Telugu Global
Others

ప్రైవేటు డిటెక్టివ్‌లే రేవంత్‌ను పట్టించారా?

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు క్రాస్‌ ఓటింగ్‌ కోసం ముడుపులు ముట్టచెబుతూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి వ్యవహారంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తనకు బలం లేకపోయినా ఐదో అభ్యర్థిని రంగంలోకి దింపటంతో ఎలాగైనా క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా ఐదో అభ్యర్థిని ఓడించి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌లకు షాక్‌ ఇచ్చి తన సత్తా చాటుకోవాలని చంద్రబాబు పన్నిన పన్నాగాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు ప్రభుత్వంలోని నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టినట్లు తెలిసింది. […]

ప్రైవేటు డిటెక్టివ్‌లే రేవంత్‌ను పట్టించారా?
X

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు క్రాస్‌ ఓటింగ్‌ కోసం ముడుపులు ముట్టచెబుతూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి వ్యవహారంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తనకు బలం లేకపోయినా ఐదో అభ్యర్థిని రంగంలోకి దింపటంతో ఎలాగైనా క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా ఐదో అభ్యర్థిని ఓడించి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌లకు షాక్‌ ఇచ్చి తన సత్తా చాటుకోవాలని చంద్రబాబు పన్నిన పన్నాగాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు ప్రభుత్వంలోని నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టినట్లు తెలిసింది. ఇందుకు ఫోన్‌ ట్యాపింగ్‌తో పాటు ఇతరత్రా మార్గాలలోనూ, కోవర్టుల ద్వారానూ స్పష్టమైన సమాచారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ముందుగానే సంపాదించగలిగారు.

ఈ నేపథ్యంలో పకడ్బందీగా రేవంత్‌ రెడ్డిని పట్టుకుని ఆయనతోపాటు చంద్రబాబును అప్రతిష్టపాలు చేయాలనే ప్రణాళికను ఆయన స్థాయిలోనే రచించారు. ఇందులో పార్టీ నాయకులకు గాని, ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులకు గాని తెలియకుండా జాగ్రత్తపడి తన స్థాయిలోనే ఆయన పథక రచన చేసినట్లు తెలిసింది. ఇందుకోసం టీఆర్‌ఎస్‌ వైపు నుంచి నామినేటెడ్‌ ఎమ్మెల్యేతోపాటు ఆంగ్లో ఇండియన్‌ క్రిస్టియన్లను రంగంలోకి దింపారు. ఆ ప్రకారం ఉత్సాహంగా ఉన్న రేవంత్‌రెడ్డిని తమ బోనులోకి పిలుపించుకుని మొత్తం వ్యవహారాన్ని మొదటిసారే రికార్డు చేయించారు. ఇందుకోసం ఒక టీవీ ఛానెల్‌ యంత్రాంగాన్ని ఉన్నతస్థాయిలో ఉపయోగించుకోగా అది ఆశించిన ఫలితాలు సాధించలేక విఫలమయ్యిందని తెలిసింది. దాంతో వ్యవహారాన్ని మరికొంత సాగదీసి ఆలోగా ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలను రంగంలోకి దింపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఏ ఉద్దేశ్యంతో ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీని వాడుకుంటున్నారనే విషయం వారికి కూడా తెలియనివ్వలేదు.

హైదరాబాద్‌లో 10 వరకు ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా నిఘా వర్గాలు కూడా ఆధారపడుతుంటాయి. ఈ ఏజెన్సీలు అత్యంత సమర్థంగా పనిచేసి సమాచారాన్ని సేకరించడంతోపాటు ట్యాపింగ్‌, స్టింగ్‌ ఆపరేషన్‌ లాంటివి నిర్వహించటంలో సమర్థత కలిగి ఉన్నాయి. నగరంలో ఉన్న ఏజెన్సీల్లో రెండు ఏజెన్సీలు అత్యంత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఈ ఏజెన్సీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా అనుమతులు కూడా ఉన్నాయి. అయితే ట్యాపింగ్‌ చేసేందుకు ప్రభుత్వ సహకారంతో టెలికాం ఏజెన్సీల అనుమతులతో (అనధికారికంగానైనా) సాగించాలి. ఈ పనిని సజావుగా పూర్తి చేసిన తరువాతనే స్టింగ్‌ ఆపరేషన్‌ కోసం కేసీఆర్‌ ఉన్నతస్థాయిలోనే దృష్టి పెట్టారు. ఎవరికీ తెలియకుండా అత్యంత నమ్మకమైన వ్యక్తి ద్వారా ఏజెన్సీకి అప్పగించటంతో ఎమ్మెల్యే తనయుని ఇంటిలో అన్ని వైపులా దాదాపు పది వరకు బటన్‌ కెమెరాలను, ఆడియో, వీడియో రికార్డింగ్‌ అమర్చారు.

