మోసగాళ్ళకు మోసగాడు రివ్యూ

రేటింగ్: 2.75/5

పాత సినిమా పాటను కొత్త సినిమాల్లో కొత్త పాటగా చూపించడం వారసుల వ్యాపార సూత్రం. పాత సినిమా పేరుమీదే కొత్త సినిమా విడుదల చేయడం వారసుల వ్యాపార రహస్యం. హీరో కృష్ణ కుటుంబానికి చెందినవాడు కాబట్టి ‘మోసగాళ్ళకు మోసగాడు’ పేరు పెట్టడం వారసుల వ్యాపార ఉపయోగం. విజయవంతమైంది కాబట్టి ‘ఫ్రం ది మేకర్స్ అఫ్ స్వామి రారా’ అంటూ సీక్వెల్ యేమో అనేలా ప్రచారం చేయడం వ్యాపార ఆకర్షణ. నిజానికి రీమిక్స్ సాంగ్ తో అసలు సాంగ్ కు సంబంధం లేనట్టే ‘స్వామి రారా’ కు ‘మోసగాళ్ళకు మోసగాడు’కు సంబంధం లేదు. పాటలో పల్లవి ఒకటేఅయినట్టు – రెండింటా విగ్రహాల చోరీయే కథాంశం. చరణాలు మారినట్టు కథనం మారింది. రీమిక్స్ ని ఎంజాయ్ చేసినట్టే ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారనేమో?!

చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ వీలయితే పెద్ద మోసమే చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకొని మోసగాళ్ళని మోసం చేసే క్రిష్ అని పిలవబడే కృష్ణ (సుదీర్ బాబు), గ్రంధాలయంలో లైబ్రేరియన్ గా చిన్న వుద్యోగం చేస్తూ తన పెళ్ళికి తానే ప్లాన్ చేసుకొని పాట్లు పడుతూ జానకి (నందిని రాయ్). జానకిని చూడగానే మనసుపారేసుకున్న క్రిష్. సరే నువ్వు చేసినవన్నీ మానేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంది జానకి. ఒకవైపు అప్పులవాళ్ళు క్రిష్ ని వెంటాడుతూ వుంటారు. అదే సమయంలో మాస్టారు (చంద్రమోహన్) ‘శ్రీరామవిద్యాలయం’ అనాధల కోసం నడుపుతూ బ్యాంకుల నుండి అవస్తలు పడుతూవుంటాడు. ‘చెడు చేసేవాడు ఆలోచించాలి.. మంచి చేసేవాడు చేసుకుంటూపోవాలి ‘ అంటూ క్రిష్ ని తిడుతూ వుంటాడు. ఇదేసమయంలో-

అయోధ్యకు 12కిమీ దూరంలో సరయూనది ఒడ్డున 160 సంవత్సరాలుగా ఉత్సవాల్ని అందుకుంటున్న సీతారాముల విగ్రహాలు మాయమవుతాయి. 12వ శతాభ్దానికి చెందిన ఆ విగ్రహాల కోసం పోలీసులు గాలిస్తూ ఆపని చేసిన వాళ్ళ వెంట నీడలా పడుతుంటారు. విగ్రహం లక్నో నుండి హైదరాబాద్ కు వస్తుంది. స్మగ్లర్ రుద్ర (అభిమన్యు సింగ్) ముందే 25 కోట్లకు విగ్రహాన్ని అమ్మడానికి డీల్ కుదుర్చుకుంటాడు. అయితే ఇంతపెద్ద స్మగ్లరూ ఒకచిన్న స్మగుల్డ్ వ్యాపారి కౌశిక్ (జయప్రకాశ్ రెడ్డి)కి విగ్రహాన్ని రిసీవ్ చేసుకోనేపని అప్పగిస్తాడు. ఆపనిలోకి క్రిష్ నియమించగా వస్తాడు. పోలీసులు ఒకవేపు.. స్మగ్లర్లు ఒకవేపు.. ప్రేమించిన అమ్మాయి ఒకవేపు.. ఇలాంటి పద్మవ్యూహాన్ని ఎలా చేధించాడు? మాస్టారికి ఎలా సాయపడ్డాడు? అమ్మాయి మనసు ఎలాగెలిచాడు? రామున్ని ఎలా తిరిగి అయోధ్య చేర్చాడు? వీటన్నిటికన్నా ముఖ్యంగా చెడ్డతోనే మంచివాడి మంచిపనిని ఎలా నిలబెట్టాడన్నదే మిగతా కథ!

లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం నెల్లూరి బోస్. తొలి ప్రయత్నంలోఫరవాలేదనిపించాడు. మాటలు ప్రసాదవర్మ. సహజంగా వున్నాయి. పోలీస్ ఆఫీసర్ గా నటించిన పంకజ్ కేసరి వేగం బావుంది. ఫిష్ వెంకట్, దువ్వాసిమోహన్, జయప్రకాశ్ రెడ్డి ఎంటర్ టైన్ మెంట్ కు బలమిచ్చారు. హీరోయిన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరో ఓకే.