Telugu Global
NEWS

నాది ఇప్ప‌టికీ రెండు క‌ళ్ళ సిద్ధాంత‌మే: బాబు

తెలుగు రాష్ట్రాలు రెండూ త‌న‌కు స‌మాన‌మేన‌ని, త‌న‌ది ఇప్ప‌టికీ రెండు క‌ళ్ళ సిద్ధాంత‌మేన‌ని, అప్పుడు అంద‌రూ ఎగ‌తాళి చేసినా ఇప్పుడు  దానికే ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. మూడు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న మ‌హానాడులో ఆయ‌న పార్టీ అధ్య‌క్షుడిగా ప్రారంభోప‌న్యాసం చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర స‌మితి టార్గెట్ చేసింద‌ని, మ‌న ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొంటుంద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. నాయ‌కుల్ని త‌యారు చేసుకోవ‌డం చేత‌కాని పార్టీలే ఇలా చేస్తాయ‌ని, […]

నాది ఇప్ప‌టికీ రెండు క‌ళ్ళ సిద్ధాంత‌మే: బాబు
X
తెలుగు రాష్ట్రాలు రెండూ త‌న‌కు స‌మాన‌మేన‌ని, త‌న‌ది ఇప్ప‌టికీ రెండు క‌ళ్ళ సిద్ధాంత‌మేన‌ని, అప్పుడు అంద‌రూ ఎగ‌తాళి చేసినా ఇప్పుడు దానికే ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. మూడు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న మ‌హానాడులో ఆయ‌న పార్టీ అధ్య‌క్షుడిగా ప్రారంభోప‌న్యాసం చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర స‌మితి టార్గెట్ చేసింద‌ని, మ‌న ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొంటుంద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. నాయ‌కుల్ని త‌యారు చేసుకోవ‌డం చేత‌కాని పార్టీలే ఇలా చేస్తాయ‌ని, టీడీపీ నుంచి ఒక్క నాయ‌కుడు పోతే వంద‌మందిని త‌యారు చేసుకునే స‌త్తా త‌మ‌కు ఉంద‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌పంచంలో ఏ పార్టీ చేయ‌ని విధంగా స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం చేశామ‌ని ఆయ‌న తెలిపారు. తెలుగు జాతి ఆత్మ గౌర‌వం కాపాడ‌డానికి నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించార‌ని, పేద‌వాళ్ళే త‌మ దేవుళ్ళ‌ని ఆయ‌న న‌మ్మార‌ని, అదే సిద్దాంతంతో త‌మ పార్టీ కొన‌సాగుతోంద‌ని ఆయ‌న అన్నారు. సంస్క‌ర‌ణ‌ల‌కు, సంక్షేమ ప‌థ‌కాల‌కు నాంది ప‌లికిన తెలుగుదేశం పార్టీని తెలుగు ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. సిద్ధాంతాలు, విధానాలు పార్టీ నిర్ణ‌యిస్తుంద‌ని, దాన్ని అమ‌లు చేసే బాధ్య‌త నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు తేవ‌డానికి కార్య‌క‌ర్త‌లంతా ప‌ని చేయాల‌ని, దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పులు తీసుకువ‌చ్చిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీ అయిన‌ప్ప‌టికీ జాతీయ స్థాయి దృక్ఫ‌థంతో ముందుకెళుతున్నామ‌ని చంద్ర‌బాబు అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం తాను చేసిన విదేశీ ప‌ర్య‌ట‌న‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ భ‌విష్య‌త్‌ని దృష్టిలో పెట్టుకునే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్ణ‌యించామ‌ని, దీని నిర్మాణ రూప‌క‌ల్ప‌న బాధ్య‌త సింగ‌పూర్‌కి అప్ప‌గించామ‌ని ఆయ‌న చెప్పారు. తెలుగు జాతి త‌ర‌త‌రాలుగా గ‌ర్వ‌ప‌డే విధంగా రాజ‌ధానిని నిర్మించుకుందామ‌ని పిలుపు ఇచ్చారు. రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల్ని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాన‌ని, వారికి ప‌రిహారం ఇచ్చే విష‌యంలో వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తి లేద‌ని ఆయ‌న అన్నారు.
