గవర్నర్‌ రోశయ్యతో జ‌య భేటీ-సీఎంగా రేపే ప్ర‌మాణం

తమిళనాడు గవర్నర్‌ రోశయ్యను జయలలిత శుక్రవారం మధ్యాహ్నం కలుసుకున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత గవర్నర్‌ ఆహ్వానం మేరకు ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లారు. 8 నెలల తర్వాత ఆమె ప్రజల మధ్యకు వచ్చారు. దారి పొడవునా జయకు జనాలు నీరాజనం పట్టారు. శనివారం ఆమె ఐదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆరు నూరైనా తాను అనుకున్నది జరిగిపోవాలన్నది జయలలిత నైజం. ఆమె అనుకున్న‌ట్టే మ‌ళ్ళీ సీఎం పీఠాన్ని అధిష్టిస్తున్నారు. ఇందుకు మార్గం సుగ‌మం చేస్తూ తమిళనాడు సీఎం పన్నీర్‌ సెల్వం రాజీనామా చేశారు. దాన్ని వెంట‌నే గవర్నర్‌ రోశయ్య ఆమోదించారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జయలలితకు గవర్నర్‌ రోశయ్య ఆహ్వానం పంపారు. వీలైనంత త్వరగా కొత్తగా నియమించే మంత్రుల పేర్ల జాబితాను ప్రకటించాలని జయను కోరారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డానికి ముందు అన్నాడిఎంకే ప్రధాన కార్యాలయంలో సమావేశం అయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు జయలలితను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ విషయాన్ని ప్రకటించిన సీఎం పన్నీర్‌ సెల్వం ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామాను సమర్పించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా తేలిన తర్వాత జయకు మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు సులువు అయ్యాయి.