ఏపీకి ప్ర‌త్యేక హోదా ప‌క్క‌న పెట్ట‌లేదు: అమిత్ షా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో న‌రేంద్ర మోడి నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేద‌ని, దీనిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలిపారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుతో చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీల‌న్నీ కేంద్రం ప‌రిష్క‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన మంత్రి మోడి యేడాది పాల‌న‌పై ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌లు ఎక్క‌డ క‌ష్టాల్లో ఉంటే కేంద్ర ప్ర‌భుత్వం అక్క‌డ వాలిపోయింద‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసింద‌ని అమిత్ షా అన్నారు. నేపాల్‌లో భూకంప బాధితుల‌ను ఆదుకునేందుకు, కాశ్మీర్‌లో వ‌ర‌ద బాధితుల‌కు చేయూత అందించేందుకు, హుద్‌హుద్ తుఫాను స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దెబ్బ‌తిన్న‌ప్పుడు మోడీ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌నం చేసింద‌ని ఆయ‌న అన్నారు. కేంద్రం ప్ర‌భుత్వం ఈ యేడాదిలో చేసిన ప‌నుల్నీ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ప్ర‌తిష్ట పెంచాయ‌ని, ఒక్క అవినీతి ఆరోప‌ణ కూడా లేకుండా పాల‌న సాగించిన ఘ‌న‌త ప్ర‌ధాన‌మంత్రి మోడికి ద‌క్కించ‌ని ఆయ‌న అన్నారు. 60 సంవ‌త్స‌రాల్లో కాంగ్రెస్ పార్టీ చేయ‌లేక‌పోయిన ప‌నులెన్నో త‌మ పార్టీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే చేసింద‌ని… న‌ల్ల‌ద‌నంపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని వేసింద‌ని, విదేశాల్లో ఉన్న న‌ల్ల‌ద‌నం వెన‌క్కి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని అమిత్ షా తెలిపారు.