బాబు,  కె.ఇ.ల ‘అభివృద్ధి’ నాటకం ?

చంద్రబాబునాయుడు కెఇ కృష్ణమూర్తిల మధ్య విభేదాలు తలెత్తాయా? ఇది నమ్మశక్యంగా కనిపించడంలేదుకదా ? అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో విభేదించి దూరంపెంచుకుని తన పలుకుబడిని పార్టీలో, ప్రభుత్వంలో తగ్గించుకునేందుకు ఉపముఖ్యమంత్రి కెఇ సిద్ధంగా ఉన్నారా? అసలే  జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అధికారపార్టీలకు ప్రత్యామ్నాయాలు ఇప్పట్లో కనిపించని పరిస్థితుల్లో ఆయన చంద్రబాబుకు దూరమయ్యే విధంగా రాజకీయాలను సాగించేందుకు సిద్ధమవుతున్నారా? మరెందుకు ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నట్లు ప్రచారం, ప్రసారం సాగుతోంది ? కెఇ ది అసలు అసంతృప్తా లేక అసమ్మతా ? శనివారం (మే23న) ఇద్దరు చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఒకే విధంగా కనిపిస్తోంది. అంతర్లీనంగా పరిశీలిస్తే వారిద్దరి ధోరణి ఒకే విధంగా ఉందని పార్టీలోని ముఖ్యనాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కెఇ కృష్ణమూర్తి ఏమేమి చెప్పారో ఒకసారి పరిశీలిద్దాం…. 

          ”చంద్రబాబు దృష్టంతా పశ్చిమగోదావరిపైనే ఉంది. కర్నూలుపై అసలులేదు. పగో జిల్లా 16 సీట్లు ఇచ్చింది. కర్నూలులో మూడే సీట్లు టిడిపికి వచ్చాయి. మిగతా 11 ఏమయ్యాయి? అని ముఖ్యమంత్రిని కలిసినప్పుడల్లా నన్ను ప్రశ్నిస్తున్నారు. పగో జిల్లా అభివృద్ధిపై సిఎంకు ఉన్నంత శ్రద్ధ కర్నూలు జిల్లాపై లేదు…. పార్టీ లాభపడాలంటే వైసిపిని అణగదొక్కాలి. అందుకు పోలీసు యంత్రాంగాన్ని, అధికారులను ఉపయోగించుకోవాలి. ఇందుకు ఇంచార్జి మంత్రి అచ్చన్నాయుడే మార్గం చూపించాలి” అని కెఇ శనివారం నాడు కర్నూలులో పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. 

        దీనిపై సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు స్పందిస్తూ ….”చేసిన పనులను అర్థంచేసుకోవాలి. తాను కర్నూలుకు ఎంతో చేశాను. దీనిని ప్రతిపక్షంవారైనా కాదనగలరా? పట్టిసీమను పూర్తిచేసి రాయలసీమకు నీరు అందిస్తాం. ఉభయగోదావరి జిల్లాలవల్లనే అధికారంలోకి వచ్చాం. ఆ రెండు జిల్లాలను అభివృద్ధి చేయటం మర్యాద. అప్పుడే మాకు ఓటువేయని వారికి కనువిప్పుకలుగుతుంది”. 

        అసలు మొత్తంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చెప్పింది ఒక్కటే…. ఓట్లు వేసిన వారికే అభివృద్ధి. ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే ఓట్లు వేయించినవారికే అనుకోవాలి. అంటే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే ప్రభుత్వ ఫలాలు దక్కుతాయి. చంద్రబాబు అదే చెప్పారు నేరుగా. టిడిపికి ఓట్లు వేసిన ప్రజలకే తాము పనులు చేస్తామని చంద్రబాబు మాటల్లోని సారంశం. బేషజాలు లేకుండా వెనుకాముందూ ఆలోచించకుండా ఆయన నేరుగా ఆ విషయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

          కెఇ కృష్ణమూర్తి కూడా దాదాపు అదే విషయం చెప్పారు. అదనంగా ఈయన చెప్పింది మాత్రం కర్నూలును నిర్లక్ష్యం చేస్తున్నారని, వైసిపిని అణగదొక్కాలనీను. వాస్తవానికి దీని ఉద్దేశ్యం జిల్లా అభివృద్ధి గురించికాదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అధికారంలోకి వచ్చి ఏడాది కాలమైనా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా జిల్లాలో ఆయన మాట చెల్లుబాటు కావటంలేదు. మిగిలిన జిల్లాల మాదిరిగా కాకుండా ఈ జిల్లాలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లు కెఇ మాట వినటంలేదు. దీనికి తోడు పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంలో ఈయన మాటకు బాబు విలువ ఇవ్వలేదు. సోమిశెట్టిని కాదని చక్రపాణిరెడ్డికి పార్టీ అధ్యక్ష పదవితోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ప్రకటించారు. ఈ పరిణామాలు కెఇకి ఏమాత్రం మింగుడు పడటం లేదు. దాంతో ఆయన శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ విధంగా మాట్లాడి అసంతృప్తిని వెళ్ళగక్కారు. 

