Telugu Global
Family

అంబిక-అంబాలిక (For children)

అంబ-అంబిక-అంబాలిక- వీరు ముగ్గురూ అక్కా చెల్లెళ్ళు. అంబ తోడపుట్టిన వాళ్ళే అంబిక-అంబాలికలు. కాశీరాజు కూతుళ్ళు. పెళ్ళివయసు రావడంతో కాశీరాజు స్వయం వరం ప్రకటించాడు. అందాల అక్క చెల్లెళ్ళను సొంతం చేసుకోవడానికి యువరాజులెందరో పోటీ పడ్డారు. కాని బ్రహ్మచారి భీష్ముడే స్వయంగా వచ్చి అక్క చెల్లెళ్ళను బలవంతంగా ఎత్తుకు వెళ్ళాడు. అడ్డొచ్చిన వాళ్ళని అపజయం పాలు చేసాడు.             అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో – అంబిక, అంబాలికలు ఇద్దర్నీ విచిత్ర వీర్యునికిచ్చి భీష్ముడే హస్తినాపురంలో అంగరంగ వైభవంగా […]

అంబ-అంబిక-అంబాలిక- వీరు ముగ్గురూ అక్కా చెల్లెళ్ళు. అంబ తోడపుట్టిన వాళ్ళే అంబిక-అంబాలికలు. కాశీరాజు కూతుళ్ళు. పెళ్ళివయసు రావడంతో కాశీరాజు స్వయం వరం ప్రకటించాడు. అందాల అక్క చెల్లెళ్ళను సొంతం చేసుకోవడానికి యువరాజులెందరో పోటీ పడ్డారు. కాని బ్రహ్మచారి భీష్ముడే స్వయంగా వచ్చి అక్క చెల్లెళ్ళను బలవంతంగా ఎత్తుకు వెళ్ళాడు. అడ్డొచ్చిన వాళ్ళని అపజయం పాలు చేసాడు.

అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో – అంబిక, అంబాలికలు ఇద్దర్నీ విచిత్ర వీర్యునికిచ్చి భీష్ముడే హస్తినాపురంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. విచిత్ర వీర్యుడు ఎవరోకాదు, భీష్ముని పిన తల్లి కొడుకు. ఎప్పుడూ భోగ కేళీ విలాసాల్లో మునుగుతూ ఉండడం వల్ల రాజ్య సంరక్షణతో పాటు పెళ్ళివరకూ భీష్ముడే అన్ని బాధ్యతలూ చూసాడు.

విచిత్ర వీర్యునికి క్షయరోగం వచ్చింది. అతను చనిపోవడంతో అంబిక అంబాలికల పరిస్థితి అగమ్యగోచరమైంది. చూస్తే సంతానం లేదు. వంశం వృద్ధి చెందకుండా పోతుందని విచిత్ర వీర్యుని తల్లి సత్యవతి దుఃఖపడింది. అంబిక, అంబాలికలు యవ్వనంలో ఉన్నారని, తమ్ముడి భార్యల్ని పొందమని, సంతానాన్ని కలిగించమని భీష్ముణ్ని కోరింది. భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేసాడు. క్షమించమని కోరాడు. అప్పుడు భీష్ముడి అనుమతితో వ్యాసుణ్ని తలచుకుంది. ప్రత్యక్షమైన వ్యాసుణ్ని వంశాన్ని నిలబెట్టమని కోరింది. వ్యాసుడు ఒప్పుకున్నాడు.

మొదట అంబికను వ్యాసుని దగ్గరకు పంపించారు. వ్యాసుని రూపమూ మేనిఛాయ వేళ్ళాడే గడ్డం చూసి ఇంక చూడలేనట్టుగా కళ్ళను మూసుకుంది. అందుకే అంబికకు ధృతరాష్ట్రుడు పుట్టినా పుట్టు గుడ్డివాడయినాడు.

తరువాత అంబాలికను వ్యాసుని దగ్గరకు పంపించారు. వ్యాసుని చూడడంతోనే అంబాలిక భయంతో తెల్లబోయింది. అందుకే అంబాలికకు తెల్లని (పాండు వర్ణం – పాలిపోయిన రంగు) పాండు జబ్బుతో పాండురాజు పుట్టాడు.

ధృతరాష్ట్రుడూ పాండురాజులకు జన్మనిచ్చిన అంబిక, అంబాలికలు ఇద్దరూ శాపానికి గురయ్యారు కూడా. ఆ శాప ఫలితమే ధృతరాష్ట్ర సంతానానికి పాండు రాజు సంతానానికి వైరం! చాలక ధృతరాష్ట్రుని వందమంది కొడుకులు పుట్టినా వారు వంశాన్ని నాశనం చేస్తారని కూడా వ్యాసుడు శపించాడు.

కౌరవ పాండవ యుద్ధానికి కారణం వారి వారి తండ్రుల పుట్టుకలలోనే ఉంది. అంటే అంబిక, అంబాలికల కారణంగానే అది జరిగింది. అది తెలిసి చేసిన తప్పు కాదు!

చివరకు అత్త సత్యవతితో కలసి అంబిక, అంబాలికలు ఇద్దరూ అడవులకు వెళ్ళి తపస్సు చేసుకున్నారు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  23 May 2015 1:02 PM GMT
Next Story