భర్త మీద కోపంతో ఏడుగురి స‌జీవ‌ద‌హ‌నం!

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే.. విభేదాలు రావటంతో.. వేరువేరుగా ఉంటున్నారు. మ‌ళ్ళీ అత‌నికి సంసారంపై మోజు క‌లిగింది. సొంత భార్య‌తో సంసారం చేసుకోవ‌చ్చు క‌దా. కానీ వేరే పెళ్ళికి సిద్ధ‌మ‌య్యాడు. అంతే ఇది  జీర్ణించుకోలేని మొద‌టి భార్య.. ఆయన కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టింది. తమిళనాడులోని మదురై జిల్లా.. కుమారపురానికి చెందిన కన్నన్‌(28), పాండేశ్వరి(25) ల‌కు మూడేన్నరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివిధ కారణాలతో.. వీరు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. కన్నన్‌ చెన్నైలో పనిచేస్తుండగా.. పాండేశ్వరి స్థానికంగానే ఉంటోంది. వీరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు గ్రామపెద్దలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం కూడా రెండు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు. అయినా ఫలితం కనిపించటం లేదు. భర్త తన అక్క కూతురును పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పాండేశ్వరికి తెలిసింది. దీంతో తెల్ల‌వారుజామున 2 గంటల ప్రాంతంలో కన్నన్‌ కుటుంబం నివశిస్తున్న ఇంటికెళ్లి బయట నుంచి గడియ పెట్టింది. ఇంటిపైన, లోపల.. పెట్రోల్‌, కిరోసిన్‌ గుమ్మరించి నిప్పంటించి పారిపోయింది. ఈ ఘటనలో త‌న భ‌ర్త క‌న్న‌న్‌తోపాటు అతని తండ్రి వేలు(60), తల్లి పేచియమ్మాళ్‌(50), అక్క సుగంధి(35), ఆమె కుమార్తె సంగీత(17), కుమారులు వినీత్‌ (14), సంగీత్‌(12) సజీవదహనమయ్యారు. పాండేశ్వరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.