అమీర్ పై బెంగపెట్టుకున్న కుటుంబం

పీకే సినిమాలో సన్నగా, నాజూగ్గా కనిపించాడు అమీర్ ఖాన్. ఆ క్యారెక్టర్ కి అది కరెక్ట్. కానీ తాజా చిత్రంలో మాత్రం మల్లయోధుడిగా కనిపించాలి. అందుకే అమాంతం బరువు పెరిగిపోయాడు అమీర్ ఖాన్. ప్రస్తుతం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ బరువు అక్షరాలా 95 కిలోలు. అమీర్ ను ఇంత లావుగా చూసి అతడి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా అమీర్ భార్య కిరణ్ రావుకైతే ఏడుపు ఒక్కటే తక్కువ. అంత బరువుతో ఆరోగ్య సమస్యలు వస్తాయని కుటుంబ వైద్యులు హెచ్చరించినప్పటికీ అమీర్ వినలేదు. 95కిలోల బరువు పెరిగాడు.

ప్రస్తుతం షూ లేసులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అమీర్ ఖాన్. ఈ ఏడాది చివరి వరకు ఇదే బరువుతో ఉంటానని స్పష్టంచేశాడు అమీర్ ఖాన్. ఆ తర్వాత క్రమంగా బరువు తగ్గుతానని ప్రకటించాడు. ఇలా ఆరోగ్యంతో ఆటలాడుకోవడం కరెక్ట్ కాదని అమీర్ కుటుంబ సభ్యుల్ని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అధికంగా బరువు పెరిగి, తగ్గే క్రమంలో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువని చెబుతున్నారు. కానీ అమీర్ మాత్రం తన సినిమా కోసం లైఫ్ ను రిస్క్ లో పెట్టడానికే సిద్ధమయ్యాడు.