సౌభాగ్య ఆసియాకు మోడీ పిలుపు

‘ప్రపంచంలో ఆరో వంతు మానవవనరులు భారత్‌ సొంతం. ఇది ప్రపంచానికి మేం అందిస్తున్న అవకాశం’ అని ప్రధాన‌మంత్రి మోడీ పేర్కొన్నారు. పరిమితంగా ఉన్న సహజవనరులను సరైన రీతిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. ‘ఆసియా పునరుజ్జీవమే ఈ శతాబ్దాపు అతిపెద్ద విజయం కావాలి. ఆసియా దేశాలన్నీ ఏకమై ఒక్కటిగా నిలవాలి. సౌభాగ్య ఆసియా నా కల’ అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆసియా దేశాలు ప్రాంతీయ విబేధాలను వీడి ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఐక్య ఆసియాకు ప్రపంచాన్ని నిర్దేశించగల సత్తా ఉందన్నారు. దక్షిణ కొరియాలో రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన సియోల్‌లో ఆసియా దేశాల ఆరో నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. ఆశావాదంతో నిండిన సౌభాగ్యవంతమైన ఆసియాను చూడాలా లేక నిరాశావాదంతో కూడిన నిరుపేద ఆసియాను చూడాలా అన్నది నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని మోడీ అన్నారు. ‘ఆసియా ఖండం దేశాలు, జాతుల సమూహంగా ఉండడానికి వీల్లేదు. ఆసియా దేశాలన్నీ ఏకమై అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలి’ అని మోడీ ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలను సంస్కరించి తమదైన ముద్ర వేయగల సత్తా ఆసియా దేశాలకు ఉందన్నారు. ఆసియాలోని ధనిక దేశాలు సాటి దేశాలకు చేయూతనిచ్చేందుకు ముందుకు రావాలని, దీన్ని బాధ్యతగా భావించాలని కోరారు.