Telugu Global
Family

జ్ఞాపకాలు (Devotional)

మనం బలంగా, దృఢంగా ఉండాలని కఠిన క్రమశిక్షణకులోను కావడమన్నది మనలోని బలహీనత. ఉల్లాసంగా, మృదువుగా ఉండడం తెలుసుకుంటే మనలోని బలాన్ని, దృఢత్వాన్ని చూడగలం.             మనం ప్రతిదానితో సామరస్యంగా ఉండగలిగితే, ముఖ్యంగా మనలో మనం సామరస్యంగా ఉండగలిగితే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం.             ఒక గౌరవనీయ కుటుంబానికి చెందిన వ్యక్తి తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు. ఎప్పుడూ ఒక కుర్చీలో కూచుని ఉండేవాడు. అటూ ఇటూ కూడా కదల్లేక పోయేవాడు. కొద్దిగా అన్నం తినడానిక్కూడా చాలా […]

మనం బలంగా, దృఢంగా ఉండాలని కఠిన క్రమశిక్షణకులోను కావడమన్నది మనలోని బలహీనత. ఉల్లాసంగా, మృదువుగా ఉండడం తెలుసుకుంటే మనలోని బలాన్ని, దృఢత్వాన్ని చూడగలం.

మనం ప్రతిదానితో సామరస్యంగా ఉండగలిగితే, ముఖ్యంగా మనలో మనం సామరస్యంగా ఉండగలిగితే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలం.

ఒక గౌరవనీయ కుటుంబానికి చెందిన వ్యక్తి తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు. ఎప్పుడూ ఒక కుర్చీలో కూచుని ఉండేవాడు. అటూ ఇటూ కూడా కదల్లేక పోయేవాడు. కొద్దిగా అన్నం తినడానిక్కూడా చాలా ఇబ్బంది పడేవాడు. తనెవరో తనకి తెలిసేది కాదు. ఎవర్నీ గుర్తు పట్టేవాడు కాదు. ఎంతమంది వైద్యులు చికిత్స చేసినా లాభం లేకపోయింది.

అప్పుడు ఒక కన్‌ఫ్యూషియస్‌ మేథావి జబ్బు పడ్డ ఆ వృద్ధుడి బట్టలు విప్పి వాటిని దాచి పెట్టేశాడు. అప్పుడా వృద్ధుడి కళ్ళు కనిపించని బట్టలకోసం వెతికాయి. మేథావి వృద్ధుడికి తిండి పెట్టడం మానేశాడు. ఆకలితో వృద్ధుడు తిండికోసం చూశాడు. చివరికి చీకట్లో ఒంటరిగా వదిలేస్తే వృద్ధుడు కాంతికోసం అల్లాడాడు.

చివరికి మేథావి వారం రోజులు రహస్యంగా రోగితో బాటు ఉన్నాడు. ఆ వారం గడిచాకా వృద్ధుడి జబ్బు నయమైంది. అన్ని విషయాల్లో మామూలు మనిషయ్యాడు.

అయితే అంతకు ముందు లేని కోపం, ఆవేశం అతనిలో కనిపించాయి. ఫలితాలు తీవ్రంగా ఉన్నాయి. వృద్ధుడు భార్యని, కొడుకుల్ని కర్ర తీసుకుని బాదాడు. మేథావిని తరిమి కొట్టాడు.

ఇదంతా తెలిసి ఆ ఊరి న్యాయాధికారి వృద్ధుణ్ణి న్యాయస్థానానికి పిలిపించాడు.

“ఏమిటిదంతా? ఏమైంది?” అన్నాడు.

అప్పుడు వృద్ధుడు “నాకు ఏది గుర్తులేనప్పుడు, నాకు జ్ఞాపకశక్తి లేనప్పుడు నేనెంత సంతోషంగా ఉండేవాణ్ణి! నాకు ఏదీ గుర్తొచ్చేది కాదు. కాబట్టి నాకు బాధలుండేవి కావు, ప్రశాంతంగా నిద్రపోయేవాణ్ణి. దిగులు పడేవాణ్ణి కాను. ఇప్పుడన్నీ గుర్తొస్తున్నాయి. అదృష్టాలు, దురదృష్టాలు, ఆనందాలు, విషాదాలు నా జీవితంలోని అనుభవాలన్నీ నా మనసును కమ్ముకున్నాయి. ఫలితంగా ఉద్రేకం పెరిగి నిరాశపాలయ్యాను” అన్నాడు.

మనకు ఎప్పుడు నెమ్మది కలుగుతుందంటే, మనమెప్పుడు నిర్మలంగా ఉంటామంటే ఒక విస్మృతి నించీ ఇంకో విస్మృతిలోకి ప్రయాణించినపుడు, ఒక మరుపు నించి ఇంకో మరుపులోకి వెళ్ళినపుడు మాత్రమే! భౌతిక ప్రపంచ పరిధుల్ని అధిగమించినపుడు, అన్ని వేళలా ఈ ప్రాపంచిక స్పృహని విస్మరించినపుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి.

– సౌభాగ్య

First Published:  23 May 2015 1:01 PM GMT
Next Story