తమిళనాడు సీఎంగా జ‌య ప్ర‌మాణం

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత శనివారం ఉదయం 11 గంటలకు తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం సెంటెనరీ హాలులో తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. జయలలిత ప్రమాణస్వీకారం చేస్తున్నంతసేపూ అభిమానులు, అన్నా డిఎంకె కార్యకర్తలు కేరింతలు కొడుతూనే ఉన్నారు. కొందరు సంతోషంతో ఈలలు వేస్తూ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ హీరోలు రజనీకాంత్‌, శరత్‌కుమార్‌ కూడా హాజరయ్యారు. జయ ప్రమాణ స్వీకారం తర్వాత ఇంకా 29 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్‌ రోశయ్య ఆమెకు పుష్ప‌గుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఐదోసారి. ఆమె అభిమానులు శనివారం ఉదయం నుంచే రోడ్లపై సందడి చేశారు. చెన్నై రహదారులన్నీ జయ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ప్రమాణస్వీకారానికి పదిహేను నిమిషాల ముందు జయలలిత తమ ఇంటి నుంచి బయలుదేరడంతో అభిమానులు చెన్నై రోడ్లకు ఇరువైపులా ఆమెకు బ్రహ్మరథం పట్టారు. కొందరు ఆమెపై పూల వర్షం కురిపించారు. అభిమానులకు నమస్కారం చేస్తూ జయ చిరునవ్వుతో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు.