జులైలో 25 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్: కేసీఆర్‌

వ‌చ్చేనెల‌లో 25 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తున్నామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు తెలిపారు. జులై నుంచే కాంట్రాక్టు కార్మికుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కూడా చేప‌డ‌తామ‌ని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా పెరెడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వేడుక‌లో ఆయ‌న పోలీసుల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఎన్నో క‌ష్టాల‌కోర్చి సాధించుకున్న తెలంగాణ‌ను ఇష్ట తెలంగాణ‌గా మార్చుకుందామ‌ని ఆయ‌న‌ పిలుపు ఇచ్చారు. ఈ యేడాది కాలంలో త‌మ ప్ర‌భుత్వం అన్నివ‌ర్గాల కోసం ఎన్నో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల‌కు రూ. 28 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నామ‌ని, మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం షీ టీమ్‌లు ఏర్పాటు చేశామ‌ని,  రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 43 శాతం, ఆర్టీసీ ఉద్యోగుల‌కు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామ‌ని, ఇది రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఓ రికార్డ‌ని కేసీఆర్ చెప్పారు. ఇంకా పోలీసు వ్య‌వ‌స్థ‌కు ఆధునిక హంగులు స‌మ‌కూర్చామ‌ని, అంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌ల‌కు, హోంగార్డుల‌కు వేత‌నాలు పెంచామ‌ని ఆయ‌న అన్నారు.
     అన్న‌దాత‌లు ఆనందంగా ఉండాల‌న్న ల‌క్ష్యంతో 17 వేల కోట్ల రుణాల‌ను రైతుల‌కు మాఫీ చేస్తున్నామ‌ని, రాష్ట్రంలోని చెరువుల‌న్నీ పున‌రుద్ద‌రిస్తున్నామ‌ని, దీనివ‌ల్ల రాబోయే కాలంలో పంట విస్తీర్ణం పెరుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ వ‌స్తే ఎన్నో స‌మ‌స్య‌లు, ఇబ్బందులు వ‌స్తాయ‌ని ప్ర‌చారం చేశార‌ని, రాష్ట్రం అంధ‌కారం అయిపోతుంద‌ని నోటికొచ్చిన మాట‌లు చెప్పార‌ని, ఈ ఎండాకాలంలో కోత‌లు లేకుండా క‌రెంట్ ఇచ్చామ‌ని, 2018 నాటికి ఎలాంటి అంత‌రాయం లేకుండా క‌రెంట్ ఇస్తామ‌ని ఆయ‌న చెబుతూ రూ. 91 వేల కోట్ల‌తో విద్యుత్ ప్రాజెక్టులు చేప‌డ‌తామ‌ని అన్నారు. 35 వేల కోట్ల‌తో పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప్రారంభిస్తామ‌ని, ఈ నెల‌లోనే కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని కూడా ప్రారంభిస్తామ‌ని కేసీఆర్ తెలిపారు. రూ. 2500 కోట్ల‌తో 50 వేల డ‌బుల్ బెడ్‌రూం గృహాలు నిర్మిస్తామ‌ని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5.04 ల‌క్ష‌లు వెచ్చిస్తామ‌ని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం ప‌రిఢ‌విల్లేలా చేయ‌డానికి 300 కోట్ల మొక్క‌ల్ని పెంచనున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.