Telugu Global
Others

తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిసంద‌డి

ఒకవైపు రెండు ఆషాఢాలు (అధిక, నిజ ఆషాఢం).. మరోవైపు గోదావరి పుష్కరాలు.. తరుముకొస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిసంద‌డి మొద‌ల‌య్యింది. శుభ‌కార్యాలు చేసే వాళ్ళు చాలా తొంద‌ర ప‌డుతున్నారు. మ‌రో ప‌ది రోజుల్లో చేయ‌క‌పోతే నాలుగు నెల‌లు ఆగి తీరాల్సిందే. ఒక‌వేళ గోదావ‌రీ తీర ప్రాంతం వార‌యితే మ‌రో 15 నెల‌లు ఆగాలి. అందుకే ప్ర‌స్తుతం అంద‌రూ తొంద‌ర ప‌డుతున్నారు. జూన్ 11 తర్వాత ముహూర్తాలు లేవు. అందుకే ఈ 11 రోజుల్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసేందుకు వేలాదిమంది […]

తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిసంద‌డి
X
ఒకవైపు రెండు ఆషాఢాలు (అధిక, నిజ ఆషాఢం).. మరోవైపు గోదావరి పుష్కరాలు.. తరుముకొస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిసంద‌డి మొద‌ల‌య్యింది. శుభ‌కార్యాలు చేసే వాళ్ళు చాలా తొంద‌ర ప‌డుతున్నారు. మ‌రో ప‌ది రోజుల్లో చేయ‌క‌పోతే నాలుగు నెల‌లు ఆగి తీరాల్సిందే. ఒక‌వేళ గోదావ‌రీ తీర ప్రాంతం వార‌యితే మ‌రో 15 నెల‌లు ఆగాలి. అందుకే ప్ర‌స్తుతం అంద‌రూ తొంద‌ర ప‌డుతున్నారు. జూన్ 11 తర్వాత ముహూర్తాలు లేవు. అందుకే ఈ 11 రోజుల్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసేందుకు వేలాదిమంది సిద్ధమయ్యారు. ఇక జూలై 14న గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇదే రోజూ గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అంతా పెద్దల్ని స్మరించుకుంటూ తర్పణం సమర్పిస్తారు. ఇలా పుష్కరాలు ప్రారంభమైన నాలుగైదు మాసాల వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు పెద్దగా లేవు. ఇక గోదావరి నదీ తీరప్రాంతంలోని వారైతే 2016 ఆగస్ట్ వరకూ ఎలాంటి శుభకార్యాలు చేయకూడదట. మిగిలిన వారు మాత్రం దసరా తర్వాత పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసుకోవచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు దాటిన తర్వాత ఏడాది పాటు ఎలాంటి ముహూర్తాలూ ఉండవు. అయితే ఉత్తమ పక్షం లేకపోయినప్పటికీ.. కొన్ని దోషాలు ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో ముహూర్తాలు అంగీకారమే అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు, ప్రముఖ జోతిష్య పండితుడు డాక్టర్ సీవీబీ సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. జూన్ 11 తర్వాత ఆగస్టు 2016 వరకూ మంచి రోజులు లేవని కొంతమంది పండితులు చెపుతుంటే.. అలాంటిదేమీ లేదు నవంబర్ నుంచి ముహూర్తాలు పెట్టుకోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఇది గోదావరి తీరప్రాంత వాసులకే వర్తిస్తుందని, మిగతా వారు దసరా తర్వాత శుభకార్యాలు చేసుకోవచ్చని ప్రముఖ జోతిష్య పండితుడు సింహంభట్ల సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
జూన్ 11 త‌ర్వాత ముహూర్తాలు లేక‌పోవ‌డంతో వరుసగా పెళ్లిళ్ల సంద‌డే సంద‌డి అన్న‌ట్టు ఉంది. దీంతో ఫ‌ంక్షన్ హాళ్లు, పురోహితులకు మాంచి డిమాండ్ ఏర్పడింది. హైద‌రాబాద్‌లో మూడు వేలకుపైగా ఫంక్షన్‌హాళ్లు ఉండగా అన్నీ ఇప్పటికే బుక్కయ్యాయి. ఫంక్షన్‌హాళ్లు బుక్కైపోవడంతో బస్తీల్లో ఖాళీ స్థలం కన్పిస్తే చాలు మండపం వేసేస్తున్నారు. ఇక పురోహితులకు సామాన్య, మధ్యతరగతి వారు వివాహానికి రూ.1,116 నుంచి రూ.10,116 వరకూ, ధనికులైతే బంగారాన్ని, ఎన్‌ఆర్‌ఐలైతే డాలర్లను సంభావనగా సమర్పించుకోవాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మరోవైపు బ్యాండ్ బాజాలు, వంటవాళ్లు, డెకరేటర్లు, ఈవెంట్‌మేనేజర్లు కూడా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు.
First Published:  30 May 2015 11:12 PM GMT
Next Story