2029నాటికి దేశంలో ఏపీ నెంబ‌ర్ ఒన్: చ‌ంద్ర‌బాబు

తెలుగు ప్ర‌జ‌లంతా క‌లిసి ఉండాల‌ని, తెలుగుజాతి ప్ర‌పంచ వ్యాప్తంగా వెలుగులు పంచాల‌ని తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నంద‌మూరి తార‌క రామారావు కోరుకున్నార‌ని ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కే క‌ట్టుబ‌డి త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లోని బెంజ్‌స‌ర్కిల్‌లో ప్ర‌భుత్వ పున‌రంకిత కార్య‌క్ర‌మం… న‌వ నిర్మాణ దీక్ష చేపట్టారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రం అభివృద్ధికి అంద‌రూ క‌ట్టుబ‌డి ఉండాలని కోరుతూ ప్ర‌జ‌ల‌తో ఆయ‌న ప్ర‌తిజ్ఞ చేయించారు. 2020నాటికి దేశంలో మూడో ఉత్త‌మ రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉండాల‌ని, 2029నాటికి దేశంలో ఉత్త‌మ రాష్ట్రంగా నిల‌బ‌డాల‌ని… ఇందుకు అనుగుణంగా అభివృద్ధి చేయ‌డానికి మ‌న‌మంతా పున‌రంకితం కావాల‌ని ఆయ‌న ప్ర‌తిజ్ఞ చేయించారు. ఏపీ అభివృద్ధికి రాత్రింబవళ్లు కృషి చేస్తానని ఇందుకు 5 కోట్ల మంది ప్రజలు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరో పదేళ్లు కష్టపడి ఏపీని అభివృద్ధి చేద్దామన్నారు. ఇరురాష్ర్టాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు తెలిపారు. 
న‌వ నిర్మాణ దీక్ష తెలంగాణ‌కు వ్య‌తిరేకం కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లంతా క‌లిసిక‌ట్టుగా ఉంటే అద్భుత‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిర్మించ‌డం ఏ మాత్రం క‌ష్టం కాద‌ని ఆయ‌న అన్నారు. అభివృద్ధి కోసం తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, ప్ర‌జ‌లంతా త‌న‌కు అండ‌గా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.  కాంగ్రెస్ నాయ‌కురాలు ఇందిరాగాంధీ కూడా తెలుగు ప్ర‌జ‌లంతా క‌లిసి ఉండాల‌ని కోరుకున్నార‌ని, అది తెలియ‌ని కొంత‌మంది స్వార్థ‌ప‌రులు రాజ‌కీయ ల‌బ్ధే ప‌ర‌మావ‌ధిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విడ‌గొట్టి ప‌డేశార‌ని, ఇది ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని దెబ్బ‌తీసింద‌ని ఆయ‌న అన్నారు. సోనియాగాంధీ ఏక‌ప‌క్షంగా చేసిన నిర్ణ‌యం వ‌ల్లే విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంతో న‌ష్ట‌పోయింద‌ని ఆయ‌న అన్నారు.