Telugu Global
Others

ఓయూ భూముల వ్య‌వ‌హారం.. టీఆర్ ఎస్ వెనక‌డ‌గు వేస్తుందా?

ఓయూ భూముల వ్య‌వ‌హారంలో తెలంగాణ సీఎం కేసీ ఆర్‌పై ముప్పేట దాడి కొన‌సాగుతోంది. ఈ విష‌యంలో టీఆర్ ఎస్ ఒంట‌రి అయ్యేలా క‌నిపిస్తోంది. తొలుత కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, ఆ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నేత‌లు మాత్ర‌మే ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. క్ర‌మంగా ఇత‌ర రాజ‌కీయ పార్టీలు, విద్యార్థి విభాగాలు, మేధావుల నుంచి కూడా వ్య‌తిరేకత‌ వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యార్థుల నిల‌యాలైన విశ్వ విద్యాల‌యాల భూములు స్వాధీనం చేసుకోవ‌డం మంచి సంప్ర‌దాయం కాద‌ని, కేసీఆర్ త‌న నిర్ణ‌యాన్ని […]

ఓయూ భూముల వ్య‌వ‌హారం.. టీఆర్ ఎస్ వెనక‌డ‌గు వేస్తుందా?
X
ఓయూ భూముల వ్య‌వ‌హారంలో తెలంగాణ సీఎం కేసీ ఆర్‌పై ముప్పేట దాడి కొన‌సాగుతోంది. ఈ విష‌యంలో టీఆర్ ఎస్ ఒంట‌రి అయ్యేలా క‌నిపిస్తోంది. తొలుత కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, ఆ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నేత‌లు మాత్ర‌మే ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. క్ర‌మంగా ఇత‌ర రాజ‌కీయ పార్టీలు, విద్యార్థి విభాగాలు, మేధావుల నుంచి కూడా వ్య‌తిరేకత‌ వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యార్థుల నిల‌యాలైన విశ్వ విద్యాల‌యాల భూములు స్వాధీనం చేసుకోవ‌డం మంచి సంప్ర‌దాయం కాద‌ని, కేసీఆర్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం సూచించ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ప్ర‌జాగాయ‌కురాలు విమ‌ల‌క్క కూడా కేసీఆర్ నిర్ణ‌యాన్ని త‌ప్పు బ‌డుతున్నారు. పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వ‌డాన్ని అంద‌రూ ఆహ్వానిస్తున్నా, అందుకోసం విద్యార్థులు, ప‌రిశోధ‌న‌ల‌కు నిల‌య‌మైన విశ్వ‌విద్యాల‌యాల భూములు ఇవ్వాల‌నుకోవ‌డం స‌మంజ‌సం కాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.
విద్యార్థులు ఉద్య‌మ‌మే చేప‌ట్టారు.
ఓయూ భూముల ప‌రిర‌క్ష‌ణ పేరుతో విద్యార్థులు మ‌రో ఉద్య‌మానికి తెర‌తీశారు. ఓయూకు వాస్త‌వానికి 1800 ఎక‌రాలు ఉండ‌గా, అందులో 800 ఎక‌రాలు మాయ‌మ‌య్యాయ‌ని ముందు అన్యాక్రాంత‌మైన భూములు స్వాధీనం చేసుకోవాల‌ని విద్యార్థులు కొత్త డిమాండ్ తెర‌పైకి తీసుకురావ‌డంతో టీఆర్ ఎస్ ఇర‌కాటంలో ప‌డింది. ఓయూ భూములు ఆక్ర‌మించార‌ని విద్యార్థులు ఆరోపిస్తున్న నేత‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు ఉండ‌టం ఆ పార్టీకి మింగుడుప‌డ‌ని అంశం. అందుకే మొన్న స్వాగ‌త్ హోట‌ల్ పై, నిన్న తార్నాక పెట్రోల్ బంక్‌పై దాడుల‌తో విద్యార్థులు ఈ విష‌యంలో తామెంత స‌మ‌ర‌దీక్ష‌తో ఉన్నామో తెలియ‌జెప్పారు. ఇదే సంక‌ల్పం, ఉద్య‌మ‌స్ఫూర్తితో తాము స్వ‌రాష్ర్ట సాధ‌న‌కోసం పోరాడామ‌న్న సంగ‌తి కేసీఆర్ మ‌ర‌వ‌డం ఆయ‌న వ్య‌క్తిత్వానికి అద్దం ప‌డుతోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. తాజాగా ఫ్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ కూడా సీఎం నిర్ణ‌యాన్ని తీవ్రంగా తప్పుబ‌ట్టారు. వెంట‌నే నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రోజురోజుకు ప్ర‌జ‌ల్లో విద్యార్థుల ఉద్య‌మానికి ఆద‌ర‌ణ, టీఆర్ ఎస్ నిర్ణ‌యానికి వ్య‌తిరేక‌త పెరిగిపోతున్నాయి. ఇన్ని వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తున్న క్ర‌మంలో త‌న నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్షించుకుంటారా? లేకా మొండిగా ముందుకు వెళ‌తారా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఈ వివాదం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ముగింపు ప‌ల‌క‌డ‌మే టీఆర్ ఎస్‌కు మంచిదని మేధావులు సూచిస్తున్నారు.
First Published:  26 May 2015 9:31 PM GMT
Next Story