హుస్సేన్‌సాగర్‌పై కేసీఆర్‌ సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు

హుస్సేన్ సాగర్ పరిశుభ్రత అంటూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హుస్సేన్‌సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైదరాబాద్ నగరంలోని ఈ సరస్సు ప్రక్షాళన కార్యకలాపాలు కేవలం నాలాల మరమ్మతులకే పరిమితం కావాలి తప్ప ఇతర చర్యలేవీ చేపట్టవద్దని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నాలాల మరమ్మతులకు అవసరమైన నీటిని మాత్రమే విడుదల చేయాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అఫిడవిట్‌ సమర్పించింది. హుస్సేన్‌సాగర్‌ను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ “సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌” అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్‌ను ఖాళీ చేసే క్రమంలో అందులోని కలుషిత జలాలను బయటకు విడుదల చేసేటప్పుడు సంబంధిత నాలాల పరిసరాల్లో నివసించే ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని “సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌” వాదన. కలుషిత నీటి విడుదలకు తీసుకోవలసిన కనీస జాగ్రత్తల్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఈ సంస్థ ఆరోపిస్తోంది.