కాంగ్రెస్ హ‌యాంలో ప్రాజెక్టుల‌న్నీ కాంట్రాక్ట‌ర్ల‌ను ఉద్ద‌రించ‌డానికే చేప‌ట్టార‌ని, అప్పుడు జ‌రిగిన అవినీతిని కూడా బ‌య‌టికి తీస్తామ‌ని, అవినీతిని అంతం చేయ‌డానికి టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నామ‌ని, కాంగ్రెస్ హ‌యాంలో వ్య‌వ‌సాయం భ్ర‌ష్టుప‌ట్టింద‌ని అన్నారు. ప‌దేళ్ళ కాంగ్రెస్ పాల‌న‌లో 24 వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని, ప్ర‌తిప‌క్షంలో ప‌దేళ్ళున్నా జ‌నం కోసం రాజీ లేని పోరాటం చేశామ‌ని చంద్ర‌బాబు అన్నారు. రైతులు గౌర‌వంగా బ‌త‌కాల‌ని, వ్య‌వ‌సాయం లాభ‌సాటి కావాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. వ్య‌వ‌సాయం పెరిగితేనే గ్రామాలు పురోగ‌తి సాధిస్తాయ‌ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ‌మాఫీ చేప‌ట్టామ‌ని, దేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణ మాఫీ ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని, ఇది ప్ర‌పంచ రికార్డ‌ని చంద్ర‌బాబు అన్నారు. బిందు సేద్యం, తుంప‌ర సేద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని, రాష్ట్రంలోని వ్య‌వ‌సాయానికి నీటి కొర‌త రాకుండా చేయ‌డానికి న‌దుల అనుసంధానంతో ముందుకెళ్ళాల‌ని నిర్ణ‌యించామ‌ని, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొల‌గిపోయాయ‌ని, ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప్రాజెక్టుల‌న్నీ పూర్తి చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.
పార్టీ ర‌క్ష‌ణ‌కు ఈ ప‌దేళ్ళ‌లో ఎంతోమంది ఆస్తులు అమ్ముకున్నార‌ని, ఒక విధంగా చెప్పాలంటే పార్టీని కార్య‌క‌ర్త‌లే ర‌క్షించుకున్నార‌ని, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన కార్య‌క‌ర్త‌ల‌ను ర‌క్షించుకోవ‌డం త‌మ క‌ర్త‌వ్యం అని చెబుతూ అందుకే ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల భీమాను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌తిసారీ తెలుగు జాతి న‌ష్ట‌పోయింద‌ని, కాంగ్రెస్ అవినీతిపై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయాల‌ని, ఇంత‌కుముందు కూడా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌డం వ‌ల్లే ఆ పార్టీని సోదిలో కూడా లేకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓట‌ర్లు చేశార‌ని చంద్ర‌బాబు అన్నారు. నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో ఉంటూ సంబంధాల్ని ప‌ట్టిష్టం చేయాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ఇసుక రీచ్‌ల‌ను డ్వాక్రా సంఘాల‌కు ఇచ్చామ‌ని, బెరైటీస్‌లో అవినీతిని నిర్మూలించామ‌ని, స‌ముద్ర తీరాన్ని ఉప‌యోగించుకుంటే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అవినీతి పుట్టుక‌ని, అవినీతితో నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మ‌మేక‌మ‌వ‌డం అంద‌రికీ తెలిసిందేన‌ని అయ‌న అన్నారు. రెడ్ శాండిల్ స్మ‌గ్లింగ్‌లో కాంగ్రెస్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల హ‌స్త‌ముంద‌ని, త‌మ‌కు ఎలాంటి సంబంధం లేన‌ట్టు పోజులు పెడుతున్నార‌ని… ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌తో సంబంధాలు లేక‌పోతే ఎందుకు మాట్లాడ‌ర‌ని ఆయ‌న వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన ఓట‌ర్ల‌కు, పార్టీ నాయ‌కుల‌కు కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గ‌త యేడాది చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌న్నీ స‌మీక్షించుకుని పురోగ‌మిద్దామ‌ని ఆయ‌న పిలువు ఇచ్చారు.
First Published:  27 May 2015 2:56 AM GMT
Next Story