పొద్దున్న గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు… సాయంత్రానికి స‌యోధ్య‌

ఎంసెంట్ కౌన్సిలింగ్‌పై గంటా-క‌డియం చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం
ఎంసెట్ కౌన్సిలింగ్ అంశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య పొడ‌సూపిన అభిప్రాయ భేదాలు ఎట్ట‌కేల‌కు ఓ కొలిక్కి వ‌చ్చాయి. గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌తో ఉభ‌య రాష్ట్రాల మంత్రులు ఓ చొట కూర్చుని స‌మ‌స్య‌కు చెక్ పెట్టారు. ఉన్న‌త విద్యామండ‌లి తెలంగాణ‌కే ఉంటుంద‌ని హైకోర్టు ఆదేశించ‌డంతో తెలంగాణ స‌ర్కారు స‌ద‌రు కార్యాల‌యంలో ఉన్న ఫైళ్ళ‌న్నీ మూట క‌ట్టి బీరువాలో పెట్టేసుకుంది. దీంతో ఎంసెట్‌కు సంబంధించిన వివ‌రాలు తెలియ‌క‌ ఏపీ ప్ర‌భుత్వ అధికారులు ఇబ్బందులు ప‌డ్డారు. ఫ‌లితంగా ఈ స‌మ‌స్య మంగ‌ళ‌వారం ఉద‌యం గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు చేరింది.  తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సహకరించాలని, రికార్డులు, సిబ్బందిని కేటాయించాలని టీఎస్‌ ప్రభుత్వాన్ని కోరినట్టు గంటా శ్రీనివాస్‌ తెలిపారు. దీనిపై కడియం సానుకూలంగా స్పందించారన్నారు. దీనిలో స‌మ‌స్య ఏముంది. మీరిద్ద‌రూ  కూర్చుని మాట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోండి అంటూ గ‌వ‌ర్న‌ర్ సూచించారు. దాంతో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఇరువురు మంత్రులు రెండు రాష్ట్రాల అధికారుల స‌మ‌క్షంలో స‌మావేశ‌మ‌య్యారు. ఇది ముగిసిన త‌ర్వాత మంత్రి క‌డియం మాట్లాడుతూ పంతాల‌కు పోకుండా సుహృద్భావ వాతావ‌ర‌ణంలో తాము మాట్లాడుకున్నామ‌ని  తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ ఆదేశం మేర‌కే త‌మ స‌మావేశం జ‌రిగింద‌ని, ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి ఫైళ్ళు ఇవ్వ‌డానికి తాము అంగీక‌రించామని, ఇరు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున పాల్గొని ఫైళ్ళ‌ను విభ‌జించి ఎవ‌రి ఫైళ్ళు వారు తీసుకుంటార‌ని క‌డియం తెలిపారు. ఎపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం స్థ‌లం కావాల‌ని మంత్రి గంటా కోరార‌ని, ప్ర‌భుత్వం నుంచి విన‌తిప‌త్రం ఇస్తే ప‌రిశీలిస్తామ‌ని తాము చెప్పామ‌ని క‌డియం చెప్పారు. ఎన్‌ఐసీ విష‌యంలో బేధాభిప్రాయాలు లేవ‌ని అన్నారు. విద్యార్థులు న‌ష్ట‌పోకుండా ఉండాల‌న్న ఉద్దేశ్యంతోనే స‌మ‌స్య‌ల‌ను సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో ప‌రిష్క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించామ‌ని అన్నారు.