పట్టుకుంది. అందుకని వరంతోపాటు ఒక నిబంధన కూడా పెట్టాడు. “ఈ బ్రహ్మ జ్ఞానాన్ని నువ్వు వేరెవ్వరికి చెప్పినా నీ తల వెయ్యి ముక్కలవుతుంది” అని హెచ్చరించాడు. తర్వాత దధీచి గురువయ్యాడు. సరస్వతీ నదీ తీరాన తన ఆశ్రమంలో ఎందరో శిష్యులకు గురుబోధ చేశాడు. ఒక రోజు స్వర్గలోకం నుండి అశ్వినీ కుమారులిద్దరూ వచ్చి శిష్యులుగా చేరారు. బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని అర్ధించారు. దధీచి “గురువు” అన్నమాటకు అర్థం తెలిసినవాడు గనుక, ఆచరించనవాడు గనుక కాదన లేకపోయాడు. తన తల వేయి ముక్కలవుతుందని తెలిసీ సిద్ధమయ్యాడు. జరగబోయేది ముందే పసిగట్టిన ఆ కవల సోదరులిద్దరూ దధీచి తలను తీసి, ఆస్థానంలో ఒక గుర్రం తలను అమరుస్తారు. గుర్రం తలతోనే దధీచి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. ఇంద్రునికి ఈ విషయం తెలుస్తుంది. ఆగ్రహమొస్తుంది. దధీచి తలను నరికి వేస్తాడు. అయితే అసలు తలను మొండానికి అమర్చి బ్రహ్మజ్ఞానమెరిగిన ఆ శిష్యులు తిరిగి గురువుగారికి ప్రాణం పోస్తారు!
ఇదిలా వుండగా రాక్షసులు దేవతల మీద యుద్ధం చేసి తమ ఆయుధాలను ఎత్తుకు పోతుండడంతో ఆయుధాలను దాచమని దధీచికి ఇస్తారు. దధీచి జాగ్రత్తగా దాస్తాడు. దేవతలు తమ భోగ విలాసాల్లో మునిగి తేలి ఆయుధాల సంగతే మరిచి పోయారు. ఆయుధాస్త్రాలు ఎక్కువ కాలం అలాగే ఉండిపోవ‌డంతో తుప్పు పడతాయి. అది గమనించిన దధీచి తన శక్తితో ఆయుధాస్త్రాలను కరిగించి ఆ ద్రావకాన్ని తాగేస్తాడు. తాగి వెన్నెముకలో ఇముడ్చుకొని భద్రపరుస్తాడు. దేవతలకు ఆపద వృత్రుని రూపంలో వచ్చింది. కొందరు దేవతల అనుగ్రహంతోనే వృత్రుడు ఇంద్రునికి సమానమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాడు. కంటగింపుగా ఉన్నాడు. అందుకనే అస్త్రాలు అవసరమయ్యాయి. దధీచి దగ్గరకు వచ్చి ఆయుధాస్త్రాలు తిరిగి ఇవ్వమని కోరారు. జరిగింది చెప్పాడు దధీచి. దేవతలు ఒప్పలేదు. నన్ను చంపి తీసుకెళ్ళమన్నాడు దధీచి. దేవతలు తమ తప్పు తెలుసుకున్నారు. ఇంకొక తప్పు చేయలేమన్నారు. దారి చూపమని దధీచిని వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు సూచన మేరకు దధీచి దగ్గరకు వెళ్ళి అసలు విషయం… అదే వృత్రుని గురించి చెపుతారు. రక్షణ కోరతారు.
దధీచి యోగాగ్నిని సృష్టించుకొని తన శరీరాన్ని తానే దహించుకుంటాడు. దధీచి ముందు చెప్పినట్లుగానే అతని వెన్నెముకని మిగతా ఎముకల్ని దేవతల శిల్పి విశ్వకర్మ ఆయుధాస్త్రాలు తయారు చేస్తాడు. వెన్నెముక నుండి వజ్రాయుధాన్ని, మిగతా ఎముకల నుండి బ్రహ్మచక్రాన్ని మలుస్తాడు. వీటితోనే వృత్రుణ్ని మట్టుబెడతారు. దేవతల విజయానికి దధీచి సాయుధ సంపత్తిగా ఉపయోగపడ్డాడు. దధీచి చనిపోయే నాటికి అతని భార్య లోపాముద్ర (సువర్చ) గర్భవతిగా ఉంది. వీరి సంతానమే బిప్పలాథుడు!
అదీ ఆయుధాస్త్రాల కథ!.
– బమ్మిడి జగదీశ్వరరావు
First Published:  19 May 2015 1:02 PM GMT
Next Story