ఈ విషయాలేవీ మధ్యవర్తులకు గాని, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి కాని తెలియదు. ఎమ్మెల్యేకు ఆయన తనయుడికి మాత్రమే తెలుసు. వాటిని అమర్చిన ఏజెన్సీకి మధ్యలో ఉన్న వ్యక్తికి కూడా ఏ ప్రయోజనం కోసం అమరుస్తున్నారనేది కూడా తెలియదు. ఆ పని ముగించి వారి దారిన వారు వెళ్లిపోయాక రేవంత్‌రెడ్డి బ్యాగ్‌లో నోట్ల కట్టలతో అక్కడికి ప్రవేశించినప్పటి నుంచి అంతా పక్కాగా రికార్డు అయ్యింది. అయితే తనను అరెస్టు చేసే సమయానికి కూడా రేవంత్‌రెడ్డికి స్టింగ్‌ ఆపరేషన్‌లో తాను పట్టుబడిపోయాననే విషయం తెలియదు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే ఒక మీడియా గ్రూపుకు కూడా ఈ విషయం తెలియదు. తొలుత రేవంత్‌రెడ్డి బుకాయించినట్లుగానే ఆ మీడియా సంస్థ కూడా అసలు అటువంటిదేమీ జరగలేదంటూ కథనాలను ఇచ్చింది. కానీ సాయంత్రం దాటిన తరువాత మాత్రమే వీడియోలు ఎంపీ4, ఎంపీ3 ఫార్మెట్లలో బయటకు వచ్చేశాక రేవంత్‌, చంద్రబాబుతో పాటు మీడియా కూడా ఉలిక్కిపడింది. తాము ఈ విధమైన స్టింగ్‌ ఆపరేషన్‌ కోసం వీటిని ఏర్పాటు చేశామా అంటూ డిటెక్టివ్‌ ఏజెన్సీ హెడ్‌ కూడా అవాక్కయినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రేవంత్‌రెడ్డిని, మరో ఇద్దరిని అరెస్టు చేసి నోట్ల కట్టలు స్వాధీనం చేసుకునే సమయానికి వారికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఫిర్యాదు మినహా ఎటువంటి ఆధారం లేదు. స్టింగ్‌ ఆపరేషన్‌కు అవసరమైన కెమెరాలు ఏర్పాటైన సంగతి ఏసీబీ అధికారులకు, చివరికి హోం మంత్రి నాయని నరసింహారెడ్డికి కూడా తెలియదు. రాత్రి 7-8 గంటల సమయంలోనే వీడియో ఆధారాలు అన్నీ బయటకు రావటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

12 ఏళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని స్థిరంగా, శాంతియుతంగా నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో చతురత ప్రదర్శించిన కేసీఆర్‌ ఈ విధమైన స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా కూడా ప్రత్యర్థిని శరాఘాతానికి గురి చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తనదైన శైలిలో ఆయన తనవైపునకు తిప్పుకుంటూ క్రమంగా బలం పెంచుకుంటున్నారు. అదే సమయంలో బలమైన పునాది ఉన్న తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని బలహీనపరిచేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆక్రమంలోనే ఇప్పుడు స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడేయగలిగారు. అటు చంద్రబాబునాయుడు, ఇటు రేవంత్‌రెడ్డి సమర్థంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లగలరన్న ధైర్యాన్ని దెబ్బతీసి బలహీనపరచటంలో కేసీఆర్‌ విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారి ద్వారా ఆయన వ్యూహాన్ని ముందుగానే పసిగట్టడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఉన్నవారిని తన కోవర్టులుగా మార్చుకోవటంలో ఎత్తుకు పైఎత్తు వేశారు. అసలు ఈ తరహా పనులన్నీ చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతారు. కానీ ఆయన శిష్యుడు కావడం వల్లనే కాబోలు కేసీఆర్‌ అంతకన్నా పకడ్బందీగా స్టింగ్‌ నిర్వహించి రేవంత్‌, చంద్రబాబు కాళ్లకు బంధం వేయగలిగాడు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు విశ్వసనీయత, ఆత్మస్థైర్యం, సామర్థ్యాన్ని దెబ్బతీయటంతోపాటు టీఆర్‌ఎస్‌లోని తోకాడించేవారికి కూడా బలమైన హెచ్చరికలను కేసీఆర్‌ పరోక్షంగా పంపించారని ఆ పార్టీలోని సీనియర్లే చర్చించుకుంటున్నారు.

టీఆర్‌ఎస్‌లో కొంత అసంతృప్తి ఉంది. కేసీఆర్‌ వ్యవహారశైలి, కుటుంబ పాలనలపై ఆపార్టీలోని సీనియర్లు, కొందరు మంత్రులు సైతం అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో హరీష్‌ రావు తనకంటూ వర్గాన్ని ఏర్పర్చుకుంటున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ చెక్‌ పెట్టేందుకు కేసీఆర్‌ స్టింగ్‌ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ వారితో ఏ వ్యవహారం మాట్లాడాలన్నా ఎవరైనా భయపడే పరిస్థితులు ఒక్క బుల్లెట్‌కు ఎన్ని పక్షులు నేలరాలాయో చెప్పలేనంత ఫలితం కేసీఆర్‌ అంబులపొదిలోకి చేరింది.

First Published:  2 Jun 2015 6:27 AM GMT
Next Story