Telugu Global
Family

కీచకుడు (For children)

కీచకుడు ఒక్కడు కాదు! నూరు మంది!? అన్నదమ్ములు. వారందరూ కీచకులే. ఉపకీచకులే. అసలు కీచకుడు ఒక్కడే. అతడినే సింహబలుడని కూడా అంటారు. ఇతడు బాహు బలంలో బలరామునికీ, భీమునికీ, శల్యునికీ సరి సమానుడు! మహాబలవంతుడు. మత్స్య దేశానికి సేనాపతి. విరాట రాజునకు స్వయానా బావమరిది. అంటే భార్య సుధేష్ణకు తమ్ముడు. తమ్ముడంటే ఆమెకుప్రాణం. కీచకుడంటే శత్రురాజులకు ప్రాణ భయం. అంచేత కన్నెత్తి ఎవరూ తమ దేశం వంక చూసే సాహసం చేసేవారే కాదు. అంచేత విరాట్‌ రాజు […]

కీచకుడు ఒక్కడు కాదు! నూరు మంది!? అన్నదమ్ములు. వారందరూ కీచకులే. ఉపకీచకులే. అసలు కీచకుడు ఒక్కడే. అతడినే సింహబలుడని కూడా అంటారు. ఇతడు బాహు బలంలో బలరామునికీ, భీమునికీ, శల్యునికీ సరి సమానుడు! మహాబలవంతుడు. మత్స్య దేశానికి సేనాపతి. విరాట రాజునకు స్వయానా బావమరిది. అంటే భార్య సుధేష్ణకు తమ్ముడు. తమ్ముడంటే ఆమెకుప్రాణం. కీచకుడంటే శత్రురాజులకు ప్రాణ భయం. అంచేత కన్నెత్తి ఎవరూ తమ దేశం వంక చూసే సాహసం చేసేవారే కాదు. అంచేత విరాట్‌ రాజు కీచకుని చేతిలో కీలు బొమ్మనే చెప్పాలి!

అరణ్యవాసం పూర్తి చేసిన పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ విరాటుని కొలువులోనే ఉన్నారు. ద్రౌపది “సైరంధ్రి”గా విరాటరాజు ఇంటనే ఉంది. కీచకుడు కన్ను వేశాడు. కావాలనుకున్నాడు. అక్క దగ్గరకు వచ్చి తన కోరిక బయట పెట్టుకున్నాడు. సుధేష్ణ వద్దని వారించింది. పెళ్ళయిందని, ఐదుగురు భర్తలున్నారని, వారంతా గంధర్వులని చెప్పి చూసింది. వినలేదు. ఆమె ఎవరైనా సరే మనకి పరిచారిక అన్నాడు. ఈ రాజ్యంలో నాకు ఎదురులేదు, నేను తలచుకుంటే ఆమెను పొందడం ఒక లెక్క కాదన్నాడు. తన దగ్గరకు పంపమన్నాడు. తర్వాత సంగతి తాను చూసుకుంటానన్నాడు. సుధేష్ణ ఎదురు చెప్పలేక పోయింది.

ఒకరోజు సైరంధ్రిని పిలిచి బంగారపు మధు పాత్ర ఇచ్చి కీచకుని ఇంటికి వెళ్ళి మద్యం తీసుకు రమ్మంది. సైరంధ్రి గ్రహించింది. అనుమానించింది. వెళ్ళనని చెప్పింది. అయితే సుధేష్ణ యజమానురాలుగా ఆజ్ఞాపించేసరికి వెళ్ళక తప్పలేదు. అవకాశం కోసమే కాచుకున్న కీచకుడు మోహ దాహంతో సైరంధ్రిని బలాత్కారం చేయబోతే తప్పించుకు పరిగెత్తింది. కీచకుడు వెంట పడ్డాడు విరాట కొలువు వరకూ. రాజు విరాటుని వేడుకుంది. అతను వారించలేక పోయాడు. ఏడ్చింది. సభ సమక్షంలో కీచకుడు సైరంధ్రిని కాలితో తన్నాడు. ఆ సమయంలో ధర్మరాజు అక్కడే ఉన్నా అడ్డుకోలేదు, అదే జరిగితే తమ అజ్ఞాతవాసం బయట పడుతుంది. ఓర్పుతో నిలవరించుకున్నాడు. ఆరాత్రి భీముని ముందు తన దుఃఖాన్నీ కోపాన్నీ వెళ్ళగక్కింది సైరంధ్రి. వంటవాడిగా ఉన్న భీముడు ఉడికిపోయాడు. కీచకుణ్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసాడు. పథకం వేసాడు. సైరంధ్రి సరేనంది. ఇంకేముంది? సైరంధ్రి కీచకునిపై ప్రేమనటించింది. నేను దాసీని, మీరు ప్రభువులు అంది. అలాగని విచ్చల విడిగా ప్రవర్తించకూడదంది. గుట్టూ మట్టూ ఉండాలంది. రాత్రికి నాట్యశాలకు వస్తే కోరిక తీరుస్తానంది. కీచకుడి ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడు రాత్రవుతుందా అని చూశాడు. వెళ్ళాడు. ముసుగేసుకువున్నదీ తనకోసం నిరీక్షిస్తున్నదీ సైరంధ్రేననుకొని చెయ్యివేశాడు. చూస్తే సైరంధ్రి కాదు. భీముడు! అంతే… అవమానంతో కీచకుడు, ఆగ్రహంతో భీముడు ఒకరి మీద ఒకరుపడి పిడిగుద్దులతో మల్ల యుద్ధానికి దిగారు. కీచకుణ్ని ఒడిసిపట్టి కాళ్ళూ చేతులూ విరిచి ముద్దచేసి గొంతు నులిమాడు భీముడు. అంతా గుట్టుగానే జరిగిపోయింది.

కీచకుని పీడ విరగడైనందుకు సైరంధ్రి మాత్రమే కాదు, ప్రజలంతా ఎంతో సంతోషించారు. కీచకుని చావు గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు! తరువాత నూరుగురు కీచకులు వస్తే, రెండోకంటికి తెలియకుండా భీముడే మట్టుబెట్టాడు.

కామంతో కన్నూ మిన్నూ కానక పరస్త్రీలను ప్రలోభ పరిచేవాళ్ళను… లేదా దండించే వాళ్లని, దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళను వెంటాడే కిరాతకులను కీచకునితో ఇప్పటికీ పోల్చుతూనే ఉంటారు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  27 May 2015 1:02 PM GMT
Next Story