        ఇక్కడ ముఖ్య విషయమేమిటంటే ఈ ప్రభుత్వం వచ్చాక పశ్చిమగోదావరి జిల్లాకు కొత్తగా చేసింది ఏమీ లేదు, కర్నూలు జిల్లాకు ఒరగబెట్టిందీ లేదు. పదేళ్ళు అధికారానికి దూరంగా ఉండి 2014లో చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రాధాన్యతల్లో మార్పురాలేదు. ‘మేం అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లాలు కారణం. అందుకే  ఆ జిల్లాలకు చేస్తున్నాం’ అని ప్రకటించారు. కాని చేసిందేమీలేదు…..  నిజంగానే గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాల పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పోలవరం (ఇందిరాసాగర్‌) పనులను వేగవంతం చేసేవారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. దాని వల్ల మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పనులపై నీళ్లు చల్లుతున్నాయి. నిధుల కేటాయింపు దారుణంగా తగ్గిపోయింది. పట్టిసీమ జరుగుతున్న వేగంలో వందో వంతు వేగం కూడా పోలవరంలో కనిపించడం లేదు.  పోలవరం ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా 16 వేల కోట్లు వ్యయంతో చేపట్టగా, అందులో 8,900 కోట్ల విలువైన పనులను గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే చేపట్టింది. గత ఏడాది చివరి నాటికి 4,900 కోట్లు వ్యయం చేయగా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, ఖర్చు తగ్గించేశారు. కాంగ్రెస్‌ 2013-14 సంవత్సరంలో 458 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది ప్రభుత్వం కేవలం 100 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది. 

        అలాగే గోదావరి, కృష్ణా డెల్టాల ఆధునీకరణకు గత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగా చేపట్టిన ఆధునీకరణ పనులను తెలుగుదేశం ప్రభుత్వం నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ పనులను పరిశీలన పేరుతో కమిటీని నియమిస్తూ 2014 నవంబర్‌ 14న, డిసెంబర్‌ 16న ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఆధునీకరణ పనులన్నీ నిలిచిపోయాయి. ఈ పనులను రైతుల అవసరాలు డెల్టా వ్యవస్థ అభివృద్ధికి తగిన విధంగా కొనసాగించాల్సి ఉండగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపాదించిన విధంగా పనులను చేపట్టాలంటూ ఈ ఏడాది జనవరి 19న ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా కూడా డెల్టాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. గోదావరి, కృష్ణా డెల్టాల ఆధునీకరణ పనులను గతంలో అప్పటి ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలతో చేపట్టి దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు చేసింది. ఈ పనులను బాబు ప్రభుత్వం నిలిపివేసి నామమాత్రంగా 2015-16 బడ్జెట్‌లో 142 కోట్లు కేటాయించింది.

          ఇక కర్నూలు జిల్లాకు ఒరగబెట్టింది కూడా శూన్యమే. పరిస్థితి ఇలా ఉంటే గోదావరి జిల్లాలకు సిఎం ఎంతో చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, కర్నూలుకు కూడా ఎంతగానో చేశానని సిఎం చెప్పటం ప్రజల్ని ‘ప్రగతి ప్రభుత్వం’గా ఎక్కడికో తీసుకుపోతున్నట్లు విస్మయం కలిగిస్తోంది. 

          కర్నూలు జిల్లాలో మూడు శాసనసభా స్థానాల్లో టిడిపి గెలుపొందింది. మిగిలిన 11 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. అందువల్ల తాము అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ఉటంకిస్తూ పరోక్షంగా ఆయన ప్రకటించారు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఆతర్వాత అభివృద్ధి కీలకం అంటూ పదేపదే చెబుతూవచ్చే ముఖ్యమంత్రి ఈసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారు అందరినీ సమానంగా చూసుకోవాలని రాజ్యాంగం చెబుతోంది. కాని తమ పాలనలో అది సాధ్యంకాదని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేరుగానే చెప్పేశారు. పాలకొల్లులో ఏలూరు ఎంపి మాగంటి బాబు మాట్లాడినా, కర్నూలు జిల్లాలో ఇంచార్జి మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడినా చెబుతున్నది కేవలం ఈ సారి కార్యకర్తల కోసమే ప్రభుత్వ యంత్రాంగం  పనిచేయాలి. మే 22, 23  తేదీల్లో చంద్రబాబు కలెక్టర్లకు ఇదే విషయం స్పష్టం చేశారని తెలిసింది. ముఖ్యమత్రి అయ్యాక విజయవాడలో జిల్లాకలెక్టర్లతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా కార్యకర్తల కోసమే పనిచేయాలని హితబోధ చేయటం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఇందుకోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ ఓ కథ నడిపించినట్లు కనిపించటంలేదూ ! 

        వాస్తవానికి విధానపరంగా కెఇ బాబుల మధ్య వ్యత్యాసం లేదు. సారూప్యతే ఉంది. గతంలో ఎప్పుడూ కూడా కర్నూలు జిల్లా అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేసిందీలేదు. అభివృద్ధి విధానాలతో ఆయన ముందుకు వెళ్ళింది అసలేలేదు. ఆ మాటకు వస్తే ఒకప్పుడు ఫ్యాక్షన్‌లకు నిలయంగా ఉన్న కర్నూలు జిల్లాలో ఇప్పటికీ ఆ వాసనలు ఉన్నప్పటికీ ఏ పార్టీ నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడిచేసిన దాఖలాలులేవు. కమ్యూనిస్టులు మినహాయిస్తే. అటువంటి పరిస్థితుల్లో జిల్లా అభివృద్ధి గురించి కెఇ చంద్రబాబుతో విభేదిస్తున్నారంటే పార్టీ నాయకులు నొసలు చిట్లిస్తున్నారు. రాయలసీమ నాయకులు ఆ ప్రాంత అభివృద్ధి గురించి స్పందించే పరిస్థితి ఉంటే ఈ ప్రాంతంలో శతాబ్దాలుగా కరవు విలయతాండవం చేసేదికాదు. ఏతావాతా ఇద్దరూ చెప్పింది పార్టీ క్యార్తలు, పార్టీకి ఓట్లు వేసినవారే ముఖ్యమని. అంతకుమించి వారి మధ్య విభేదాలు ఏమీ లేవు.