365 డేస్ మూవీ రివ్యూ

రేటింగ్: 2.5/5

zed పిక్చర్స్ – డి వి క్రియేషన్స్ నిర్మించిన చిత్రం “365 డేస్”. కథ, దర్శకత్వంతో పాటు తొలిసారిగా మాటలు కూడా రాసారు రాంగోపాల్ వర్మ. చాలా కాలంగా వర్మ పట్టుబట్టి సినిమాల మీద సినిమాలు తీసిమరీ థియేటర్లకు ప్రేక్షకులు రాకుండానే కాదు, భయపడి పారిపోయేలా తనవంతు కృషి చేస్తున్నారు. దెయ్యాలూ ఫ్యాక్షనిస్టులూ రౌడీలూ సైకోలూ అంతా తమ మీద రాంగోపాల్ వర్మ పగపట్టాడని అనుకొని జడిసి చస్తుంటే – పెళ్లి చేసుకోవాలనుకొనే ప్రేమికుల జంటలూ  కొత్తగా వచ్చి ఈ లిస్టులో చేరాయి!

సినిమా రాంగోపాల్ వర్మ మాటలతోనే మొదలవుతుంది. 365 రోజు మైలు రాయి దగ్గర. కప్పూ సాసరు బద్దలయినట్టు జీవితం భళ్ళున బద్దలవుతుంది. అపూర్వ (నందు), శ్రేయ (అనైక సోతి) యిద్దరూ విడిపోవాలను కుంటారు. ఎందుకు విడిపోవాలని అనుకున్నారో దర్శకుడు తన గొంతుతో ముందు చెప్పడమూ.. మనం నమ్మమేమోనని చాలక వెనక కథ చూపించడమూ.. మధ్య మధ్యలో ప్రతిరోజూ కథ తానే చెప్పి నడిపించడమూ.. ఆయన చెప్పినట్టే పాత్రలు నడవడమూ పాతదనమే కొత్తదనముగానూ కనిపిస్తుంది. అయితే వర్మలో వచ్చిన మార్పు కథలో కనిపిస్తుంది!

ప్రేమంటే సెక్సూ పెళ్ళంటే దాని లైసెన్సూ అని నమ్మి నడిపిన కథలో నందు అమ్మాయి అందచందాలకు మొహితుడవుతాడు. అభిరుచులకు కాదు. శ్రేయకూడా తానంటే పిచ్చయి పోతున్నాడు గనుక తానూ ప్రేమించేస్తుంది. ‘తన అందాలు చూడడానికి జీవితమంతా సరిపోదు’ అన్నాడు గనుక పెళ్ళాడేస్తుంది. భిన్నమైన పెంపకాల్లో పెరిగినవాళ్లు గనుక సహజంగానే గొడవలు వస్తాయి. అవి  చిన్నవే అయినా పెరిగి పెద్దవవుతాయి. ఈలోగా మోహాలు తగ్గుతాయి. పాపం వాళ్లకి మాట్లాడుకోవడానికి ఏమి వుండదు. బోరు కొడుతుంది. ప్రేమ తగ్గిపోయిందని నందు తన మిత్రుడు ప్రశాంత్ (కృష్ణుడు)కు, జగజీత్ (పోసాని)కు చెప్పుకుంటాడు. జగజ్జీతు ఓ భార్య బాధితుడు. సిగరెట్, గుట్కా  మీద కాదు, పెళ్లి కార్డుల మీద ‘చట్టబద్దమైన హెచ్చరిక’ వేయాలంటాడు. శ్రేయ తన మిత్రులు అనిత (సత్యకృష్ణ)కు, ప్రశాంత్ భార్యకు, నాయినమ్మ (గీతాంజలి), తాతయ్య (రావి కొండలరావు)కు చెప్పుకుంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అసిస్టెంటు డైరెక్టర్ హీరోయిన్ ప్రేమలోపడి అనితను వదిలేసినట్టు చెపుతుంది(మళ్ళీ కలుస్తారు మెయిన్ ట్రాక్ కథే, సబ్ ట్రాక్ కథ కూడా!). దాంతో శ్రేయ తన భర్తను అనుమానిస్తుంది. ఇంతబలహీనమైన క్యారకర్స్ ని పట్టుకొని ‘స్ట్రాంగ్ క్యారెక్టర్స్’ అని దర్శకుడు పదేపదే మనల్ని నమ్మించాలని చూస్తాడు.

14వ రోజు జ్యోతిష్యం చెపుతానంటూ చెయ్యి పట్టుకోవడం, 25వ రోజు పాదాలనుండి పాకి ముద్దడగడం, 63వ రోజు నేనంటే పడి చస్తాడు కాబట్టి ఓకే అనడం, 100వ రోజు పెళ్లి, 147వ రోజు ఇల్లు బోరుకోట్టి రెస్టారెంటుకు వెళ్ళడం, 235వ రోజు మా-మీ పేరెంట్స్ గురించి గొడవపడడం, 290వ రోజు 47వ రోజు తడిచిన అందాలని చూసి ఎలాఫీలయ్యాడో గుర్తు చేసుకోవడం, ?పుట్టినరోజు మర్చిపోవడం – 323వ రోజు పోర్నో చూసే(నేరం చే)యడం,  364వ రోజు హోటల్లో టేబుల్ రిజర్వు చేసి రాకపోడం వెరసి విడాకులకి సిద్దమైపోవడం మాత్రమె కాదు, విడాకులు తీసుకుంటారు కూడా! పెళ్ళికి ముందు పెళ్ళికి తరువాత వచ్చిన తేడాయే ఈ కథ. విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ కలిసారా? కలిసి జీవించారా? ఎలా సర్దుకున్నారు? రాజీపడ్డారా? ఒక్కటయ్యరా? అర్ధం చేసుకున్నారా? అనేది మిగతాకథ!

కథా వస్తువు మంచిదే! మాటలూ ఓకే! కానీ కథ కళ్ళముందు జరుగుతుందే కానీ దర్శకుడే చెప్పినట్టు ‘మన కథ’గా మనం ఫీల్ కాము. మనలో ఎలాంటి భావోద్వేగాలూ కలగవు. పెళ్లి మీద వేసే జోకుల్ని సీరియస్ గా కథగా మలిచినట్టే వుంటుంది. తప్పితే రియాల్టీ ని ఇష్టపడే వర్మ లివింగ్ రిలేషన్ లో కాని, మ్యారేజ్  రిలేషన్ లో కాని ప్రభావితం చేసే అంశాలను కథలో యిముడ్చుకోలేకపోయారు. అనురాగం, అభిమానం లేకుండా దాంపత్యాన్ని నిలబెట్టలేం. ఎవరి వృత్తుల్లో ఉద్యోగాల్లో వాళ్ళు వున్నా- విడిచి వుండలేనితనం వుంటుంది. తల్లిని వదల్లెనట్టే భార్యనీ. తండ్రిని వదల్లేనట్టే భర్తనీ. సెన్సిటివిటీ చెపితే అందదు. మాటకు లొంగదు. జీవితంలో ప్రతి ఫలించాలి. ప్రతి రూపమైన సినిమాలో కూడా! అదే జరిగివుంటే వర్మ తన వెనకటి రోజుల్ని గుర్తు చేయడమే కాదు. ఒక గొప్ప సినిమాని అందించి ఉండేవాడు!

కొసర: చిన్న సినిమాకు పాటలెక్కువ!