Telugu Global
Family

పాండురాజు (For Children)

ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు… ఔను… ఈ ఐదుగురూ పంచ పాండవులు. వీరికి తల్లి కుంతి. తండ్రి పాండురాజు. పాండురాజు విచిత్ర వీర్యుని క్షేత్రజ కుమారుడు. క్షేత్రజుడు అంటే దేవరాది న్యాయంతో భార్యకు పుట్టినవాడని అర్థం. విచిత్ర వీర్యుడు భోగలాలసుడయి క్షయరోగంతో మరణిస్తే – అతని భార్యలైన అంబిక అంబాలికలలో – అంబాలికకు ఆమె అత్త సత్యవతి ఆజ్ఞతో – భీష్ముని అనుమతితో – వేద వ్యాసునికి పుట్టిన వాడే పాండురాజు. వంశం లేకుండా అయిపోతుందని […]

ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు… ఔను… ఈ ఐదుగురూ పంచ పాండవులు. వీరికి తల్లి కుంతి. తండ్రి పాండురాజు. పాండురాజు విచిత్ర వీర్యుని క్షేత్రజ కుమారుడు. క్షేత్రజుడు అంటే దేవరాది న్యాయంతో భార్యకు పుట్టినవాడని అర్థం. విచిత్ర వీర్యుడు భోగలాలసుడయి క్షయరోగంతో మరణిస్తే – అతని భార్యలైన అంబిక అంబాలికలలో – అంబాలికకు ఆమె అత్త సత్యవతి ఆజ్ఞతో – భీష్ముని అనుమతితో – వేద వ్యాసునికి పుట్టిన వాడే పాండురాజు. వంశం లేకుండా అయిపోతుందని సంతానం కోరి అంబాలికను వేదవ్యాసుని దగ్గరకు పంపించారు. వ్యాసుని రూపం చూసి అంబాలిక తెల్లబోయింది. అందుకే అంబాలికకు పాలిపోయిన పాండు వర్ణం… అంటే తెల్లని రంగుతో పుట్టాడు పాండురాజు.

పాండురాజు భీష్ముని ఆదరణలో పెరిగాడు. భీష్ముని ఆధ్వర్యంలోనే సకల విద్యలూ నేర్చుకున్నాడు. కుంతిని స్వయం వరంలో ఆమె ఇష్టపడగా పెళ్ళి చేసుకున్నాడు. కళ్ళులేని అన్న ధృతరాష్ట్రునకు చేదోడు వాదోడుగా ఉండడమే కాదు, రాజ్యాలన్నీ గెలిచి సంపదనంతా అన్నకు అప్పగించాడు. మాద్రిని మరో భార్యని చేసుకున్నాడు.

అయితే పాండు రాజుకు వేటంటే ప్రీతి. అంతకు మించి వ్యసనం. ఆ ఆనందం మాటునే ఆపద పొంచివుందని తెలీదు. జంటగా తిరుగుతున్న రెండు జింకల్ని చూసాడు. అవి ఒకదానితో ఒకటి ఆడుకుంటున్న సమయంలో బాణాలతో కొట్టాడు. మునిదంపతులే జింకల రూపం ధరించారని పాండు రాజుకు తెలీదు. ఆముని దంపతులు ప్రాణాలు విడుస్తూ “నువ్వు చేసిన ఈపాపం నిన్ను చుట్టుకుంటుంది. నువ్వు నీ భార్యను కలిసిన క్షణమే చస్తావు, మరుక్షణం నీ భార్య కూడా!” అని శపించారు.

అది మొదలు పాండురాజు అడవులకు పోయాడు. భార్యలైన కుంతి, మాద్రిలు వెంటవున్నా బ్రహ్మచర్యం పాటించాడు. తపోదీక్షలోనే కాలం గడిపాడు. కాని పిల్లలు లేరన్న బాధ ఎక్కువ బాధించేది. అప్పటికే కుంతి దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రోపదేశం గురించి భర్తకు చెప్పింది. అతని అనుమతితోనే యుముని వల్ల ధర్మరాజునీ, వాయుదేవుని వల్ల భీముణ్ని, ఇంద్రుని వల్ల అర్జునున్ని కన్నది. కుంతి సహాయంతోనో రెండో భార్య మాద్రి అశ్వీనీ దేవతల వలన నకుల సహదేవులను కన్నది. పాండురాజు దుఃఖం ఈ విధంగా కొంత ఉపశమించింది. క్షేత్రజ కుమారుడు పాండురాజు తనూ క్షేత్రజుడయినాడు! ధర్మరాజుకు పదహారేళ్ళు వచ్చే సమయానికి – పాండురాజు తపస్సే వృత్తిగా కుంతీ మాద్రిలతో ఉన్నాడు. కుంతి ఇంటికి వచ్చిన అతిధులకు భోజనాలు పెడుతోంది. అందాల పరిమళంతో ఉన్న మాద్రి పట్ల మోహంతో ప్రవర్తించాడు పాండురాజు. వద్దని వారించింది మాద్రి. కోరికలో ఉండి శాపాన్ని మరిచిపోయాడు. అంతే మరణించాడు. భర్త మరణానికి తానే కారణంగా భావించింది మాద్రి. ఆ దుఃఖంతో ప్రాయశ్చిత్తంగా భర్త కాలుతున్న చితిలోకి దూకింది. అగ్నికి ఆహుతై పోయింది. శపించిందే జరిగింది.

అలా ముగిసింది పాండురాజు కథ!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  29 May 2015 1:02 PM GMT
Next Story