Telugu Global
Others

2019 ఎన్నికల లబ్దికోసం "అమరావతి" సాగదీత ?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ నిర్మాణం కేవలం వచ్చే ఎన్నికల రహస్య అంజెడాతో ముందుకు సాగుతున్నది. 2019 ఎన్నికల్లో రాజకీయంగా లబ్దిపొందేందుకే అమరావతిని అప్పటి వరకు సాగదీయాలనే లక్ష్యంతో ఆయన పావులు కదిలిస్తున్నారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని అద్భుతంగా నిర్మించేందుకు మరొక్కసారి తమకు ఎన్నికల్లో అధికారం కట్టబెట్టాలని కోరేందుకు పనులను అప్పటి వరకు ప్రారంభించకుండా సాగదీయాలని నిర్ణయించినట్లు తెలిసింది. భవనాల నిర్మాణం 2019లో ప్రారంభమయ్యే విధంగా 2018లో డెవలపర్‌ను ఖరారు […]

2019 ఎన్నికల లబ్దికోసం అమరావతి సాగదీత ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ నిర్మాణం కేవలం వచ్చే ఎన్నికల రహస్య అంజెడాతో ముందుకు సాగుతున్నది. 2019 ఎన్నికల్లో రాజకీయంగా లబ్దిపొందేందుకే అమరావతిని అప్పటి వరకు సాగదీయాలనే లక్ష్యంతో ఆయన పావులు కదిలిస్తున్నారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని అద్భుతంగా నిర్మించేందుకు మరొక్కసారి తమకు ఎన్నికల్లో అధికారం కట్టబెట్టాలని కోరేందుకు పనులను అప్పటి వరకు ప్రారంభించకుండా సాగదీయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

భవనాల నిర్మాణం 2019లో ప్రారంభమయ్యే విధంగా 2018లో డెవలపర్‌ను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర రాజధాని విజయవాడకు తరలించకుండా హైదరాబాద్‌లోనే 2019 వరకు కొనసాగించేందుకు ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజనానంతరం ఏపీకి రాజధాని లేకపోవటంతో కొత్త రాజధాని నిర్మించేందుకు వివిధ ప్రతిపాదనల అనంతరం మంగళగిరి, తాడికొండ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు సింగపూర్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడి కంపెనీలకు పనులు అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సింగపూర్‌ ప్రభుత్వం రెండు ప్రణాళికలను అందజేసింది. ముఖ్యమైన సీడ్ క్యాపిటల్‌ ప్లాన్‌ను జులై నాటికి అందజేయటానికి ఒప్పందం కుదిరింది.

రాజధాని నిర్మాణం కోసం 55 వేల ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించగా అందులో ప్రధానంగా 33 వేల ఎకరాల భూమి క్యాపిటల్‌ నిర్మాణానికి, రైతులకు వాణిజ్యపరమైన సముదాయాలకు కేటాయిస్తారు. ఈ ప్రణాళిక జులైలో సింగపూర్‌ ప్రభుత్వం అందజేసిన తరువాత దాని ఆధారంగా స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో డెవలపర్‌ను ఎంపిక చేస్తారు.

సహజంగా ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించేందుకు అనుసరించే విధానమే స్విస్‌ ఛాలెంజ్. అయితే ఈ విధానం ప్రపంచ వ్యాప్తంగా విఫలమైంది. బూట్‌, పీపీపీ తరహాలోనే స్విస్‌ ఛాలెంజ్‌ విధానం కూడా ప్రజలకు భారంగా మారి డెవలపర్‌కు, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ఈ స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో డెవలపర్‌ను ఎంపిక చేసిన తరువాత పనులు ప్రారంభించాలి. కానీ ఈ తతంగమంతా ముగియటానికి 2019 వరకు గడువు అవసరమవుతుంది. ఆలోగా అమరావతి ప్రాంతంలో భూ సమీకరణ పూర్తి చేసి నేల చదును చేయటంతో పాటు ఆ ప్రాంతాన్ని భవనాల నిర్మాణానికి అనుకూలంగా మార్చేందుకు అవసరమైన చర్యలను చేపడతారు.

2019 చివరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభం కావటానికి అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికల్లో ఈ అంశం ఆధారంగానే మళ్లీ ఎన్నికలకు వెళ్లి సింగపూర్‌ తరహాలో రాజధాని నిర్మించటానికి తమకు మాత్రమే అవకాశం ఇవ్వాలని ఈ దశలో వేరొకరిని ఎన్నుకుంటే ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ మూలనపడతాయని రాష్ట్రానికి శాశ్వతంగా రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందని జనానికి వివరించి మరోసారి మ్యాండేట్ పొందాలని చంద్రబాబు నాయుడు కోటరీ నిర్ణయించింది. ఇందుకు బాబు అంగీకరించటంతో ఆ విధంగానే ప్రణాళికాబద్ధంగా తమ రాజకీయాలకు అనుగుణంగా అమరావతి పనులు నత్తనడకన తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసే విధంగా జరుగుతున్నాయి. కొత్త రాజధాని నిర్మించే దశలో వేరొకరికి అధికారాన్ని అప్పగిస్తే మళ్లీ మొదటికి వస్తుందని రాజధానిని వేరే ప్రాంతానికి తరలించి సాదా సీదాగా నిర్మిస్తారని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. తాము మాత్రమే ప్రపంచ స్థాయికి తగిన విధంగా సింగపూర్‌ తరహా నిర్మాణాలను చేపట్టగలమని అందుకోసం రాజకీయ అధికారాన్ని తిరిగి తమకే ఇవ్వాలని 2019లో ప్రజలకు వివరించటమే లక్ష్యంగా రాజకీయ ప్రణాళికను అమరావతి రూపంలో చంద్రబాబునాయుడు కోటరీ అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

First Published:  27 May 2015 7:52 PM GMT
Next Story